నూతన వీసీలు వర్సిటీలను బాగుపర్చాలి!

New VCs should improve universities!

Update: 2024-03-06 00:15 GMT

తెలంగాణ రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు నూతన వైస్ ఛాన్సలర్‌ల నియామకాలకు రాష్ట్ర విద్యాశాఖ జనవరి 27న నోటిఫికేషన్ ఇచ్చింది. నూతన వీసీ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 1382 దరఖాస్తులు వచ్చాయి. అయితే గత ప్రభుత్వం నియమించిన వీసీల పదవి కాలం 3 నెలలు మిగిలి ఉండగానే ఇంఛార్జీలను పెట్టకుండా నూతన వీసీల నియమకాలను చేయాలని నిర్ణయించడం అభినందనీయం.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా ఉన్న వర్శిటీలు నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాలకు కేటాయిస్తున్న నిధులు సరిపోక, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక, విలవిల్లాడుతున్నాయి. దీనికి గత ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేపడుతున్న ఈ నియామకాల ద్వారా మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల సమస్యలు పరిష్కారం చేసి అభివృద్ధి చేసినప్పుడే అసలైన మార్పు జరుగుతుంది. వైస్-ఛాన్సలర్ నియమాలు పారదర్శకంగా జరిగినప్పుడు వర్శిటీల అభివృద్ధి సాధ్యం అవుతుంది.

ఖాళీల భర్తీ అవసరం

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు యూనివర్శిటీలు నిధులు క్రమంగా తగ్గాయి. అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు శూన్యం. కొత్తగా మహిళా, ఫారెస్ట్ యూనివర్శిటీలను గత ప్రభుత్వం తీసుకొని వచ్చిన బోర్డు తప్ప కనీసం సౌకర్యాలు, ఫ్యాకల్టీ నియమాకాలను చేపట్టలేదు. నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ యూనివర్సిటీల ప్రాధాన్యత తగ్గించే కుట్రలు చేస్తున్నారు. 2013 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర యూనివర్శిటీలలో నియామకాలు లేవు. గత ప్రభుత్వం తమకు తెలియకుండా నియామకాలు చేపట్టవద్దని జీ.వో. తెచ్చింది. రాష్ట్ర యూనివర్శిటీల్లో కేవలం 24 శాతం మాత్రమే రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. 76 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2020లోనే ప్రభుత్వమే ప్రకటించిన విధంగా రాష్ట్రంలో 8000 బోధన, బోధనేతర ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో 2828 పోస్టులు మంజూరు కాగా 1869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 238 ఫ్రొఫెసర్, 781 - అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపకులు లేకపోవడంతో పరిశోధనలు కాదు, కనీసం చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. ఫ్రొఫెసర్ ఎక్కువ మంది ఉంటే మన రాష్ట్ర యూనివర్శిటీలకు ఎక్కువ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది, కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచనలు లేవు.

ప్రత్యామ్నాయ విధానాలు ఆలోచించాలి!

రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రధానంగా యూనివర్సిటీ విద్య అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం అయినా కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలి. గత ప్రభుత్వం కనీసం ఒక్కసారి కూడా యూనివర్సిటీ విద్య, సౌకర్యాలపై సమీక్ష చేయలేదు, నూతన ప్రభుత్వం రెగ్యులర్ సమీక్ష చేసి సమస్యలు పరిష్కారం చేయాలి. ధ్వంసం అయిన విద్య అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేద వర్గాల విద్యార్ధులను పరిశోధనలు చేయడానికి ప్రోత్సాహం అందించేలా నేషనల్ ఫెలోషిప్స్ రాని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 25 వేల రూపాయలు ఫెలోషిప్స్ ఇవ్వాలి. పీజీ నుండి ప్రోత్సాహం అందించేలా పీజీ విద్యార్థులకు నెలకు 5000 వేలు ఫెలోషిప్స్ ఇవ్వాలి. యూనివర్శీటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలి. రానున్న వీసీల నియామకాలు ఒక్కటే కాకుండా ఈ చర్యలు తీసుకుని ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్శిటీలను, వాటి అనుబంధ క్యాంపస్లను అభివృద్ధి చేయాలి.

టి.నాగరాజు,

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి,

94900 98292

Tags:    

Similar News