మార్కెట్లో నయా ట్రెండ్.. డ్రై ప్రమోషన్
సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో పనితీరులో ఎప్పటికప్పుడు సరికొత్త పోకడలు వాడుకలోనికి రావడం మనం చేస్తూనే ఉన్నాము.
సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో పనితీరులో ఎప్పటికప్పుడు సరికొత్త పోకడలు వాడుకలోనికి రావడం మనం చేస్తూనే ఉన్నాము. ప్రధానంగా కోవిడ్ సంక్షోభంలో సాఫ్ట్ వేర్ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత మూన్‌లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వెట్ క్విటింగ్ పేరుతో జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్‌లు చూస్తూ వచ్చాము. దానిలో భాగంగానే ఇప్పుడు డ్రై ప్రమోషన్ అనే కొత్త ట్రెండ్ ప్రచారంలోకి వచ్చింది.
ప్రభుత్వ రంగంలో నైనా ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగుల ప్రాథమిక లక్ష్యం తాను పనిచేసే సంస్థలో వేతనాలు సౌకర్యాల పెరుగుదలతో కూడిన పదోన్నతి సాధించడం. సాధారణంగా ఉద్యోగికి లభించే ప్రమోషన్ అతను పనిచేస్తున్న కాలాన్ని బట్టి అతని పనిచేస్తున్న తీరును బట్టి అతని నైపుణ్యాన్ని బట్టి పదోన్నతి కల్పించడం జరుగుతుంది.
ఈ ట్రెండ్‌కి కారణం..
ఉద్యోగులు తనకు పదోన్నతి లభించడాన్ని సంతోషంగా భావిస్తారు. కారణం తనకు హోదాతో పాటు వేతనం పెంపు ఉంటుందని. అలా కాకుండా పదోన్నతి వచ్చి, వేతనంలో స్వల్ప పెరుగుదల వచ్చినా అటువంటి పదోన్నతిని తిరస్కరిస్తూ గత ఉద్యోగ బాధ్యతలను కొనసాగించే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రస్తుతం పదోన్నతులు విషయంలో పై పరిస్థితులకు భిన్నంగా ప్రపంచ జాబ్ మార్కెట్లో కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నాయి. వాటిలో ప్రస్తుతం చర్చల్లో కనిపిస్తున్న ట్రెండ్ ‘డ్రై ప్రమోషన్’ ఈ ట్రెండ్ ప్రకారం ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా కంపెనీలో హోదా పెరుగుతుంది. పని భారం పెరుగుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. కానీ వేతనం, ప్రోత్సాహకాలు మాత్రం మారవు. అంటే ప్రమోషన్ పేరిట లభించిన అదనపు బాధ్యతలను ఏ విధమైన అదనపు ద్రవ్య ప్రయోజనాలు లేకుండా నిర్వర్తించవలసి ఉంటుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, వేగంగా మార్పులు సంతరించుకుంటున్న సాంకేతికత, పరిశ్రమ అవసరాలు, సంక్షోభ పరిస్థితులు ఇవన్నీ కలిసి జాబ్ మార్కెట్లో ఈ నయా ట్రెండ్‌ను సృష్టించాయి.
సంక్షోభం నుండి బయటపడేందుకు..
కోవిడ్ సమయంలో సాఫ్ట్ వేర్ రంగానికి మంచి భూమ్ వచ్చింది. సాఫ్ట్‌వేర్ నిపుణులను అత్యధిక వేతనాలు ఇచ్చి అత్యధికులను నియమించుకున్నాయి కంపెనీలు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, మధ్య ప్రాచ్యంలో అస్థిర పరిస్థితులు వంటి కారణాల వల్ల మార్కెట్‌కు అననుకూల పరిస్థితులు లేవు. దీంతో చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకు ప్రాజెక్ట్‌ల కొరత తీవ్రంగా వేధించడం మొదలయ్యింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఉత్పాదక వ్యయంలో తగ్గింపుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ దిశగా అన్ని కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు భారీగా ఉద్యోగులను తగ్గించుకోవడం ప్రారంభించాయి. కొత్త నియామకాలు చేపట్టడం ఆపేశాయి. లేఆఫ్స్, రిమోట్ వర్క్, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. గతంలో ఆఫర్ లెటర్ ఇచ్చిన వారిని సైతం ఆఫీసులకు పిలవడం మానేసాయి. దాదాపు అన్ని కంపెనీలు జీతాల పెంపు నిలిపేశాయి.
ఉద్యోగులలో ఆందోళన..
ఈ నేపథ్యంలోనే ఉన్నత హోదాలో ఉండి అధిక జీతాలు పొందే వారిపై వేటు వేయడం ఆరంభించాయి. ఇదే సమయంలో వీరి స్థానాన్ని భర్తీ చేయడానికి జూనియర్లకు ప్రమోషన్ ఇవ్వడం మొదలు పెట్టాయి. అయితే ప్రమోషన్ పొందిన ఈ ఉద్యోగులకు మాత్రం హోదా పెంచారు తప్ప వేతనంలో కానీ, సౌకర్యాలలో కానీ ఏ విధమైన పురోగతి లేకుండా గత వేతనంతోనే అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే వేతన పెరుగుదల లేకుండా జూనియర్ ఉద్యోగులు దీనిని స్వీకరిస్తారా? అంటే స్వీకరించక తప్పని పరిస్థితి నేడు నెలకొంది. నేడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తున్న సంగతి నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ఉన్న ఉద్యోగం ఉంటుందా.. ఉడుతుందా? అనే ఆందోళనకర స్థితిలో కంపెనీ ఉద్యోగులు తమ విధులను నిర్వహిస్తున్నారు.
కంపెనీల స్పందన ఇలా..
కంపెనీలు ప్రతిపాదించే ఈ ‘డ్రై ప్రమోషన్’ ట్రెండ్‌తో ఉద్యోగుల్లో ప్రమోషన్ వచ్చిందనే ఆనందం కన్నా బాధ్యతలు, పనిభారం పెరగడంతో వారిలో అశాంతి నెలకొనడం అత్యంత సహజం. అయితే కంపెనీ ప్రతిపాదనను తిరస్కరించే ధైర్యం మాత్రం ఉద్యోగులలో కనిపించడం లేదు. ఒకవేళ డ్రై ప్రమోషన్‌ను ఉద్యోగులు తిరస్కరిస్తే భవిష్యత్‌లో కంపెనీ నుండి సమస్యలు ఎదురు కావచ్చు అనే భయం కూడా వారిని వెంటాడుతోంది. దీనిని అవకాశంగా తీసుకున్న కంపెనీలు తమ ఉత్పాదక వ్యయం తగ్గించుకుని లాభాలు నిలబెట్టుకోవడానికి ఓ విన్నూత ట్రెండ్‌గా ఈ డ్రై ప్రమోషన్ ఉపయోగపడుతూ ఉంది. అయితే కార్పొరేట్ వర్గాలు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నాయి. ఇది యాజమాన్యాలకు మాత్రమే కాదు ఉద్యోగులకు కూడా ప్రయోజనకరమే అని వాదిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వేతనంలో పెరుగుదల లేకుండా పదోన్నతి చేపడుతున్న వారికి భవిష్యత్‌లో కంపెనీ మారినప్పుడు వేతనాలు అధికంగా లభించే అవకాశాలు డ్రై ప్రమోషన్ సహకరిస్తుంది అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
శ్రమ దోపిడీకి నూతన మార్గాలు..
2018 లో ఈ తరహా పదోన్నతులు సంఖ్య కేవలం 8 శాతం మాత్రమే ఉండగా ప్రముఖ కాంపెన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ ప్రస్తుతం దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపు లేని డ్రై ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయని తన నివేదికలో పేర్కొంది. మెర్సెర్ అనే మరో కన్సల్టెన్సీ సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024 లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తేలింది. ఏది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జాబ్ మార్కెట్లో వస్తున్న ప్రతి నూతన ట్రెండ్ కూడా కంపెనీల ప్రయోజనాలను గరిష్టం చేసుకుంటూనే ఉద్యోగుల శ్రమ దోపిడీకి నూతన మార్గాలను అన్వేషిస్తున్నాయని చెప్పవచ్చు.
రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578