కొత్త చట్టాలు, పాత సీసాలో కొత్త సారా
బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నేర చట్టాలు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి
బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నేర చట్టాలు జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఏఏ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) భారతీయ సాక్ష్య అధినయం (బీఎస్ఎ)అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నేరచట్టాలను పార్లమెంటులో ఆమోదించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది.
భారతదేశ నేర, న్యాయ వ్యవస్థ, నేరాల దర్యాప్తు, విచారణ ప్రక్రియలో ఈ కొత్త చట్టాలు వేగాన్ని తీసుకురానున్నాయి. ఒక ఆధునిక న్యాయవ్యవస్థను అందించనున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త చట్టాల్లో జీరో ఎఫ్ఐఆర్, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్ విధానాల్లో సమన్లు జారీ, అతి క్రూరమైన నేరాల క్రైమ్ సీన్‌లను వీడియోగ్రఫీ చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మాదిరిగా నేరస్తులను "శిక్షించట"మే లక్ష్యంగా కాకుండా కొత్త చట్టాలు ప్రజలకు ‘న్యాయం’ అందించేందుకు ప్రాధాన్యత ఇస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలోనే లోక్‌సభలో వివరించారు.
చట్టాల అమలులో సమస్యలు..
అయితే ఈ చట్టాలపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వీటి అమలు నిలిపి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలు అయింది. గత ఏడాది డిసెంబర్‌లో సదరు చట్టాల తాలూకు బిల్లుల ఆమోదం సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభ నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారనీ పార్లమెంటు సభ్యులు చర్చ జరపకుండానే ప్రభుత్వం బిల్లులను ఏకపక్షంగా ఆమోదించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి కూడా ఈ కొత్త చట్టాలపై అభిప్రాయాలు సేకరించలేదన్నారు. ఈ చట్టాల ప్రకారం నిందితులకు బెయిల్ ఇచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని, పోలీసులకు విపరీతమైన అధికారాలు సంక్రమిస్తాయి అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే కొత్త నేర చట్టాల అమలును పార్లమెంట్‌లో చర్చించేంత వరకు వాయిదా వేయాలని కోరుతూ పౌర హక్కుల ప్రజాసంఘం పీయూసీఎల్, కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లేఖ రాసింది. అందరి అభిప్రాయాలు సేకరించకుండానే ఈ చట్టాలను తీసుకొచ్చారని గుర్తుచేసింది. దేశ ప్రజాస్వామ్యంపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపే ఈ చట్టాలపై పెద్ద ఎత్తున చర్చలు జరపాలని కోరింది. వలస చట్టాల నుంచి బయట పడుతున్నామని చెబుతూనే నాటి బ్రిటిష్ చట్టాలలోని అనేక అంశాలను యధాతథంగా నూతన చట్టాల్లో కూడా తీసుకొచ్చారని వెల్లడించింది.
బెయిల్ వచ్చినా కస్టడీ
న్యాయ సంహిత చట్టంలో గ్యాంగ్, వ్యవస్థీకృత నేరస్థులు,ముఠాల వంటి పదాలు ఉన్నాయి.కానీ, వాటిని స్పష్టంగా నిర్వచించలేదు.ఫలితంగా అమాయకులను కూడా కేసుల్లో ఇరికించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. నాగరిక్ సురక్ష సంహితం ప్రకారం పోలీసులు నిందితులను తమ కస్టడీలో 15 రోజులు ఉంచుకోవచ్చు. అంతేకాదు ఆ తర్వాత కూడా 40 నుంచి 60 రోజులు వరకు అదనపు కస్టడీని కోరవచ్చు. ఈ కస్టడీని ఒకే దఫాలో కానీ పలు దఫాలలో గానీ అమలు పరచవచ్చు. తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా కూడా, పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
నిక్షిప్త సమాచారం సాక్ష్యాధారమే
ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవిడెన్స్ యాక్ట్ ద్వితీయ స్థాయి సాక్షాధారాల (సెకండరీ లెవల్ ఎవిడెన్స్)గా పరిగణిస్తే, దాని స్థానంలో వచ్చిన భారతీయ సాక్ష్య అధినియమ్ వాటిని ప్రథమ స్థాయి సాక్షాధారులుగా పరిగణిస్తోంది. తద్వారా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్‌ల వంటి సాధనాలతో పాటు, సెమీకండక్టర్ మెమరీలో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని కూడా సాక్షాధారంగా భావిస్తుంది. పోలీసులు వీటిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా తనిఖీ నిర్వహించినప్పుడు వాటిల్లో లేని సమాచారాన్ని పోలీసులే స్వయంగా గతంలో మాదిరిగా "పెగాసెస్" వంటి ఏదైనా సాఫ్ట్ వేర్‌తో చొప్పించే ప్రమాదకరమైన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విషయంలో ఏలాంటి వివరణ ఈ చట్టాల్లో లేదు.
రూపం మార్చుకున్న ‘రాజద్రోహం’
స్వాతంత్రోద్యమంలో నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన 'రాజ ద్రోహ' చట్టం అమలును సుప్రీంకోర్టు 2022 లో నిలిపివేసింది. ఈ చట్టంపై సమీక్ష జరుపుతామనీ కేంద్రం నాడు సుప్రీంకోర్టులో తెలిపింది. కానీ, కొత్త చట్టంలో 'రాజ ద్రోహం' చట్టాన్ని 'దేశ ద్రోహం' పేరుతో తిరిగి తీసుకొచ్చింది. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ప్రజలకు ఉన్న హక్కును హరించి వేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్న విమర్శలు ఎంతో కాలంగా ఉన్నాయి. తప్పని సరిగా బాధితుల నుండి ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ప్రస్తుత నిబంధనను తొలగించడాన్ని పాతకాలపు పోకడలకు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడం గా పలువురు విమర్శిస్తున్నారు.
అసలు సవాళ్లు
కొత్త చట్టాల అమలుకు ముందు (2024 జూలై 1వ తేదీకి ముందు జరిగిన నేరాలను ఐపీసీ తదితర పాత చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. జులై 1 నుంచి జరిగే నేరాలను కొత్త చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఇది తీవ్ర గందరగోళానికి దారి తీసే ప్రమాదం ఉంది. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. కేసుల నమోదు విషయంలో పోలీసులకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిందితులు వీడియో కాల్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపవచ్చని కొత్త చట్టాలు చెబుతున్నాయి.కానీ, దేశంలో 80 శాతం కోర్టుల్లో దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పాత,కొత్త చట్టాలకు సంబంధించిన కేసులను వాదించినప్పుడు ఎదురయ్యే ప్రాక్టికల్ సమస్యలు పరిష్కరించకుండా, చర్చలకు అవకాశం లేకుండా, కోర్టులలో మౌలిక సదుపాయాలు లేకుండా ప్రభుత్వం బేషజాలకు పోయి తొందరపాటుతో ఈ చట్టాలను అమలు చేయరాదు. ఈ లోపాలు సవరించేత వరకు కొంతకాలం నూతన చట్టాలను వాయిదా వేయటం మంచిదని అన్ని వర్గాల విజ్ఞులు కోరుతున్నారు.
డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496