తెలంగాణ ఎన్నికల్లో పోరు బలంగా సాగే నియోజకవర్గాల్లో బెట్టింగులు చాలా కీలక పాత్ర పోషించనున్నాయి. ఆర్ధికంగా బలవంతులైన అభ్యర్థులు ఇప్పుడు తమ గెలుపు కోసం బుకీలను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నికల్లో గెలుపును పందెం రాయుళ్ళ చేతిలో పెడుతున్నారు. 18-30 సంవత్సరాల వయసు వారే వీరి టార్గెట్. ఈ వయస్సులోని చాలా మంది యువకులు బెట్టింగులకు అలవాటు పడి వాటికి ఆకర్షితులు అవుతారని తెలుసుకున్న అభ్యర్థులు ఇప్పుడు వారిని టార్గెట్ చేసుకుని పొలిటికల్ బెట్టింగులు నిర్వహించేందుకు బుకీలతో జిత్తులమారి పథకాలకు సన్నాహాలు చేస్తున్నారు.
బెట్టింగుతో మైండ్ గేమ్
ఈ పొలిటికల్ మైండ్ గేమ్ బెట్టింగులో 50-50 అవకాశం ఉన్న, టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గంలో ఫలితాన్ని తారుమారు చేసే విధంగా కుట్రలు చేస్తున్నారు. దీని కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు ముందుగానే ప్రత్యర్థి అనుచరులను మచ్చిక చేసుకుంటున్నారు. ఈ పొలిటికల్ మైండ్ గేమ్ బెట్టింగ్ ఎలా ఉంటుందంటే... ఉదాహరణకు బోయినపల్లి ఒక అభ్యర్థి పేరు, మల్లేపల్లి ప్రత్యర్థి అభ్యర్థి పేరు అనుకుందాం. బోయినపల్లి తానే ఈ ఎన్నికల్లో గెలవాలి అనుకుంటాడు. దీని కోసం అతడు మల్లేపల్లి ప్రధాన అనుచరుడితో ఓ డీల్ కుదుర్చుకుని బెట్టింగ్ ధరను రిలీజ్ చేస్తాడు. మల్లేపల్లి గెలిస్తే రూ. 1000 లకు రూ. 2000లు- నా పందెం అంటాడు. బోయినపల్లి గెలిస్తే మీ వెయ్యి రూపాయలకు 2 వేలు జోడించి 3 వేలు మీకే అంటూ ప్రచారం చేస్తాడు. నామినేషన్లు దాఖలు చేసిన తరువాత ఈ బెట్టింగ్ మైండ్ గేమ్ మొదలయ్యి పోలింగ్ చివరి రోజు వరకు బెట్టింగ్ ధరలు పెంచుకుంటూ 50 వేల మందిని కన్ఫ్యూస్ చేస్తారు. ఇలా దాదాపు 50 వేల మంది ఓటర్లను ఒక్కో నియోజకవర్గంలో టార్గెట్ చేస్తారు. అందులో 18 నుంచి 30 సంవత్సరాల వారినే ఎంచుకుంటారు.
గెలుపునకు టర్నింగ్ పాయింట్
బుకీ దగ్గర రూ. 1000/- డిపాజిట్ చేసి పందెంరాయుళ్లు బెట్టింగులు పెడతారు. బోయినపల్లి తరపున బుకీ ముందుగానే బెట్టింగ్ ధరను డిసైడ్ చేసి దానిని పెంచుకుంటూ పోతాడు. పోలింగ్ ముందు రోజు వరకు రూ. 1000/ కి 5000/- వరకు పెంచుతాడు. దీని కోసం బెట్టింగ్ పెట్టే వారి ఓటరు కార్డు తీసుకుని దానిపై రాసిస్తాడు. ఈ బెట్టింగ్‌లను మురికివాడలు, బస్తీలు, మధ్యతరగతి ఉన్న కాలనీలను ఎంచుకుంటారు. బెట్టింగ్‌లు పెట్టిన ప్రాంతాల్లో మల్లేపల్లి గెలుస్తున్నాడు, గెలుస్తున్నాడు... అందుకే బెట్టింగ్ ధరలు పెరుగుతున్నాయని గుబులు పుట్టిస్తాడు .. దీంతో పందెం కాసిన వ్యక్తి ఆమ్మో మల్లేపల్లి గెలిస్తే నా వెయ్యి రూపాయలతో పాటు 2 వేలు మిస్ అవుతాయని కలవర పడతాడు. అప్పుడే తన ఓటును బోయినపల్లికి వెయ్యాలని డిసైడ్ అవుతాడు. అతనితో పాటు మరో ముగ్గురితో ఓటు వేసేలా ఒత్తిడి తీసుకువచ్చి తన వెయ్యి రూపాయలు పోకుండా, మరో 2 వేలు మిస్ కాకుండా జాగ్రత్త పడతాడు.. ఇలా బెట్టింగ్ పెట్టిన 50 వేల మంది ఒక్కోక్కరు ముగ్గురిని ప్రభావితం చేస్తే పరిస్థితి ఒక్కసారిగా బోయినపల్లికి వన్ సైడ్‌గా మారుతుంది. అతని గెలుపు ఖాయంగా మారుతుంది.
బుకి ఓడిపోయినా..
ఇక్కడ బుకీ ఓడిపోతాడు, బెట్టింగ్ స్కెచ్ వేసుకున్న అభ్యర్థి గెలుస్తాడు. ఇక్కడ 50 వేల మందికి అయ్యే ఖర్చు 10 కోట్లు.... కానీ గెలుపు మాత్రం పక్కాగా ఉంటుందని పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల అంచనా. అయితే ఈ తరహా బెట్టింగ్ అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ప్రతిష్టాత్మకంగా గెలుపు కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు ఈ విధమైన పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిసింది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో సవాలు, ప్రతి సవాలు విసురుకుంటున్నఅభ్యర్థులు ఈ తరహా పొలిటికల్ మైండ్ గేమ్ బెట్టింగులకు తెర పైకి తీసుకు వస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇదొక సరికొత్త బెట్టింగ్ జూదం మరి.
గొట్టిముక్కల సుధాకర్ గౌడ్
9052116459