నెహ్రూ కన్న కల... బాలల చిత్రోత్సవం
తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లుగా పట్టించుకోని నంది అవార్డుల్లో మార్పులు చేర్పులు చేసి ‘గద్దర్’ అవార్డుల పేర ఇవి పునరుద్దరించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లుగా పట్టించుకోని నంది అవార్డుల్లో మార్పులు చేర్పులు చేసి ‘గద్దర్’ అవార్డుల పేర ఇవి పునరుద్దరించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది మంచి పరిణామం. అయితే కేవలం అవార్డులు, రివార్డులే కాకుండా గతంలో ఉన్న చలన చిత్రోత్సవాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తే, తిరిగి పునరుద్ధరిస్తే మన రాష్ట్రంలో మంచి సినిమా వాతావరణం ఏర్పాటవుతుంది. ఆ దిశలో బాలల చిత్రోత్సవాల గురించీ ఆలోచించాలి.
జవహర్ లాల్ నెహ్రూ కలలుగన్న బాలల ప్రపంచాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేయాలి. ఒక రకంగా అది ప్రభుత్వ బాధ్యత కూడా. నెహ్రూ ఎస్.కె.పాటిల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ‘చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా’ 1955లో ఏర్పడింది. పండిత్ హృదయనాథ్ కుంజు అధ్యక్షుడిగా ఏర్పాటయిన ఈ సంస్థ తన మొదటి సినిమాగా కేదార్ శర్మ దర్శకత్వంలో 'జల దీప్' నిర్మించింది. ఈ సొసైటీ ఏర్పాటు కోసం ఆ రోజుల్లోనే నెహ్రూ 5 లక్షల రూపాయాల్ని సీడ్ మనీగా ఏర్పాటు చేశారు. కేదార్ శర్మను విదేశాలకు శిక్షణ కోసం పంపించడం మేరి వీల్డ్ లాంటి ప్రముఖ దర్శకుడిని విదేశాల నుంచి రప్పించి మనదేశంలో పిల్లల సినిమాల నిర్మాణం విషయంలో శిక్షణా కార్యక్రమాలో ఏర్పాటు చేయడం జరిగింది.
మరుసటి రోజే మర్చిపోతాం..
మనకు నవంబర్ నెల వచ్చిందంటే చాలు నెహ్రూ గారి జయంతి.. బాలల దినోత్సవం గుర్తొస్తాయి. అప్పుడు అందరమూ పిల్లల గురించి మాట్లాడతాం. అటు ప్రభుత్వమూ ఇటు సంస్థలూ సభలు పెడతాయి. జెండాలు కడతాయి. పిల్లలకు మిఠాయిలు పంచు తాయి. అంతా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం. పిల్లలను భావి భారత పౌరులు అంటాం. భవిష్యత్తు నిర్మాతలు అంటాం. మర్నాటికి మరిచిపోతాం. నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడుకుంటే పిల్లలంటే మనకు ఉండాల్సినంత పట్టింపు లేదు, ప్రేమ అసలే లేదు. ఇట్లా అంటే కొంచెం కష్టం అనిపించొచ్చు. కానీ అది నిజం. మనం కేవలం నవంబర్ రోజులలో మాత్రమే పిల్లల గురించి మాట్లాడతాం. కానీ వాళ్ల కోసం ఆలో చించం. ఏమీ చేయం. ప్రభుత్వాలూ పార్టీలూ ఏమీ చేయవు.
గతమెంతో ఘనకీర్తి... ఇప్పుడో!
మన దేశంలో ‘బాలల సినిమాల’దీ దారుణమైన పరిస్థితే. దాదాపు అన్ని భాషల నిర్మాతల్లోనూ పిల్లల సినిమాలు తీస్తే మార్కెట్ ఉండదు... ఏమొస్తుంది అనే భావనే. మలయాళం, బెంగాలీ లాంటి కొన్ని భాషల్లో వేళ్ల మీద లెక్కించే కొన్ని మంచి సినిమాలు మాత్రం తీశారు. ఇక ముంబైలోని బాలల చిత్ర సమితి (CHILDREN FILM SOCIETY OF INDIA) నిర్మించిన వందలాది పిల్లల సినిమాలు ప్రదర్శనకు నోచుకోకుండా ముంబైలో పడి వున్నాయి. చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆక్టివ్‌గా వున్నప్పుడు ముఖ్యంగా కేదార్ శర్మ, భీమసేన్, జయాబచ్చన్, సాయి పరంజపే, గుల్జార్ తదితరులు దానితో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. పోత్లీ బాబా, జంగల్ బుక్, ముజ్సే దోస్తీ కరోగే, లావణ్య ప్రీతీ, ఇట్లా ఎన్నో ఎన్నో సినిమాలు వచ్చాయి.
శాశ్వత వేదిక ఏదీ?
బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, రెండేండ్లకోసారి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. అందులో భాగంగానే దేశంలోని వివిధ నగరాల్లో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తూ వస్తున్నది. మొదటిసారిగా 1995లో మన హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించారు. తర్వాత 1999లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు ఒక శాశ్వత వేదిక వుండాలని హైదరాబాద్‌ని ప్రతిపాదించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. అంతేకాదు రాష్ట్రంలో నిర్మించే బాలల చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తే గొప్ప నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది. చిల్డ్రన్ ఫిలిం సొసైటీకి భూమి ఇస్తా మని అందులో శాశ్వత కార్యాలయం, ప్రత్యేక థియేటర్లు నిర్మించుకోవాలని సూచించింది.
టూరింగ్ ఫెస్టివల్ గానే చిత్రోత్సవం
అయితే ఇదంతా ప్రకటనల ఆర్భాటమే తప్ప అవేవీ అప్పుడు సాకారం కాలేదు. ఇప్పటికీ కాలేదు. భూమి ఇచ్చినట్టే ఇచ్చారు కానీ ఆధీనం చేయలేదు. తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదేమీ జరగలేదు. ఇంతలో కేసులు వగైరాలతో అది మూల బడింది. ఇప్పుడా భూమి వుందో అన్యా క్రాంతం అయిందో ఎవరికీ పట్టింపు లేదు. ఇప్పటికీ శాశ్వత వేదికకు ఎలాంటి ప్రయ త్నాలూ జరగలేదు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్‌లో టూరిం గ్ ఫెస్టివల్‌గానే మిగిలిపోయింది. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ అధికారులు రెండేండ్లకోసారి హైదరాబాద్ వచ్చి ఏదో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వహించాం అనిపించి అది అయిపోగానే పెట్టె బేడా సర్దుకుని వెళ్లిపోయే వాళ్లు. ఇప్పుడు అదీ లేదు.
పల్లెల్లో బాలలకూ చిత్రోత్సవాలు..
సినిమాను పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించి వారికి అందించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇరాన్ లాంటి దేశాల పిల్లల చిత్రాల్ని ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలు మహానగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెల్లో వుండే బాలలకూ ప్రదర్శించగలిగితే గొప్పగా వుంటుంది. దానికి జిల్లాల స్థాయిలో నిర్వాహక కమిటీలు ఏర్పాటు చేసి, ఎప్పుడో రెండేండ్లకోసారి కాకుండా క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాల్ని అందించగలిగితే బాలలకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది.
బాలల చిత్రాలకు గొప్ప వేదికగా తెలంగాణ
అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, రష్యాల నుంచి వచ్చిన పిల్లల సినిమాలు అద్భుతంగానూ, భావస్పోరకంగానూ వుంటాయి. అవి మొత్తం ప్రపంచాన్ని కట్టి పడేశాయి. ఇరాన్ సినిమాలకున్న నేపథ్యం మనకూ ఉన్నది. కావలసిందల్లా ఇరాన్‌లో లాగా ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సి ఉన్నది. మన దర్శకులు కూడా రొడ్డకొట్టుడు నీతి బోధల సినిమాలు కాకుండా భిన్నంగా బాలల మన సుల్ని గెలుచుకునే సినిమాలు నిర్మించగలిగితే తెలంగాణ గొప్ప బాలల చిత్రాలకు వేదికయ్యే అవకాశం ఉన్నది. బాలల కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సి ఉంది. పిల్లల కోసం ఎవరయిన ఏ కొంత చేసినా భవిష్యత్తుకు ఎంతో చేసిన వాళ్లవుతారు.
వారాల ఆనంద్
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
94405 01281