NDA VS INDIA: ఎవరిది భయ ప్రదర్శన!

NDA vs INDIA political alliances meeting was a fear show

Update: 2023-07-19 23:45 GMT

iuజాతీయ స్థాయిలో వివిధ పార్టీలు రెండు గ్రూపులుగా భయ ప్రదర్శన చేయడం తాజా వార్త. ఎదుటి వారిదే భయ ప్రదర్శన, తమది మాత్రం బల నిరూపణ అని ఎవరికి వారు అనుకోవచ్చు గాక.. ఇరువురిదీ ఒకే తరహా ప్రదర్శన అన్నది నా ఉద్దేశం. నా అభిప్రాయం తప్పు కావొచ్చు.. కానీ అదే నా అభిప్రాయం. అయితే ఎక్కువ భయం ఎన్‌డీ‌యేది కావొచ్చు. ఎందుకంటే 2019 నుండి వారు ఇంతవరకూ ఇలా కలిసి గ్రూప్ ఫోటో దిగిందే లేదు. ఎంతసేపూ బీజేపీ సోలో పర్ఫార్మెన్స్ కనబడింది. ‘ఎంత మంది వస్తారో రండి..మేం ఒంటి చేత్తో ఎదిరిస్తాం’ తరహా సూపర్ హీరో డైలాగులే ఉండేవి అటువైపు నుండి. మోడీ మేజిక్.. డబుల్ ఇంజిన్..కమల వికాసం.. ఇలాంటి పద బంధాలే. ఎన్‌డీ‌యే అన్న మాట మరచి పోయినంతగా మరుగున పడిపోయింది. ఇప్పుడు ఎకాయెకీ 38 పార్టీలు..అన్నీ కలిపి ఒకే చోట.

ఇక రెండో భయ ప్రదర్శన. ప్రతిపక్షాల గ్రూపుది. 26 పార్టీలు కలిసి రెండోసారి బెంగళూరులో కలిశాయి. అవి పెట్టుకున్న పేరు భలే గమ్మత్తుగా ఉంది. ఆ పేరు కుదించి చూస్తే ఇండియా. విస్తరించి చూస్తే కఠినం. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలియెన్స్.(భారత జాతీయ వృద్ధి కూటమి అందామా!) ఎన్‌డీయేకి ఇమిటేషన్‌లా ఇండియా ఉంది. 26 పార్టీల గ్రూప్‌కి 11 మందిని సమన్వయ కర్తలుగా పెట్టుకోవడం చూస్తే ఏదో భయం ఉన్నట్టు తోస్తుంది. ఎవరిని తక్కువ చేస్తే ఎవరు దూరమవుతారో, ఎంతమంది ఎదుటివారిని ప్రధాన నేతగా గుర్తించగలరో లెక్కలేస్తూ భయపడుతున్నట్టు. కొన్ని పార్టీలు రెండు ముక్కలై ఒక్కొక్కటి ఒక్కో గ్రూపులో ఉన్నాయి. కొన్ని పేరుకే పార్టీలు. ఏది ఏమైనా ఇది ఒక మంచి పరిణామం. వైరి పక్షాలకు భయముండాలి. అప్పుడే ప్రజల పట్ల కొంత భక్తి వుంటుంది. అది దేశానికి మేలు చేస్తుంది.

డా. డి.వి.జి.శంకర రావు,

మాజీ ఎంపీ,

94408 36931

Tags:    

Similar News