ప్రజారంజక పాలన అనేది ఒక గొప్ప బాధ్యతతో కూడిన నైపుణ్యం. అందులో ఆరితేరితేనే ప్రజలు ఇచ్చిన అధికార పీఠానికి సార్ధకత చేకూర్చిన వారవుతారు. పాలకుడిని ప్రజలు మోస్తున్నా.. ప్రజలందరినీ తాను మోయాలి. లేకుంటే అధికార పీఠం నుండి పడదోయడం తప్పదు. పాలితుల రక్షణ బాధ్యతలకై కష్టనష్టాల్లో కన్నతండ్రి ఎలా ఉంటాడో, బిడ్డ ఏడ్పు విని తల్లి ఎలా పరుగెడుతుందో.. ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు పాలకులు అలా పరుగెత్తాలి. వారే నిజమైన ప్రజా సేవకులు. ప్రజా పాలకులకు మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే నిజాయితీపరులను గౌరవిస్తూ అవినీతిపరులను శిక్షిస్తూ ప్రజలను రక్షిస్తూ ప్రజారంజక పాలన అందిస్తూ శ్రేయో రాజ్యాన్ని నిర్మించాల్సి ఉంటుంది.
ఇది ప్రజాస్వామ్యమా?
కానీ నేడు పాలకులు తమను ప్రశ్నించే వారిపై కఠిన చట్టాలతో శిక్షలు వేస్తూ, దండిస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. తమకు ఇష్టమైన వాళ్లు ఎన్ని తప్పులు, ఎంత అవినీతి చేసినా క్షమించి వదిలేయడం, వారి వ్యవహారాల్లో చూసి చూడనట్లు ఉండడం జరుగుతుంది. గిట్టని వారు చిన్న తప్పు చేసినా పెద్ద పెద్ద శిక్షలు విధించడం లాంటి చర్యల వల్ల మంచి పాలకులు కాలేరు. అదే అపకీర్తిని తెచ్చిపెడుతుంది. ప్రజా పాలన అంటే కల్లిబొల్లి మాటలు, ఆచరణ కాని హామీలు, అరచేతిలో స్వర్గం చూపడం కానే కాదు పారదర్శకమైన ఆచరణ. అవినీతి, బంధుప్రీతి లేని సచ్చీల పాలకులనే ప్రజలు రక్షిస్తారు. లేకుంటే ఎంతటి సమర్ధుడైన పాలకుడైనా ప్రజా వ్యతిరేక హోరులో కొట్టుకపోక తప్పదు. మనదేశంలో సార్వత్రిక ఎన్నికలు చేరువవుతున్న వేళ దేశంలోని రాజకీయ పార్టీలు రెండు కూటములుగా ఏర్పడ్డాయి. ‘ఎన్డీయే కూటమి’లో 38 పార్టీలు, ‘ఇండియా కూటమి’లో 26 పార్టీలు చేరాయి. మన దేశంలోని బహుళ పార్టీ పాలన విధానంలో.. రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఈ దేశంలోని ప్రజల కోసం ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా పాలన అందిస్తూ ప్రజా సంక్షేమానికి రక్షకులుగా, కాపలాగా పాలకులు నిలబడాల్సి ఉంది. రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, వ్యవస్థలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయనివ్వాలి. వారి స్వేచ్ఛకు ఆటంకం కల్పించరాదు. చట్ట సభల్లో చేసే చట్టాలపై ప్రజాస్వామ్య బద్ధంగా చర్చ జరగాలి. ఏకపక్ష నిర్ణయాలు, మందబలంతో చట్టాలను ఆమోదించుకోవడం ఎంత మాత్రం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కలిసామంటున్న ‘ఇండియా’ కూటమి స్వార్ధపూరిత అస్థిర కూటమి అని దీంతో ఈ దేశానికి అవస్తే అంటున్న ఎన్డీఏను ప్రజలు గమనిస్తున్నారు.
ఈ రెండు కూటములు ప్రజామన్ననను పొందడం కోసం రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒకరిపై ఒకరు పరస్పరం దూషించుకుంటూ ఇరకాటంలో పెట్టేలా వ్యూహ ప్రతివ్యూహాలు, పథక రచనలతో తలమునకలై ఉన్నారు. ప్రధానంగా మణిపూర్ మారణకాండ, ఢిల్లీ ఆర్డినెన్స్, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, మహిళా రిజర్వేషన్ల బిల్లు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రైల్వే భద్రత, అతి వృష్టి, అనావృష్టులు, సరిహద్దుల్లోని పరిస్థితుల వంటి అనేక ఇతర అంశాలు చర్చకు వచ్చినా, ప్రతిపక్షాలు వాకౌట్ చేసినా, అధికార పార్టీ తన పంతం నెగ్గించుకుని ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును నెగ్గించుకుంది.
వారి త్యాగాలకు ఇది గౌరవమా?
నిజానికి సభల్లో ప్రజాసమస్యలను పరిష్కరించాలి. అలా ప్రజా ప్రయోజనాల చట్టాలు రావాలి. చర్చలు జరగాలి. దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించేలా.. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, లింగపరంగా వివక్ష లేకుండా సమానత్వాన్ని సాధించడం కోసం చట్టాలు రావాలి. మెజార్టీ ప్రజ(వర్గా)లు దరిద్రంలో కొట్టుమిట్టాడడం, అవినీతి, అప్పుల భారం, నిరుద్యోగం, ఉపాధి లేమి, రైతుల ఆత్మహత్యలు లాంటి ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన వ్యవస్థీకృత లోపాలు ప్రజల పాలిట శాపాలుగా మారిన వాటి గురించి చర్చించాలి. పార్టీ(ప్రభుత్వా)లు మారుతున్నాయి, మొన్ననే 75 ఏళ్ల స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకున్నాం. కానీ ఈ దేశంలో సమస్త అవ్యవస్థలను ఎవరూ బాగు చేయలేకపోతున్నారు. ప్రపంచంలో ఏ రంగాన్ని చూసినా అన్నింటా మన దేశం అధమ స్థానంలోనే ఉంటున్నదంటే ఇది నిజం కాదా? అంతే కాదు మన పొరుగు దేశాలైన మన కన్న చిన్న దేశాల కంటే మనం సమానత్వం, ప్రజాస్వామ్యం, మహిళా స్వేచ్ఛ, ఆర్థికంగా, మత సామరస్యతలోనూ ఇలా ఏ రంగంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా స్వేచ్ఛ, సమానత్వంలో మన దేశం దిగజారి పోవడంపై పార్లమెంటు సమావేశాలలో చర్చ జరపండి. అంతేకానీ కులాలు, మతాలు, ప్రాంతాలు, లింగపరంగా వివక్ష చూపుతూ, భావోద్వేగాలు, ఆత్మగౌరవాల్ని రెచ్చగొట్టే ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంత మాత్రం ఏ కూటమికైనా మంచిది కాదు. ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల ధన మాన ప్రాణ త్యాగాలకు ఇచ్చే గౌరవం ఇదేనా! ఆనాటి సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో నేటి సమాజం గుణపాఠం ఎంతో నేర్చుకోవాల్సిందే.. ఒక్కసారి ఆలోచించండి నేటి ప్రజా ప్రతినిధులారా..
మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు,
95736 66650