అభివృద్ధి‌కి సోపానం సైన్స్

అభివృద్ధి‌కి సోపానం సైన్స్... national science day article

Update: 2023-02-27 19:00 GMT

దేశ ప్రగతికైనా సైన్సే మూలం. ఈ ప్రకృతి‌లో మనకు తెలియని అనేక విషయాలను సమస్త వివరాలతో వివరించేది శాస్త్ర విజ్ఞానమే. పిట్ట క‌థ‌ల‌కు, అభూత క‌ల్పనల‌కు సైన్స్‌లో చోటుండ‌దు. సైన్స్ స‌త్యాన్ని చెబుతుంది. స‌త్యాన్నే ఆచ‌రించ‌మంటుంది. అందుకే ప్రపంచమంతా శాస్త్ర సాంకేతిక రంగానికి అంత ప్రాధాన్యాన్ని ఇస్తోంది. ఏ దేశమైనా ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం సైన్స్, టెక్నాలజీలో అభివృద్ది చెంద‌డ‌మే. ఇవాళ్టి రోజున సైన్స్ లేకుండా, ఆయా రంగాల్లో లోతైన ప‌రిశోధ‌న‌లు చేయ‌కుండా ఏ దేశమూ మనుగడ సాగించలేదు. అది వైద్యరంగంలోనైనా, ర‌క్షణ రంగంలోనైనా, ఏ ఇతర రంగంలోనైనా శాస్త్ర పరిజ్ఞానానికి ప్రపంచమంతా ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది.

ఎన్నో పరిశోధనలు చేస్తూ

మారుతున్న ప్రపంచ ప‌రిస్థితుల్లో ఏ దేశ ప్రగతికి అయినా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే కొలమానంగా మారింది. ప్రస్తుతం బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, జీన్ థెరపి, క్లోనింగ్, స్టెమ్‌సెల్ రీసర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక కీల‌క అంశాల‌పై ఉధృతంగా ప‌రిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనిషికి ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి వాటి నివారణకు డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే దీనికి చెక్ పెట్టేందుకు మూలకణాల మీద పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన విజయవంతమైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడే వ్యాధులు రాకుండా నివారించవచ్చు. అదే జరిగితే మనిషి తన జీవిత కాలంలో అనారోగ్యానికి గురవడం అంటూ ఉండదు. వింటనే ఆశ్చర్యంగా ఉన్నా ఇదంతా సైన్స్ అద్భుతమే.

మ‌రోవైపు అంగారకుడి‌పై మ‌నిషి నివాసం ఉండ‌టానికి అవ‌కాశం ఉందా...అనే అంశంపై ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ప‌రిశోధిస్తున్నాయి. అంగారకుడి‌పై నీటి జాడ‌కు సంబంధించి క‌చ్చిత‌మైన ఆధారాలు దొరికి, ఈ ప‌రిశోధ‌న‌లు విజ‌య‌వంత‌మైతే మ‌నం క‌ల‌లో కూడా ఊహించ‌ని పెను మార్పులు ప్రపంచంలో చోటు చేసుకుంటాయి. కొన్నిత‌రాల త‌రువాత అంగార‌కుడిపై మ‌నిషి నివ‌సించినా ఆశ్చర్యపోకూడ‌దు. యంత్రం మ‌నిషిలా ఆలోచించ‌గ‌ల‌దా....ప‌నిచేయ‌గ‌ల‌దా? అనే ఆలోచ‌న‌లో నుంచి పుట్టిందే కృత్రిమ మేధ‌స్సు. ఇవాళ‌ ఇదే స‌మ‌స్త ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇవాళ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగం అంటూ ఏదీలేదు. రోబోలే డాక్టర్లుగా ఆపరేషన్లు చేయ‌డం మ‌నం చూస్తున్నాం. చాట్ జీపీటీ...సైన్స్ అండ్ టెక్నాల‌జీలో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్‌. ఇన్నాళ్లూ గూగుల్ త‌ల్లిని ఒక ప్రశ్న అడిగితే అందుకు సంబంధించి స‌మ‌స్త స‌మాచారాన్ని మ‌న‌ముందూ ప‌రిచేస్తుంది. చాట్ జీపీటీ ఒక‌టి కాదు ....నాలుగు అడుగులు ముందుకేసింది. స‌మాచారం మొత్తాన్ని మ‌న‌ముందు ప‌ర‌చ‌దు. మ‌న‌కు ఎంత అవ‌స‌ర‌మో. అంతే ఇస్తుంది. దీనిని ఒక్కమాటలో చెప్పాలంటే ప్రశ్నకు స‌మాధానం రాసిన‌ట్లు సూటిగా ఉంటుంది.

మన‌దేశంలో ప‌రిశోధ‌న‌లు పెర‌గాలి

భార‌త్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల భవిష్యత్తుకు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ప‌రిశోధ‌న‌లు, కొత్త కొత్త ఆవిష్కరణలు మ‌రింత‌గా పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. అప్పుడే ఆయా దేశాలు ప్రగతి వైపు చ‌క‌చ‌కా ప‌రుగులు తీస్తాయి. సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ స్థాయి చ‌దువులు కూడా రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. సత్యశోధనే టార్గెట్‌గా రీసెర్చ్ జ‌ర‌గాలి. అప్పుడే శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ఫ‌లాలు అంద‌రికీ ద‌క్కుతాయి. ఇటీవలి కాలంలో మ‌న‌దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సైన్సు అంగీక‌రించ‌ని వాటికి సైతం సైన్సు ముసుగు వేసి చ‌లామ‌ణీలో పెడుతున్నారు. సామాన్య ప్రజలను మూఢ న‌మ్మకాల పేరుతో గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నారు. ఈ అనంత విశ్వంలో సైన్సే స‌త్యం. ఈ విష‌యాన్ని ప్రజలందరూ గ్రహించాలి. మూఢ న‌మ్మకాల నుంచి బ‌య‌ట‌కు రావాలి. పిల్లలకు మొద‌టినుంచి సైన్స్ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచాలి, ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలి. దేన్నైనా ప్రశ్నించగలిగినప్పుడే హేతుబద్దమైన ఆలోచనలు వ‌స్తాయి.

మనదేశంలో రామన్ ఎఫెక్ట్ ప్రపంచానికి వెల్లడైన ఫిబ్రవరి 28ను జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుతుంది భారత ప్రభుత్వం. శాస్త్ర, సాంకేతిక ప్రపంచంలో ‘రామన్‌ ఎఫెక్ట్‌’ ఒక గొప్ప ఆవిష్కరణ. దీని తరువాత సర్ సీవీ రామన్ పేరు అంతర్జాతీయంగా మారుమోగి విజ్ఞాన రంగంలో చిర‌స్మరణీయుడ‌య్యారు. ఇదే ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఒక గొప్ప గుర్తింపు తీసుకువచ్చింది. రామ‌న్ చేసిన ప‌రిశోధ‌న‌ల‌కు గాను 1930లో ఆయ‌న‌కు నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.

విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మదించి వేస్తాయంటారు సీవీ రామ‌న్. మన దేశ ప్రగతిలో సైన్స్ పాత్ర విలువ కట్టలేనిది. మన దేశ అభివృద్ధిలో సైంటిస్టుల పాత్ర అమూల్యం. ఈ సందర్భంగా సైన్స్ ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేయాలి. సామాన్య ప్రజల్లో సైతం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. ముఖ్యంగా చిన్నారుల్లో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు బ‌డ్జెట్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప‌రిశోధ‌న‌ల‌కు కేటాయిస్తున్న నిధుల‌ను పెంచాలి.

(నేడు జాతీయ సైన్స్ దినోత్సవం)

ఎస్. అబ్దుల్ ఖాలిక్

63001 74320

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

మానవజాతి పురోగతికి మూలం సైన్స్


Tags:    

Similar News