పాఠాలు నూరిపోసే పద్ధతి మారాలి!

National Science Day 2024 importance

Update: 2024-02-28 00:45 GMT

దేశవ్యాప్తంగా సంప్రదాయ మూస పద్ధతిలో పాఠాలు నూరిపోసే విధానానికి చెల్లు చీటీ ఇవ్వాలి. వృత్తి విద్యా కోర్సులకు విశేష ప్రాధాన్యం కల్పించాలి.

దేశంలో సైన్స్ & టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం కోర్సులు యూనివర్సిటీలో పరిశోధనా కోర్సుల నాణ్యతను పెంచడంపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడం అవసరం. 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతరం పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి, ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదించివేస్తాయి' అన్న ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ మాటలను గుర్తుంచుకోవాలి.

కాళ్ల మీద నిలబెట్టే చదువేది?

రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. విద్యార్థి తన విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే ఉద్యోగం కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. విద్యార్థుల్ని తమ సొంత కాళ్లపై నిలబెట్టేలా చిన్ననాటి నుండే వృత్తి విద్యలు భోదించాలనే జాతిపిత ఆశయాలు అడుగంటిపోతున్నాయి. విద్యార్థి ప్రాథమిక విద్య నుండి కళాశాల విద్య వరకు ఏ దశలో చదువు మానేసినా బతుకు తెరువుకు ధోకా ఉండకూడదు. నిత్య జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలను విద్యాలయాలు నేర్పించాలి. తమ కాళ్లపై తాము నిలబడే కులవృత్తులు తండ్రులతోనే అంతరించిపోతున్నాయి. పిల్లల విషయానికి వచ్చేసరికి, వీళ్ళు ఉద్యోగం కొరకు ప్రభుత్వం పైననో, ప్రైవేట్ కంపెనీల పైననో ఆధారపడుతున్నారు. ప్రభుత్వం కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ ఎంత మందికి ఉపాధిని కల్పించగలుగుతాయి? మన దేశం విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి ఇకనైనా కృషి చేయాలి.

ఏం చేయాలి?

ప్రతి విద్యార్థి పరిశోధనలపై, తన సొంత ఆలోచనలకు పదును పెట్టి మన దేశ ఖ్యాతిని నిలబెట్టాలి. ప్రతి ఉన్నత పాఠశాలలో, ప్రతి జూనియర్ కాలేజీలో ప్రభుత్వం ఒకేషనల్ కోర్సులను ప్రవేశ పెట్టాలి. ఐ.టి.ఐ.లు (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లకు ప్రాధాన్యత నివ్వాలి. శాస్త్రీయ అంచనాల ప్రాతిపదిక నిపుణతకు, మానవ వనరులను తీర్చిదిద్దడానికి తగ్గట్లు పాఠ్యాంశాల క్రోడీకరణ కావాలి. అంతేకాని మూస పద్ధతిలో పాఠాలు చదవడం, జ్ఞాపకం ఉంచుకోవడం, పరీక్ష రాయడం, పాస్ కావడం, కేవలం జ్ఞాపక శక్తికే పరీక్ష. దీని వల్ల ఏమీ ఉపయోగం లేదు. అప్రెంటీసీప్, ఇంటర్న్‌షిప్ కోర్సుల రూప కల్పన కావాలి. ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనా రంగంలో ప్రాముఖ్యతనిస్తే తయారీ, నిర్మాణం, పునరుత్పాదక ఇంధన వనరులు, రవాణా తదితర రంగాల్లో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి. ప్రభుత్వం క్రొత్త పరిశ్రమలు నెలకొల్పి పౌరులను స్వయం సమృద్ధులుగా చేయవలసి ఉంది.

(నేడు జాతీయ సైన్స్ దినోత్సవం)

సి.వి.వి. ప్రసాద్

విశ్రాంత ప్రధానాచార్యులు

80196 08475

Tags:    

Similar News