చిత్రకళా గురువు 'దాసి' సుదర్శన్

National Award winner Daasi Sudarshan passes away

Update: 2024-04-03 00:45 GMT

నల్గొండ పేరు చిన్నదే కానీ కళలకు, ఉద్యమాలకు మాత్రం తరగని చెలిమె. అన్ని రంగాల్లో నిష్ణాతులను అందించిన నేల అది. ఒక్కో కొత్త తరం గురువులను గౌరవిస్తూ, వారి స్ఫూర్తినొందుతూ సాగుతోంది. అందుకే తెలంగాణ సత్తా చాటే రచయితలు, కళాకారులకు అది పుట్టిల్లుగా అలరారుతోంది.

నల్గొండ అందించిన అలాంటి మార్గదర్శకుల్లో డ్రాయింగ్ మాస్టర్ పిట్టంపల్లి సుదర్శన్ ఒకరు. చిత్రలేఖనంపై ఆసక్తి ఉన్న ఎందరికో కుంచె పట్టును నేర్పిన ప్రజ్ఞాశాలి ఆయన. ఉద్యోగ విరమణ తర్వాత ఇంటి వద్దే ఉంటున్న సుదర్శన్ మాస్టర్ వందకు పైగా ప్రముఖుల పోట్రైట్స్‌తో ఒక ఎగ్జిబిషన్ చేయాలన్న సంకల్పంతో 50 పైగా పోట్రైట్స్ పూర్తి చేశారు. అయితే ఆయన ఆశ మధ్యలోనే ఆగిపోయింది. మిర్యాలగూడ లోని తన స్వగృహంలో ఆయన సోమవారం (1-4-2024) మధ్యాహ్నం గుండెపోటుకు గురయ్యారు. పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ ఒకటిన కన్ను మూశారు.

ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకుని..

నాగార్జునసాగర్‌ జూనియర్‌ కళాశాలలో డ్రాయింగ్‌ మాస్టర్‌గా పనిచేసిన ఆయన ఎంతోమంది విద్యార్థులను కళలు, సాహిత్యం వైపు మళ్లించారు. సాహితీవేత్త గానే కాకుండా తన కళా ప్రతిభతో సినీరంగంలోనూ రాణించారు. ప్రముఖ సినీ దర్శకుడు బి.నర్సింగరావుతో కలిసి పలుచిత్రాల్లో పనిచేశారు. నర్సింగరావు దర్శకత్వంలో 1988లో తెరకెక్కిన ‘దాసి’ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. అప్పట్లో విశేష ప్రజాదరణ పొందిన ఈ చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సుదర్శన్‌‌కి జాతీయ అవార్డు రావడంతో ఆయన 'దాసి' సుదర్శన్‌గా ప్రఖ్యాతి పొందారు. ఆ తర్వాత జాతీయ చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీలో ఆయన సభ్యుడిగా సేవలందించారు. ఆర్టిస్టుగా, సాహితీవేత్తగానే కాకుండా ఆయన జర్నలిస్టుగా కూడా వివిధ పత్రికల్లో సాహిత్యం, కళల గురించి ఎన్నో వ్యాసాలు, వార్తలు రాశారు. కొంతకాలం వార్త దినపత్రికకు విలేకరిగా పనిచేశారు.

ఎన్నో చిత్రాలు వేయాల్సిన సమయంలో..

ఆయన సుదీర్ఘ ఉద్యోగ జీవితం నాగార్జున సాగర్‌లోనే గడిచింది. తనకు పరిచయమైన మిత్రులను నాగార్జునసాగర్‌కు రమ్మని ఆహ్వానించేవారు. ఆరడుగుల ఎత్తుతో, ఎత్తుకు తగ్గ బలమైన శరీరంతో, ఉంగరాల జుట్టుతో అందమైన సినీనటుడిలా కనబడేవారు. అందరినీ సౌమ్యంగా, ప్రేమగా పలకరించడం ఆయన నైజం. నాగార్జున సాగర్‌లో ఉన్నా నల్లగొండలో జరిగే ప్రతి సాహితీ, సాంస్కృతిక సమావేశానికి హాజరయ్యేవారు. హైదరాబాద్‌లో జరిగే ప్రముఖ సమావేశాలకు కూడా వచ్చేవారు. పత్రికలు, పుస్తకాలు చదవడం ఆయన ఇష్టవ్యాపకం. అలా ఫోను పలకరింపుతో నాకు పరిచయమైన సుదర్శన్ గారు ఎన్నో విషయాలు చర్చించేవారు. స్వయంగా ఆయనను నల్గొండలో ఓసారి, వేదకుమార్ ఏర్పాటు చేసిన తెలంగాణ రిసోర్స్ సెంటర్ సమావేశం, హైదరాబాద్‌లో కలుసుకోవడం జరిగింది. ఆయన ప్రముఖ చిత్రకారుల పరిచయ వ్యాసాలతో ఒక పుస్తకం కూడా రాశారు. అందమైన ఆయన చేతిరాతను చూసినవారు మరిచిపోలేరు. కవరుపై చిరునామాను సైతం అందమైన రంగవల్లిగా తీర్చిదిద్దేవారు. ఇంకా ఎన్నో చిత్రాలు వేయాల్సిన విశ్రాంత సమయంలో సుదర్శన్ 72వ ఏట మరణించడం ఆయన మిత్రులకు, అభిమానులకు తీరని లోటు. చిత్రకళా గురువుగా, సాహితీవేత్తగా, స్నేహశీలిగా ఆయన జ్ఞాపకాలు మాసిపోనివి. ఆయన వేసిన చిత్రాలు ఆయన కీర్తిని నిలబెడతాయి.

-బి. నర్సన్

94401 28169

Tags:    

Similar News