మహోజ్వల భారత్ కోసం..

Narendra Modi's efforts for mahojwala India

Update: 2024-03-16 01:15 GMT

మహోజ్వలమైన భారత దేశపు భవిష్యత్తుకు నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. గత దశాబ్దికాలంగా అది నిరాటంకంగా కొనసాగుతోంది. 2004-2014 వరకు యూపీఏ పాలనలో నమోదైన అవినీతి, లంచగొండితనం నుంచి దేశాన్ని కాపాడానికి మోదీ పడుతున్న కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు. పదేళ్ల పాలనలో మోదీ పాపాలకు తావులేకుండా చూశారు. కర్కశుల పట్ల కఠినత్వాన్ని ప్రదర్శించారు. అది కొనసాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

భారతావని అవస్తలు పడుతున్న వేళ... దేశం దుర్భరమైన అస్తవ్యస్థ వాతావరణంలోకి వెళ్లిన వేళ... ఎటు చూసినా ఆర్తనాదాలు వినబడుతున్న 2014లో నరేంద్ర మోడీ దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. ఇలా మోదీ నేతృత్వంలోని బీజేపీ 2014లో కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ సాధించి ప్రజారంజక పాలనను సాగిస్తోంది. దశాబ్ద పాలనలో గతమెన్నడు ప్రజలు చూడని అభివృద్ధిని చేసి చూపించింది. పరిపాలన దక్షతకు నిర్వచనం ప్రధాని నరేంద్ర మోదీ అని విదేశాలు కూడా గుర్తించేంత స్థాయికి వెళ్లడం మనకు గర్వకారణం.

స్వచ్ఛభారత్‌కి అంతర్జాతీయ ప్రశంస

నరేంద్ర మోడీ ప్రధాని అయిన కొద్ది రోజులకే స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా మొదలుపెట్టి ప్రతీ ఇంటికి చేరువయ్యారు. భారతదేశంలో పరిశుభ్రత ఉండదన్న విదేశీయుల అభిప్రాయాన్ని చెరిపివేయడానికి అది చిన్న ప్రయత్నమే కావచ్చు కానీ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న కార్యక్రమం అది. దేశంలో పెద్ద ఎత్తున శౌచాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాంతో దేశంలో బహిరంగ మల విసర్జన సమస్యను రూపుమాపి ప్రజలు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా జీవించడానికి దోహదం చేశారు. ఆ తర్వాత మోడీ ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలన్న కలను నెరవేర్చడానికి ప్రధాన మంత్రి ఆవస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా లక్షలాది ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాళ దేశంలో లక్షలాది మంది ఇంటి యజమానులయ్యారు.

పెద్ద నోట్ల రద్దు సాహస నిర్ణయం

వెనువెంటనే దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. యూపీఏ హయాంలో ప్రబలిపోయిన లంచగొండితనం, అవినీతి నుంచి దేశాన్ని రక్షించడానికి తక్షణ చర్యలకు ప్రధాని ఉపక్రమించారు. అందుకోసం పెద్ద నోట్ల రద్దు వంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కొంత ఇబ్బందికి గురైనప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ నిర్ణయాన్ని ఓటు ద్వారా ప్రజలు సమర్థించారు. అదే మోదీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతను రుజువు చేస్తుంది.

కరోనాపై యుద్ధంలో విజయం

రెండోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత భారత దేశం అంతర్జాతీయంగా ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే. కరోనాను ఎదుర్కొవడమే కాదు... భయాందోళనతో ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు భరోసానిస్తూ అన్ని వర్గాలతో నిత్యం సంభాషించారు. అటు ప్రజలకు భరోసా ఇస్తూనే కరోనా మహమ్మారిని పారదోలడానికి ఎప్పటికప్పుడూ సూచనలు ఇస్తూ చివరికి మన దేశం నుంచి కరోనా నిరోధక వ్యాక్సిన్ వచ్చేలా చేశారు.

ఉచిత ఆహార పథకం

కరోనా కాలంలో మన దేశ పేదలు, వలస కార్మికుల కష్టాలను అర్థం చేసుకున్న ప్రధాని మోదీ... ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత ఆహార పథకానికి రూపకల్పన చేశారు. దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాలన్న కీలకమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. ప్రపంచ దేశాలకు మోడీ ఒక దిక్సూచిగా కనిపిస్తున్నారు. ప్రతిష్టాత్మక జీ 20 శిఖరాగ్ర సమావేశాలను దిగ్విజయంగా పూర్తి చేసి ప్రపంచ దేశాల మన్ననలను పొందారు.

రైతుల అభిమతాన్ని గౌరవించి...

ఈ దేశ ఔన్నత్యం, అవసరాలు, ప్రజల కష్టసుఖాలు నరేంద్ర మోదీకి తెలిసినట్లు ఎవరికీ, ఏ పార్టీకి తెలియవు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా కొనసాగించడమే కాకుండా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎన్నో రేట్ల ఎక్కువ బడ్జెట్ ను కేటాయిస్తూ వస్తున్నారు. ప్రజలు, సమాజం ఏది కోరుకుంటే అదే పరిపాలన అని ప్రధాని నరేంద్ర మోదీ నిరూపించడానికి ఒక ఉదాహరణ. రైతుల మేలు కోరి మూడు సాగు చట్టాలను తీసుకొచ్చారు. కానీ కొన్ని పార్టీలు రెచ్చగొట్టడంతో రైతులు రోడ్డు నెక్కి వాటికి వ్యతిరేకిస్తే వాటిని వెనక్కి తీసుకోవడానికి కూడా ప్రధాని సంకోంచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో మోడీ పదేళ్ల పాలనకు ప్రజలకు ఓటేయబోతున్నారు. ఓటుతో మరోసారి మోదీని గెలిపించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ మరోసారే కాదు... మరికొన్ని కాలాల పాటు అధికారంలో ఉండడానికి ఈ ఎన్నికలు మార్గాన్ని చూపబోతున్నాయి. నరేంద్ర మోదీ చూపుతున్న మార్గం భారతదేశానికి తరతరాల పాటు మార్గదర్శనం.

- బొమ్మ శరత్ గౌడ్

96146 33333

Tags:    

Similar News