నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభంలో ఆయనకు ఎదురైన ఆటంకాలు అన్నీ ఇన్ని కావు. అయినా వెనకాడలేదు. వైసీపీ ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గరనుండి అడుగడుగునా ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి యువగళం పాదయాత్రని జనం చైతన్యయాత్రను చేశారు. పాదయాత్రకు జనమే బలమై, బలగమై 3,132 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు నారా లోకేష్. అడుగడుగునా ప్రభుత్వ నిర్బంధాలను అధిగమించి అనుమతిస్తే పాదయాత్ర, లేకపోతె దండయాత్ర అంటూ పాదయాత్ర కొనసాగించారు. ధీరుడి పోరాటం ముందు ప్రభుత్వం తలవంచింది. యువగళం ప్రజా గళం అయింది.
విధ్వంసక పాలనలో అధోగతి పాలు అయిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అగ్రగామిగా నిలిపేందుకు నడుం బిగించిన నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర కుప్పంలో 2023 జనవరి 27న మొదటి అడుగు వేశారు. మండుటెండ లోనూ విరామం లేకుండా కాళ్ళు బొబ్బలెక్కినా లెక్క చెయ్యకుండా పాదయాత్ర కొనసాగి సాగించి ప్రజలను చైతన్యపరిచారు. సమస్యలు చుట్టుముట్టి అన్ని రంగాలు నిర్వీర్యమై, వ్యవస్థలు ధ్వంసమై ప్రజలు దిక్కులేనివారిగా దిక్కులు చూస్తున్న సమయంలో బాధ్యత గల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గ్రామ,పట్టణ ప్రాంత ప్రజలను కలుసుకోని వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు అన్వేషించడానికి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆగమైన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకొనేందుకు ప్రజలను కార్యోన్ముఖులను చేసేందుకు, నారా లోకేష్ చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయవంతంగా పూర్తయింది.
మండుటెండలోనూ ఆగనియాత్ర
కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర అయిదు కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగింది. ఇంటినుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా తిరిగి వస్తామనే గ్యారంటీ లేక భయాందోళనలతో బతుకుతున్న మహిళలకు అండగా వుంటానని, అడ్డగోలు ధరలు, పన్నులు బాదుడుతో బతుకుభారంగా మారిన సామాన్యుడి కడగడ్లను కళ్ళారా చూస్తూ, గుండె చెదిరిన రైతన్న వెన్ను తడుతూ , ఇలా అడుగడుగునా అభద్రతాభావం, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అన్ని వర్గాల ప్రజలకు నేనున్నానంటూ లోకేష్ భరోసా ఇచ్చారు లోకేష్. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో తప్ప ఎటువంటి విరామలేకుండా నారా లోకేష్ పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం యువగళం ఆగలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరువర్షంలో సైతం యాత్రను కొనసాగించారు. పాదయాత్ర నంద్యాల చేరుకున్న సమయంలో అభిమానుల తాకిడికి చేయినొప్పితో బాధపడుతున్న సమయంలో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా యువనేత లోకేష్ లెక్కచేయలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో లక్ష్యంగా దిశగా పయనించారు లోకేష్.
ప్రజలకు వివరించడంలో సఫలీకృతం,
నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి విద్వంస, విద్వేష, అరాచక, ఫాసిష్టు పాలనా వైఫల్యాలపై నిప్పులు చెరగుతూ వెన్ను చూపని పోరాటం చేస్తూ ప్రజా సంక్షేమం కోసం,, ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ పార్టీ శ్రేణులకు, ప్రజానీకానికి భరోసా ఇచ్చారు లోకేశ్. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అసమర్ధత, వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, పెంచిన విద్యుత్తు చార్జీలు, పడకేసిన పారిశ్రామిక రంగం, పెరిగిన నిత్యావసర ధరలు, రాష్ట్రంలో ప్రజా సంపద దోపిడీ చేస్తున్న విధానాన్ని ప్రజల కళ్ళకు కట్టినట్లు వివరించారు లోకేష్. పాదయాత్రలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, కూలీలు, కమ్మరి, కుమ్మరి, కంసాలి వంటి చేతి వృత్తులు వారిని బీసీలను, రైతులను, మహిళలను, విద్యార్థులు, నిరుద్యోగులు, వీరందరి సమస్యల పరిష్కారానికి, స్వావలంబనకు వివిధ వర్గాల అభ్యున్నతి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగారు.
70 బహిరంగ సభలు, సమావేశాలు
పాదయాత్రలో దారి పొడవునా ప్రజలు లోకేష్ రాకకోసం హారతులు పట్టుకొని ప్రజలు ఎదురు చూశారు. విజయవాడ వంటి నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తెల్లవారుజాము 3.30వరకు ఎదురుచూడటం లోకేష్‌పై నెలకొన్న నమ్మకానికి నిదర్శనం. యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ 70 బహిరంగ సభలు, 154 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలనుంచి రాతపూర్వకంగా 4,353 వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా యువనేత లోకేష్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మంది ప్రజలు యువనేతతో కనెక్ట్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్రను లోకేష్ అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా అగనంపూడి వద్దే ముగించాల్సి వచ్చింది.
పార్టీ శ్రేణులకు సరికొత్త భరోసా
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టు వలన తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన అతిపెద్ద సంక్షోభ సమయంలో అన్ని తానై నిలిచి బలమైన నాయకత్వంఇవ్వగల భవిష్యత్ నేతగా పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు నారా లోకేష్. చంద్రబాబును అక్రమ కేసులతో అరెస్టు చేసిన విధానాన్ని, జరిగిన అన్యాయాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రచారం చేయడంలో నిస్సందేహంగా లోకేష్ కృతకృత్యులయ్యారు. ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలసి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి చంద్రబాబుకు అనుకూలంగా వారి మద్దతు సాధించారు. పార్టీ ఎంపీలతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని సైతం కలసి చంద్రబాబు అక్రమ అరెస్టుపై వివరించారు. పార్టీ సంక్షోభ సమయంలో ఢిల్లీలో టీడీపీ ఎంపీలందరిని సమన్వయం చేసుకుని ఒక వైపు లాయర్లతో సంప్రదింపులు, మరో వైపు పార్టీ ఏర్పాటు చేసిన పోలిటికల్ యాక్షన్ కమిటీతో చర్చలు, ఇంకో వైపు మీడియా సమావేశాలతో చేస్తున్న అవిశ్రాంత కృషి సంక్షోభ నిర్వహణలో లోకేష్ ప్రతిభను బహిర్గతం చేయడమే కాక, సుదీర్ఘ కాలం పార్టీకి నాయకత్వం వహించగల సమర్థ భవిష్యత్ నేతను పరిచయం చేసింది. నారా లోకేశ్ ప్రజానాయకుడుగా రుజువు చేసుకొన్నారు.
రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2,094 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర పూర్తి చేశారు లోకేష్. పల్లెపల్లెకు వెళ్లి ప్రతి ఒక్కరినీ పలకరించారు. ఆత్మీయతను పంచుతూ ఆత్మస్థైర్యం నింపారు. ఉద్యోగాలు లేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు.
(డిసెంబర్ 20న యువగళం ముగింపు మహాసభ)
నీరుకొండ ప్రసాద్
98496 25610