యురేనియం ఊబిలో నల్లమల అడవి

Nallamala Forest in Uranium Search

Update: 2024-03-14 01:00 GMT

యురేనియం అనే మానవ వినాశనకారి నల్లమల అడవి ప్రాంతంలో విస్తారంగా ఉందని తేలడంతో యూసిఎల్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నల్లమలపై కన్నేసింది. యురేనియం వెలికితీత ముసుగులో ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, వారితో పాటు లంచగొండి అవినీతి అధికారులు చేతులు కలిపి, స్వచ్ఛమైన ఎలాంటి కల్మషం లేని అడవి బిడ్డల బతుకుల్ని అంధకారంలోకి నెట్టి వేయగలిగే ఒక కుట్ర ఇప్పుడు నల్లమల అడవి ప్రాంతం మీద పగబట్టింది..

దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల ఎత్తులో ప్రకృతి వైపరీత్యాలకు నిర్మూలనకు ఒక పెట్టని కోటవలె దక్కన్ పీఠభూమిలో దాగివున్న తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవి ప్రాంతం ఎన్నో రకాల వన్య ప్రాణులకు అటవీ ఉత్పత్తులకు వాటి మీద ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ఒక ఆవాస ప్రాంతంగా ఉంటూ, పర్యాటకులకు కనువిందు చేసే ఒక సుందరవనమై వికసిస్తుంది.

తొలి యురేనియం బావి

యురేనియంను ఒక ఖనిజం నుండి వెలికి తీయవచ్చు. ఈ యురేనియం ద్వారా రేడియోధార్మిక శక్తిని కనుగొన్నారు. వీటినుండి అసాధారణమైన శక్తి విడుదలై నూక్లియర్ ఎనర్జీ ఉత్పన్నం అవుతుంది. ఈ ఎనర్జీని అణుబాంబుల తయారికి, శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌లో ఇందనంగా వాడతారు. 1950 దశకంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మన దేశంలో ఏడు యురేనియం బావులను, 22 న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటును ప్రతిపాదించగా 1967 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంలోని జూదుగూడా అనే ప్రాంతంలో యురేనియం బావిని ప్రారంభించారు. ఈ బావి నుండి వెలుపడే వ్యర్థాల మూలంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు అనేక రకాల అనారోగ్య పరిస్థితులకు గురికావడం తెలిసిన విషయమే. జూదుగుడా యురేనియం బావి మూసివేతకు అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులను కాపాడడం కోసం ఎన్నో రకాల ఎన్జీవో సంస్థలు సర్వే వివరాలను ప్రభుత్వాలకు విన్నవించాయి. ఎన్జీవోస్ ఇచ్చిన నివేదికలో వాస్తవాలు తెలుసుకోవడం కోసం అప్పటి ప్రభుత్వం బార్క్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఎన్జీవో సంస్థలు ఇచ్చిన నివేదిక యురేనియం తవ్వకాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. బార్క్ నివేదికను ఆధారంగా చేసుకుని జూదుగూడలో కొన్ని సంవత్సరాలు యురేనియం తవ్వకాలు యధావిధిగా కొనసాగాయి.

నల్లమలలో యురేనియం నిల్వలు

1998లో వాజ్‌పేయి ప్రభుత్వం అక్కడ ప్రజలు చేస్తున్న పర్యావరణ పరిరక్షణ, రైతు ఉద్యమాలకు తలొగ్గి జూదుగూడ యురేనియం బావిని మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. తదనంతరం భారత ప్రభుత్వం యూసీఐఎల్ ఆధ్వర్యంలో 2007 నవంబర్ 27న అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామంలో, గుంటూరు జిల్లా కొప్పునూరు గ్రామంలో దాదాపు లక్ష అరవై వేల టన్నుల యురేనియం ఖనిజాన్ని వెలికి తీశారు తరువాత అక్కడ నిలువలు అయిపోవడం మూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కన్ను... పచ్చని అడవితో ప్రకృతి కనువిందులతో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసే నల్లమల అడవి ప్రాంతంపై పడడం జరిగింది.

సమాజ వినాశకారి!

ఇక్కడ యురేనియం నిల్వలు ఉన్నట్లు యూసీఐఎల్ గుర్తించింది. ఈ తవ్వకాల కోసం దాదాపు 5 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ యురేనియం ద్వారా వెలువడే వ్యర్థాలు కృష్ణానదిలో కలిస్తే మానవాళి, వన్యప్రాణులు, అక్కడ నివసించే గిరిజన ప్రాంత ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. యురేనియం ద్వారా వెలుపడే రసాయనాలు గాలిలో కలవడం వల్ల గాలి విషతుల్యమై దాని ప్రభావం దాదాపు 8 మైళ్ల దూరం వరకు వ్యాపిస్తుంది. అలా వ్యాపించిన విషతుల్యమైన గాలిని పీల్చుకోవడం వలన ఆ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతారని జార్ఖండ్ రాష్ట్రంలోని జూదుగుడా ఉదంతం ద్వారా తేటతెల్లమైంది. సమాజ వినాశనకారి అయిన యురేనియం వెలికితీత నిర్ణయాన్ని వెంటనే ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.

రాగిపాని బ్రహ్మచారి

నల్లమల వాసి

95424 64082

Tags:    

Similar News