మూసీ ప్రక్షాళన జరగాల్సిందే!

హైదరాబాద్ దినదినం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో మూసీ విస్తరణకు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రక్షాళన కచ్చితంగా

Update: 2024-10-02 01:00 GMT

హైదరాబాద్ దినదినం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో మూసీ విస్తరణకు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రక్షాళన కచ్చితంగా అవసరం. కేవలం సుందరీకరణ కోసమో, ప్రభుత్వ బిల్డింగ్‌లు కట్టడం కోసమో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే వ్యతిరేకించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది.. కానీ భవిష్యత్తు తరాల కోసం, కోట్ల మంది ప్రజల సౌకర్యార్థం బహుత్తర కార్యక్రమాన్ని చేస్తే వ్యతిరేకించడం సరైనది కాదు.. అక్కడి నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. మూసీ బాధితులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరైంది కాదు. 

దేశంలో లోటు పాట్లు జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నాలుగు గంటల పాటు వర్షం కురిస్తే ప్రతి గల్లీ చెరువులను తలపిస్తుంది. ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్తుంటారు.. ప్రభుత్వాలు మారిన ఈ సమస్య మాత్రం మారడం లేదు..

ఈ నిర్ణయం ఎందరో చెప్పిందే..!

1990లో వచ్చిన వరదల చాలా మంది నిరుపేదలు ప్రాణాలు కోల్పోయారు.. అంతెందుకు మొన్నటికి మొన్న వచ్చిన వరదల్లో సామాన్య ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. గత ప్రభు త్వం మూసీని అభివృద్ధి చేస్తామని నీటి మాటలు చెప్పిన విషయం అందరికి తెలిసిందే.. కానీ ఇప్పటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిసినా, ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా నిస్వార్థంగా ప్రజల బాగు కోసం మూసీ ప్రక్షాళన చేస్తుంది. గత ప్రభు త్వం ఏకపక్షంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టును కడితే భూకంపం వస్తుందని కాగ్ నివేదిక చెప్పినా పెడచెవిన పెడుతూ.. ప్రాజెక్టును కట్టిన దానికంటే ఇది పెద్ద తప్పు కాదు.. అంత పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా కాదు. ఈ సమయంలో మూసీ బాధితులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు రాజకీయం చేయ డం సరైన విషయం కాదు. నిర్వాసితులకు అందాల్సిన పరిహారం, కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి, వారిని రెచ్చగొట్టే కార్యక్రమాలను చేయడం ఏమాత్రం సబబు కాదు. ఇది ఇప్పుడున్న ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు.. కోర్టు మొదలు మన ఇంజనీర్లకు జాతిపిత లాంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైతం మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పినవారే.

మొసలి కన్నీరు ఎందుకు..?

మూసీ బాధితులతో మాట్లాడుతూ ఒక నాయకుడు ఏడ్చినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. నిర్వాసితులపై నిజానికి అంతా బాధ, దుఃఖం వచ్చిన ఆ నాయకుడికి ఆయన సొంత జిల్లాలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఊరికి దూరమై చెట్టుకొకరిని పుట్టకొకరిని పోలీసులు బలవంతంగా ఊర్లకు ఊర్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఆ బాధ ఆ కన్నీళ్లు రాలేదా..? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. భూ నిర్వాసితులను కడుపున పెట్టుకొని చూసుకుంటా.. అని కల్ల బొల్లి మాటలు చెప్పి.. ఇప్పటికీ సరైన ప్యాకేజీ, సాయం అందకపోగా గత పదేళ్లుగా ఏడు స్తున్న వారి కన్నీరు కనిపించడం లేదా..?

ఒక్క ప్రభుత్వం ఒక పాలసీ తీసుకువచ్చిన తర్వాత కచ్చితంగా ముందుకు వెళ్తుందని తెలిసి కూడా బాధితులను రెచ్చగొట్టేలా మాటలు చెప్పడం సబబు కాదు. అమాయక ప్రజలను బలి చేయడానికి ఇది ఎన్నికల టైం అసలే కాదనే విషయాన్ని మర్చిపోయి ఇలాంటి కపట ప్రేమను ఒలకబోస్తున్నారు.. అంత బాధ ఉన్న నాయకుడు మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర పోయి ఏడవాలి.

అనిల్ కుమార్ యాదవ్

జర్నలిస్ట్,

91774 54529

Tags:    

Similar News