ప్రజారోగ్యం కోసమే ప్రక్షాళన

పురాతన నాగరికతలు (నగరాలు) అన్ని నదీ లోయ కేంద్రంగానే విరాజిల్లాయి. అలాగే భాగ్యనగరం కూడా ముచుకుందా (మూసీ) నది ఒడ్డున వెలసి

Update: 2024-10-19 01:00 GMT

పురాతన నాగరికతలు (నగరాలు) అన్ని నదీ లోయ కేంద్రంగానే విరాజిల్లాయి. అలాగే భాగ్యనగరం కూడా ముచుకుందా (మూసీ) నది ఒడ్డున వెలసి, నేడు ‌విశ్వనగరంగా పేరొందింది. అనంతగిరి కొండల నుండి దాదాపు 240 కిలోమీటర్ల పొడవు గల ఈ నది గ్రేటర్ హైదరాబాదులో దాదాపు 50 కిలోమీటర్ల పొడవు ఉన్నది. మూసీకి వచ్చిన వరదల కారణంగా చివరి నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాలు నిర్మించగా శతాబ్ద కాలంగా నగరానికి తాగునీటిని, వ్యవసాయానికి సాగునీటినిచ్చారు. అలా మూసీ పెరిగిన జనాభా పరిశ్రమల కారణంగా నేడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. 

జలం సకల జీవరాశులకు ఆధారం. స్వచ్ఛమైన నీ‌రు తాగడానికి, సాగు చేయడానికి ఉపయోగ పడట‌మే కాకుండా మొక్కలు, జీవరాశుల పెరుగుదల‌కు ఉపయోగపడుతుంది. ప్రజలకు మంచి ఆహారం ల‌భిస్తుంది. తద్వారా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ప్రస్తుతం మూసీలో మురుగునీటి వలన తీర ప్రాంతాల్లో దోమల బెడద, విషపూరిత ఆహారపు పంటలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అందుకే మూసీ నదికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ప్రక్షాళన చేయాలని సంకల్పంతో ఉంది.

మూసీ కలుషితం కావడంతో..

ప్రపంచంలో కాలుష్యమైన నదులలో మూసీది 22వ స్థానం. ఈ నది నగరంలోని నివాస స్థలాలలోని మురికినీటి వ్యర్ధాలను, పరిశ్రమలు విడుదల చేసే వ్యర్ధ రసాయనాలను తీసుకుని వెళ్లి వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు ఇదే నీటితో పంటలు సాగు చేస్తున్నారు. నది పరివాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కూ‌డా కలుషితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో భూమిపై పొరల్లో కాలుష్యం పేరుకుపోయింది. పరిశ్రమల నుండి విడుదలైన వ్యర్ధాలలోని లెడ్, కాడ్మియం, క్రోమియం వంటి రసాయనాలు పండించే కూరగాయలు ఆకుకూరల్లోకి చేరుతున్నాయి. ఇవి తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అదే విధంగా పశుపక్షాదులు కూడా ఈ నీటితో ఇబ్బందికి గురవుతున్నాయి. ఇక మూసీ నుండి వచ్చే దుర్గంధపు వాసనను పీల్చని నగరవాసి ఎవరూ ఉండకపోవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నదుల కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

నదులు శుభ్రం చేయడం కొత్తకాదు..

ప్రపంచ సముద్రాలలోకి 60 శాతం వ్యర్థాలు ఆసి యా ఖండంలోని నదులలో నుండే వస్తున్నట్లు తె‌లిపింది. ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వం పాసిజ్ నదికి పునరుజ్జీవం పోసింది. ఇండోనేషియా, చైనాలో న‌దులతో పాటు అర్జెంటీనాలోని మాటాంజ నదిని మురికి నీటి నుండి విముక్తి పొందేలా చేశారు. న‌దులను శుభ్రపరచడానికి వరల్డ్ బ్యాంకు లోన్ ఇ‌స్తుంది. మూసీ ప్రక్షాళనకై గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలకోట్ల రుణం తీసుకువచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నెలకొల్పింది. కానీ కార్యచరణ రూపం దాల్చింది మాత్రం శూన్యం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికతో సర్వే చేయించి పేదలు నష్టపోకుండా ప్రణాళికలు రచిస్తోంది. నదులను శుభ్రం చేయడం అనేది భారతదేశంలో నూతన అధ్యాయం ఏమి కాదు. నమామి గంగా పేరుతో గంగానదిని, గుజ‌రాత్‌లో స్వచ్ఛ్ సబర్మతి పేరుతో, తెలినిరోరుకుం నవకేరళం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నదుల‌ను శుభ్రం చేశాయి. కానీ కొందరు బీజేపీ పార్టీ నాయకులు మూసీ నదిని శుభ్రం చేయడానికి సహకరించకపోగా, అడ్డగించాలని చూడటం విస్మయాన్ని కలిగిస్తుంది. మూసీ నది కృష్ణా నదికి ఉపనది. కృష్ణా నది తీరంలో కనకదుర్గ దేవాలయంతో పాటు ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇందులో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. రాజకీయాలకతీతంగా ప్రజా శ్రేయస్సు కోరి మూసీ ప్రక్షాళన చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీలైతే కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకొచ్చే విధంగా సంబంధిత నాయకులు కృషి చేస్తే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు.

అందరిని ఒప్పించి, మెప్పించి..

ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలు కలిగి ఉండి నగర ప్రజలకు మేలు చేస్తుంది. కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ, ప్రభుత్వం వారిని ఒప్పించి, మెప్పించి వారికి సకల సౌకర్యాలు కల్పించాకే వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం ద్వారా జీహె చ్‌ఎంసీ 1955 చట్టంలో 374 (బి)నీ చేర్చారు. ఓ‌ఆర్‌ఆర్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి, నీటి వనరులను, మురికి కాలువలు, రోడ్లు ఇ‌తరత్రా స్థలాల ఆక్రమణలు తొలగించడానికి అధికారాలు కట్టబెట్టింది. ప్రజలకు ఇబ్బంది కలగకుం డా అవసరమైన చోట్ల రిటైనర్ వాల్ నిర్మించడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తె‌లుస్తుంది. ఇదే కాకుండా నగరంలో విస్తరించి ఉన్న వివిధ చెరువుల నీరు కూడా కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పరిశ్రమలు నేరుగా రసాయనాలను నీటి ప్రవాహాల్లోకి విడుదల చేస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు వ్యర్థాలను బోరు బావులు తవ్వి భూగర్భంలోకి రసాయనాలను పంపిస్తున్నాయి. కావున సీపీసీబీ యంత్రాంగం మరింత కట్టుదిట్టంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.

ప్రజలు సహకరించాలి!

ఒక మంచి వ్యూహాన్ని రచించి ప్రణాళిక బద్ధంగా చెత్త నిర్వహణ చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. చెత్తను తగ్గించడం, వేరు చేయడం, రీసైక్లింగ్, తిరిగి వినియోగించడం (రీయూజ్) ద్వారా చెత్తను తగ్గించవచ్చు. అలాగే నీరుని రీ‌ట్రీట్మెంట్ చేయుటకు పిపిపి మోడల్‌లో సంస్థలను ఏర్పాటు చేసి కొత్త ఉపాధి అవకాశాలను కూడా కల్పించవచ్చు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగం నిరోధించుటకు చట్టపరమైన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది. నూతన భారీ భవన నిర్మాణాలు జరిగే చోటుల్లో ఇంకుడు గుంతలు, సెల్ఫ్ డ్రైనేజ్ క్లీనింగ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. మూసీ ప్రక్షాళనకు ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజల స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంతోపాటు.. డ్రైనేజీలో చెత్త వేయడం ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపై పడేయడం వంటివి మానేయడం ద్వారా వర్షాలు వచ్చినప్పుడు.. చెత్త నది జల్లాలోకి చేరకుం డా నివారించవచ్చు. మూసీ ప్రక్షాళన ద్వారా జల జీవరాశులు నదిలో పెరగడంతో పాటు, నగర సుందరీకరణకు, మొక్కల పెంపకానికి ఈ నీరు ఉపయోగకరం అవుతుంది. మూసీ తీర ప్రాంతాల ప్రజలు అనారోగ్యం పాలవకుండా కాపాడుతుంది.

బుర్ర రవితేజ గౌడ్

టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

94931 09462

Tags:    

Similar News