హిట్స్ కన్నా ఫట్స్ మిన్న!
More Flops Than Hits, Releases From Telugu Film Industry
వర్తమానంలో ప్రచారం మాత్రమే సినిమాలను నాలుగు డబ్బులు తీసుకువస్తుందని నమ్మే దర్శక నిర్మాతలు ఎక్కువవుతున్నారు. అతిశయోక్తులు, బడ్జెట్ గారడీలు, మీడియా విశ్లేషణలు, పాటలు, క్లిప్పింగ్స్ వంటి వాటితో తొలి వారంలోనే రిటర్న్స్ ఆశిస్తున్నారు. కానీ... మొదటి రోజు మొదటి ఆటలోనే భవిష్యత్తు నిర్ణయం జరిగిపోతున్నది. ‘హిట్స్’ తక్కువ ‘ఫట్స్’ ఎక్కువ అనేది తెలిసిపోతున్నది. కాలం వేగంగా కదిలిపోతున్నది. సినిమా నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి.
కేవలం పది శాతం విజయం!
వేసవి అతి పెద్ద మార్కెట్‌గా భావిస్తారు తెలుగు చలన చిత్ర వర్గాలు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న సినిమాలన్నీ వేసవి గోదాలోకి వస్తాయి. కానీ ఈ సారి మొత్తంగా సంక్రాంతి, వేసవి సీజన్ తెలుగు సినిమా నిర్మాతలకు నష్టాలనే మిగిల్చిందని చెప్పాలి. గడిచిన ఆరు నెలల కాలంలో జనవరి నుంచి జూన్ వరకు విడుదలైన చిత్రాలలో కేవలం 10 శాతం మాత్రమే విజయం నమోదయింది. మిగిలిన సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. ఈ ఆరు నెలల కాలంలో వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘ఆది పురుష్’ ఒక్కటి ఒక ఎత్తుగా ప్రచారం జరిగింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ ఫాన్స్ వలన నెట్టుకు వస్తున్న టికెట్స్ తగ్గడం అనేది జరిగి దాదాపు నీరస దశకు చేరుకుంది. ఏ యువతరం కోసమైతే సాంకేతికతను నమ్ముకుని కథను వదిలేసారో ఆ యువత నిరాదరణనే చిత్రం మూట కొట్టుకోవడం విషాదం. ఈ దెబ్బ నుంచి కోలుకోవడం కూడా నిర్మాతకు కష్టమే. జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 155 చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇందులో 120 చిత్రాలు స్ట్రెయిట్ చిత్రాలు మిగిలినవి అనువాదాలు.
అంచనాలు లేనివే విజయాలు..
జనవరి నెలలో 15 సినిమాలు విడుదలైనవి. వాటిలో ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’ వంటి సెంటిమెంట్ మిళితమైన ఫక్తు వ్యాపారాత్మక సినిమాలు జనం చూశారు. ఈ మూడు చిత్రాలు బాలయ్య, చిరంజీవి, విజయ్ వంటి స్టార్స్ నటించినవే కావడం గమనార్హం. ‘వారసుడు’ నిజానికి తమిళ చిత్రమైన నిర్మాత, దర్శకులు తెలుగు వారు కావడం విశేషం. మిగిలిన సినిమాలు బాగానే తీశామని నిర్మాతలు చెప్పినా జనాలను మెప్పించలేక నీరసపడిపోయాయి.
ఫిబ్రవరి నెలలో 22 సినిమాలు విడుదలైతే కేవలం మూడు సినిమాలనే ప్రేక్షకులు ఆదరించారు. ఇందులో తమిళ హీరో ధనుష్ తెలుగు వారు తీసిన ‘సార్’ ఒకటి. ఈ చిత్రం నేటి ‘విద్యా’ తీరుతెన్నులను చిత్రిస్తూనే సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇచ్చారు. నటీనటుల నటన, దర్శక ప్రతిభ, ఒకటి రెండు పాటలు వంటివి సినిమాను విజయతీరానికి చేర్చాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా ‘కథ’ ప్రాధాన్యతను చెప్పింది. మిడిల్ బడ్జెట్‌లో వచ్చిన వినోద ప్రధానమైన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మరొకటి ‘రైటర్ పద్మభూషణ్’ మధ్యతరగతి వారి జీవిత కోణాలను సున్నితంగా హాస్య ప్రధానంగా ఈ మూడు చిత్రాలు మాత్రమే జనం మెచ్చిన చిత్రాలుగా నిలిచాయి. మిగిలిన చిత్రాలు నిరాశను మిగిల్చాయి.
మార్చి నెలలో 34 చిత్రాలు విడుదలైనాయి. ఈ నెలలో కాస్తో కూస్తో మాట దక్కించిన సినిమాలు ‘బలగం’, ‘దసరా’ ఇది పాన్ ఇండియా సినిమా (ట). మరాఠీ కథ ఆధారంగా కృష్ణవంశీ తీసిన ‘రంగమార్తాండ’. తొలి రెండు సినిమాలు తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ‘బలగం’ చిత్రంలో కథతో పాటుగా అనుబంధాలు, ఆప్యాయతలు వంటి వాటిని పతాక స్థాయిలో నిలిపాడు దర్శకుడు వేణు. ఇది ఇతని తొలి సినిమా. నిజానికి మేకింగ్ పరంగా చెప్పుకోదగ్గ స్థాయి చిత్రం కాదు. ఎలాంటి అంచనాలు కూడా లేవు. అయినా కంటెంట్‌కు తెలంగాణ ప్రాంతీయతనే కొత్తదనాన్ని తీసుకువచ్చింది. విజయం అందుకుంది. ‘రంగమార్తాండ’ నటీనటుల నటన వలన నిలబడింది.
జనం మెచ్చేవి.. తీయలేని స్థితిలో
ఏప్రిల్ లో 18 సినిమాలు వచ్చాయి. దర్శక నిర్మాతలకు చేదును రుచి చూపి కొన్ని పాఠాలు నేర్చుకో(?) మని చెప్పిన నేల ఇది. ఈ నెలలో విడుదలైన ‘విరూపాక్ష’ ఒక్కటే విజయాన్ని అందుకుంది. ఇది మొదట పాన్ ఇండియా సినిమా అన్నారు. తర్వాత ఒక్కొక్క భాషలోకి మెల్లగా అనువదించుకున్నారు. ‘న్యూ ట్రెండ్’ హారర్ చిత్రాలకు ఉన్న మార్కెట్ కూడా ప్లస్ అయిందని చెప్పాలి. రావణాసుర, మీటర్, శాకుంతలం, ఏజెంట్ చిత్రాలు పరాజయం కావడానికి ఇందులో చెప్పే అంశాలెన్నో ఉన్నాయి. ‘పొన్నియన్ సెల్వన్-2' మణిరత్నం దర్శకత్వం మెరుపులు విజయాన్ని అందలేక నీరసపడింది.
మే నెలలో 30 చిత్రాలలో రామబాణం, ఉగ్రం. కస్టడీ వంటివి నిరాశపరిచాయి. బిచ్చగాడు- 2 కాస్త పరవాలేదు అనిపించింది. జూన్ లో విడుదలైన ‘ఆది పురుష్’ గురించి అందరికీ తెలిసింది. ఈ నెలలో 35 చిత్రాలు విడుదలైనవి. ‘స్పై’ కూడా ఆశించినంత మేరా కలెక్షన్ రాబట్ట లేకపోయిందనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. మొత్తంగా ఆరు నెలల కాలంలో వచ్చిన 155 చిత్రాల్లో కేవలం ఓ పది మాత్రమే ప్రేక్షకులను మెప్పులందుకొని చిత్ర పరిశ్రమకు 'అసలు వారికిమి' కావాలో తెలుసుకోలేని అయోమయంలో నిర్మాత దర్శకులు ఉండిపోయారు. చేతులు కాల్చుకున్నారు. సినిమా‘నిర్మాణం’ అనేది సముద్ర ప్రయాణం వంటిది. సంపూర్ణమైన అవగాహనతోనే ఈదాలి. లేకుంటే తిమింగలాలు. వంటి మనుషులు నిలువునా నమిలేస్తారు. అనుభవజ్ఞులు కూడా దారుణమైన దెబ్బలు తిన్న సన్నివేశాలు ఇక్కడ ఉంటాయని ముళ్ళపూడి వారి సీరియస్ వ్యాఖ్యానం. 'జనం మెచ్చింది మనం యాల'ని పాతాళ భైరవిలో నేపాలీ మాంత్రికుడన్నది నిజమే అయినా.... అసలు జనం (ప్రేక్షకులు) ఏది మెచ్చుకుంటారో ఎలా తెలుసుకోవచ్చునని దర్శక, నిర్మాత, కథకులు తీవ్రంగానే చర్చించుకోవాలి. లేకుంటే కోట్లు ఆవిరైపోతాయి.
-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395