బిజినెస్ లైన్ :సౌకర్యాలున్న ఇండ్ల మీదనే గురి
గ్రేటర్ హైదరాబాదులో ఎక్కడ చూసినా ఇళ్లు, ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, భూముల కొనుగోళ్లు జరుగుతున్నాయి.
కొన్ని వెంచర్లలో 24 గంటల పాటు సెక్యూరిటీ ఉంటుంది. ఉద్యోగ ఒత్తిడి నుంచి సాంత్వన పొందే విధంగా ఇల్లుండాలని ఆశిస్తున్నారు కొనుగోలుదారులు. చుట్టూ పచ్చదనం, విశాలమైన ప్రదేశం, మంచి పార్కింగ్ వసతులున్న వెంచర్లు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. కొంతమంది చక్కని డిజైన్లు, ఆకర్షణ గల విల్లాలు, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తుంటే మరి కొందరు అందం, ఆకర్షణ ఉట్టిపడే అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రాపర్టీ విలువలో 85 శాతం వరకూ బ్యాంకులు రుణం ఇస్తుండడంతో డబ్బులు ఎక్కువైనా ఫర్వాలేదు, అన్ని సౌకర్యాలు ఉన్న ఇండ్ల కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు.
గ్రేటర్ హైదరాబాదులో ఎక్కడ చూసినా ఇళ్లు, ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, భూముల కొనుగోళ్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు సరిహద్దు దాటి 50 కి.మీ దూరం వరకూ స్థిరాస్తి వ్యాపార సంస్థలు వెంచర్లు వేస్తున్నాయి. నగరానికి సుమారు 50 కి.మీ వ్యాసార్థం వరకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధి విస్తరించింది. ఆ తరువాత దూరంలో ఉంటే ప్రాంతాలు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) విభాగం పరిధిలో ఉంటున్నాయి. ఆయా విభాగాలలోని వెంచర్లు ఏవైనా హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు పొంది తీరాల్సిందే. ఆయా ప్రభుత్వ విభాగాల అనుమతులు పొందిన తర్వాత మాత్రమే లేఅవుట్లు అభివృద్ధి చేయాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.
క్రమబద్దీకరించుకోవాల్సిందే
ఇంతకుముందు సిటీకి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాలలో గ్రామ పంచాయతీల నుంచి అనుమతులు పొందితే సరిపోయేది. ఇప్పుడు ఎక్కడా గ్రామ పంచాయతీ అనుమతితో వెంచర్లు చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా వ్యాపారులు అలాంటి వెంచర్లు ఏర్పాటు చేసినా అవి అక్రమ లేఅవుట్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తోంది. ఎప్పటికైనా వాటిని మళ్లీ క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఎప్పటికైనా క్రమబద్ధీకరణ ఫీజు కింద అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఇళ్ల నిర్మాణానికైనా, ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం సమయంలోనైనా బ్యాంకు రుణాలకు కూడా హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు తప్పనిసరి. ఇలాంటి వెంచర్లకే బ్యాంకులు అక్కడి మార్కెట్ విలువ ప్రకారం రుణాలను మంజూరు చేస్తాయి.
హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులున్న లే అవుట్లలో డెవలపర్లు తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్, పార్కులు నిర్మించాల్సిందే. ఇలాంటి ఏర్పాట్లన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్నప్పుడే ఆయా లే అవుట్లకు తుది సంభందిత ప్రభుత్వ శాఖలు అనుమతులు మంజూరు చేస్తాయి. స్థిరాస్తి వెంచర్లలో డెవలపర్లు ఆధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ అమ్మకాలు పెంచుకుంటున్నారు. 33 అడుగుల రోడ్లు, అందమైన ఆర్కిటెక్చర్ డిజైన్లకు ప్రాధాన్యం ఇస్తూ వెలుస్తున్న ఈ వెంచర్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థలం ఎంపిక నుంచి లే అవుట్ డిజైన్, మౌలిక వసతుల రూపకల్పన, పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వెంచర్లను అభివృద్ధి చేస్తున్నారు.
ఒత్తిడి నుంచి సాంత్వన పొందేలా
పట్టణ శివారు ప్రాంతాలలో కాలుష్యానికి చెక్ పెడుతూ సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. విశాలమైన రోడ్లపై ఇరువైపులా పచ్చని మొక్కలు పెంచడం, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవడం కూడా రియల్ కంపెనీలే చేపడుతున్నాయి. ప్లాట్లను అమ్ముకొని బయటపడి పోవాలన్న ఆలోచన చేయకుండా వెంచర్ల ఏర్పాటులో రక్షణకు కూడా కొన్ని సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. పచ్చని పార్కులు, అందమైన డిజైన్లతో కొనుగోలుదారులకు సౌకర్యాల కల్పనలో పోటీపడుతున్నాయి. 60, 40, 33 అడుగుల వెడల్పుండే చక్కని రహదారులను ఏర్పాటు చేస్తున్నారు.
కొన్ని సంస్థలు నిరంతర గస్తీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రహారీ గోడ మీద సౌర విద్యుత్ కంచెను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని వెంచర్లలో 24 గంటల పాటు సెక్యూరిటీ ఉంటుంది. ఉద్యోగ ఒత్తిడి నుంచి సాంత్వన పొందే విధంగా ఇల్లుండాలని ఆశిస్తున్నారు కొనుగోలుదారులు. చుట్టూ పచ్చదనం, విశాలమైన ప్రదేశం, మంచి పార్కింగ్ వసతులున్న వెంచర్లు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. కొంతమంది చక్కని డిజైన్లు, ఆకర్షణ గల విల్లాలు, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తుంటే మరి కొందరు అందం, ఆకర్షణ ఉట్టిపడే అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రాపర్టీ విలువలో 85 శాతం వరకూ బ్యాంకులు రుణం ఇస్తుండడంతో డబ్బులు ఎక్కువైనా ఫర్వాలేదు, అన్ని సౌకర్యాలు ఉన్న ఇండ్ల కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు.
శ్రీనివాస్ గౌడ్ ముద్దం
రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు
8125437565