మోడీది..ఎమర్జెన్సీని మించిన పాలన

Modi's rule is beyond emergency

Update: 2024-02-15 01:00 GMT

అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన తర్వాత బీజేపీ ఇప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయిలో అక్రమ చర్యలకు పాల్పడుతోంది. బీజేపీ ప్రకటించిన షెడ్యూల్‌‌ని ఎన్నికల కమిషన్‌ అమలు పరుస్తున్నది. మీడియా పార్టీ అదుపులోకి వెళ్ళిపోయింది. రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. సోషల్‌ మీడియాను నడిపే కంపెనీలన్నీ ప్రభుత్వ ఆదేశాలను అమలు పరుస్తూ వ్యతిరేక సమాచారాన్ని తొలగిస్తున్నాయి. కోర్టులలో మాత్రమే మినుకు మినుకు మంటున్న ప్రజాస్వామ్య దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఎమర్జెన్సీని మించిన భయంకరమైన వ్యవస్థ ఈరోజు భారతదేశంలో జీవం పోసుకొని వికృత రూపం దాల్చింది.

ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్‌ ఎన్నిక, భారతదేశంలో జరగబోతున్న లోక్‌‌సభ ఎన్నిక ప్రక్రియను, ఫలితాలను ప్రతిబింబిస్తున్నది. బహుశా దేశానికి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే చివరి ఎన్నికలు కావచ్చు. బీజేపీ ప్రజాస్వామ్య సూత్రాలను తుంగలో తొక్కి చండీగఢ్ మేయర్‌ ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి, అనిల్‌ మాసి ద్వారా ఇండియా కూటమికి చెందిన 8 మంది కౌన్సిలర్లను అప్రజాస్వామికంగా అనర్హులను చేసి, మైనారిటీలో ఉన్న బీజేపీకి చెందిన వ్యక్తిని మేయర్‌‌గా ప్రకటింప చేసుకున్నది. గతంలో ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ, మేయర్‌ స్థానాన్ని దక్కించుకోవడానికి బీజేపీ అనేక కుట్రలకు పాల్పడింది.

వ్యతిరేక వార్త వస్తే... డిలీట్

మోడీ ప్రభుత్వం వాస్తవాలను చూసి భయపడి సోషల్‌ మీడియా కంపెనీలపై ఒత్తిడి తెచ్చి వాస్తవాలను కప్పి పుచ్చుతుంది. ఇటీవల మైక్రాన్‌ అనే కంప్యూటర్‌ చిప్‌ తయారు చేసే కంపెనీ భారతదేశంలో 2.75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఒక ప్లాంట్‌‌ను గుజరాత్‌ రాష్ట్రంలో నెలకొల్పుతానని ప్రకటించింది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ కంపెనీ 825 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి మాత్రమే పెడుతుంది. మిగతా 1.925 బిలియన్‌ డాలర్లను భారత ప్రభుత్వం పెట్టుబడిగా పెడుతుంది. కానీ 100% యజమాన్య హక్కులు మైక్రోన్‌ కంపెనీకే చెందుతాయి. అంటే 30% పెట్టుబడి పెట్టిన మైక్రాన్‌ 100% యజమాన్యం హక్కులు పొందితే, 70% శాతంతో 16 వేల కోట్ల పెట్టుబడి పెట్టిన భారత పన్ను చెల్లింపుదారులకు యజమాని హక్కులు ఉండవు. ఇదే కంపెనీ తైవాన్‌‌లో 30 బిలియన్‌ డాలర్లతో మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లను నెలకొల్పితే, తైవాన్‌ ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెట్టుబడిగా లేదా రాయితీగా ఇవ్వలేదు. చైనాలో ఈ కంపెనీ 603 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ప్లాంట్లను నెలకొల్పితే చైనా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. సోషల్‌ మీడియాలో ఈ విషయంపై మెసేజ్‌‌లను తొలగిస్తున్నారు, చర్చను నిలిపివేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యన లక్షద్వీప్‌‌లో ఫోటోషూట్‌ చేసుకొని మాల్దీవ్స్‌ పర్యాటక రంగాన్ని దెబ్బతీసి, ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసినట్లుగా ప్రచారం చేసుకున్నారు. వాట్సప్‌ యూనివర్సిటీ దీన్ని భారతదేశ విజయంగా విస్తృత ప్రచారం చేసింది. ఎన్నికల ముందుగా ఇలాంటి చీప్ ట్రిక్స్‌ ప్రదర్శించడంలో మోదీ, వాటిని ప్రచారం చేయడంలో హిందూ తాలిబాన్లు చాలా సమన్వయంతో పని చేస్తుంటారు.

ఎన్నికల ప్రయోజనం కోసం..

ఈ అంశం లోతుల్లోకి చూస్తే.. మాల్దీవ్స్‌ మొత్తం జనాభా 521,021. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన ఓటర్లు 6 లక్షల 98 వేల మంది. ఓటరుగా అర్హత లేని వారిని కలుపుకుంటే జనాభా రెండు రెట్లు అవుతుంది. తెలంగాణలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన ఓటర్ల మొత్తం కంటే ఆ దేశ జనాభా తక్కువ.

మాల్దీవ్స్‌ జీడీపీ 1.72 బిలియన్ అమెరికన్ డాలర్లు. హైదరాబాదు లోని రెడ్డి ల్యాబ్స్‌ వార్షిక ఆదాయం 2.99 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్న ఆర్థిక శక్తికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఎన్నికల ప్రయోజనం నిమిత్తం ఇంత పెద్ద డ్రామా ఆడవలసిన అవసరం ఉన్నదా దేశంలోని టీవీ చానల్స్‌ సోషల్‌ మీడియా, వార్త పత్రికలు అన్ని కలిసి మాల్టీవులను ఒక బలమైన శత్రుదేశంగా చిత్రీకరించి, ఇస్లాం మతబూచిని చూయించి, ఆ దేశం మెడలు వంచినట్లుగా ప్రకటించుకుని, స్వయం సంతృప్తి పొందడం ఎంతవరకు సబబు గత సంవత్సరం భారత, రష్యా పర్యాటకులు సమాన సంఖ్యలో, సుమారు రెండు లక్షల మంది మాల్దీవ్స్‌‌ను సందర్శించారు. మోదీ భజన బృందం ఎంతగా గొంతు చించుకున్నా ట్రావెల్‌ ట్రెడ్‌ జర్నల్‌ ప్రకారం ఈ సంవత్సరం జనవరి నెల చివరి వరకు 16,536 భారత పర్యాటకులు ఆ దేశాన్ని సందర్శించారు.

మన భూభాగాన్ని ఆక్రమిస్తే మౌనం

గమనించవలసిన విషయం ఏమిటంటే భారత పర్యాటకుల సంఖ్య ఎంతవరకు తగ్గుతుంది ఆ తగ్గిన సంఖ్య ఎంతవరకు మాల్దీవ్స్‌ ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తుంది ఇంకా 11 నెలలు వేచి చూస్తే తప్ప మోదీ ప్రచార ప్రభావం తెలియదు. పక్కనే ఉన్న నేపాల్‌ భారతదేశ భూభాగాన్ని తన దేశంలో కలుపుకున్నట్లుగా మ్యాపులు ప్రచురిస్తే మోదీ గొంతు పెగలలేదు. భారతదేశానికి చెందిన ఐదు వేల చదరపు మైళ్ల భూమిని చైనా ఆక్రమించుకొని శాశ్వత కట్టడాలను కడితే కనీసం ఆ చర్యను ఖండించడానికి కూడా ధైర్యం చేయని నాయకత్వం భారతదేశంలో ఉన్నది. చీమ పరిమాణంతో ఉన్న దేశంపై అనవసరమైన రచ్చ చేసి ఆనందించడం మోదీకి మాత్రమే సాధ్యం.

ప్రస్తుతం భారతదేశానికి దక్షిణాసియాలో ఒక్క మిత్ర దేశం కూడా లేదు. బంగ్లాదేశ్‌ పార్లమెంటు, శ్రీలంక పార్లమెంటు ఆదానిపై మోదీ చూపించిన అమిత ప్రేమను, ఆయా దేశాలలో ఆదాని వ్యాపార విస్తరణకు ప్రభుత్వాలపై మోదీ తెచ్చిన ఒత్తిడి గురించి, అవినీతిని చాలా వివరంగా చర్చించాయి. పొరుగు దేశాలు మొట్ట మొదటిసారిగా భారత దేశ ప్రధానమంత్రి చేస్తున్న అవినీతి కార్యకలాపాల గురించి చర్చించడం విశేషం.

- మాధవరం నాగేందర్,

వాషింగ్టన్

+1 (301) 916-0303

Tags:    

Similar News