కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలు సత్యాలే!

Modi's comments on Congress are true!

Update: 2024-05-09 01:00 GMT

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల మానప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండదని, అక్రమ చొరబాటుదారులకు హిందువుల సంపదను దోచిపెడుతుందని, దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్. అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కోట్లకు పడగలెత్తారు. అనేక కుంభకోణాల్లో మునిగితేలారు. బొగ్గు కుంభకోణం, టెలికాం కుంభకోణం, ఆదర్శ బిల్డింగ్ సొసైటీ కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కుంభకోణాలు చేసి దేశ ప్రజల సంపదను కొల్లగొట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో హిందూ ముస్లింల మత ఘర్షణలు చెలరేగాయి. అన్ని మత ఘర్షణలకు కారకులు ముస్లింలే.. అయినప్పటికీ, ముస్లిం సంతుష్ఠీకరణలో భాగంగా హిందువులను దోషులుగా నిలబెట్టడంలో కాంగ్రెస్ నాయకులు ఆరితేరారు. కాశ్మీర్ లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమివేసినా, అనేకమంది హిందూ స్త్రీలు మానభంగాలకు గురైనా, జీహాదీలు చెలరేగిపోయి భద్రతా దళాలను మట్టుబెట్టినా నోరు మెదపని కాంగ్రెస్ నాయకుల మానసిక స్థితిని బాగా పసిగట్టిన నరేంద్ర మోడీ ఈ మాటలు అనడం వెనుక అంతర్యం ఇదేనని, ఈ దేశం నాది అనే భావన ఉన్న ప్రజలందరూ ఆయన మాటలను సరిగానే అర్థం చేసుకున్నారు.

రాజకీయ లబ్ది పొందేందుకే..

మోడీని నోరార తిట్టకపోతే కడుపు ఉబ్బరం తగ్గని మోడీ వ్యతిరేకులూ, వారి ద్వారా నడపబడే జాతి వ్యతిరేక మీడియా, ప్రపంచంలో భారతదేశం ఎదుగుదలను ఓర్చుకోలేని అంతర్జాతీయ సంస్థలూ, ఆయన వ్యాఖ్యలపై అవాకులు చవాకులు పేల్చుతూ.. దేశంలోని ముస్లిం ఓట్లను సంఘటితపర్చడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుల గణన, ఆర్థిక సర్వే వంటి కొత్త వాదనలు ఓటర్ల ముందుకు తెచ్చి రాజకీయ లబ్ధిని పొందాలని చేసిన ప్రయత్నాలకు ప్రధాని మోడీ మోకాలు ఒడ్డడంతో కాంగ్రెస్ నాయకులకు దిక్కుతోచడం లేదు. వాస్తవంగా 2006లో నాటి ప్రధానమంత్రి ‘మన్మోహన్ సింగ్’ ఈ దేశ వనరులపైన మొదటి హక్కు ముస్లింలది మాత్రమే అన్న మాటలు ఆయన మనసు నుండి వచ్చినవి కాదు. ముస్లింల ఓటును గుండుగుత్తగా పొందడానికి కాంగ్రెస్ నాయకులు ఆయన చేత అలా అనిపించారు. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఒక మత వర్గానికి దేశ వనరులపై మొదటి హక్కు ఉంటుందని ఎలా మాట్లాడగలరు? కాంగ్రెస్ నాయకుల పూర్వపు చరిత్రను పరిశీలిస్తే, హిందువుల అభిప్రాయాలకు విరుద్ధంగా దేశాన్ని మతం ఆధారంగా పంచి ఇచ్చారు. మత రాజ్యాలుగా మారిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన హిందువుల ఆర్తనాదాలను కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. పైగా ధన, మాన, ప్రాణాలను పణంగా పెట్టి, శరణార్థులుగా వచ్చిన హిందువులకు పౌరసత్వ హక్కులు ఇవ్వడానికి నిరాకరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మోడీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ నాయకులు ఎంత రాద్ధాంతం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. శరణార్థులు, అక్రమ చొరబాటుదారులు ఒకటేననే వాదనను తెరమీదకి తెస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.

హిందువులు గ్రహించలేకపోవడంతోనే..

అలాగే ప్రార్థన ఆలయాల పరిరక్షణ చట్టం పేరుతో 1991వక్ఫ్ బోర్డు అధికారాలకు కోరలను తెచ్చిపెట్టి, హిందువుల ఆస్తులకు భద్రత లేకుండా దుస్సాహసానికి ఒడిగట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, కాంగ్రెస్ నాయకుల అదృష్టం ఏమోగానీ హిందువుల పట్ల కాంగ్రెస్ నాయకులకు ఉండే పక్షపాతాన్ని సామాన్య హిందువులు గ్రహించలేకపోయారు. శ్రీరాముని చరిత్ర ఈ దేశంలోని హిందువులకు అతి పవిత్రమైంది. కానీ రామాయణం ఒక మిథ్య అంటూ సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి, హిందువుల పట్ల మహాపరాధం చేసింది. హిందుత్వ విలువలను దూషించే వారికి పరోక్షంగా మద్దతిచ్చింది. హిందూ దేవి దేవతలను నగ్నంగా చిత్రీకరించిన ముగ్దుల్ ఫిదా హుస్సేన్ చర్యలను బాహాటంగా కాంగ్రెస్ నాయకులు సమర్థించారు. ఇలాంటి చర్యల వల్ల హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే గొంతుక బీజేపీ మాత్రమేనని ఈ దేశంలోని చాలా మంది హిందూ ఓటర్లు నిర్ణయించుకోవడంతో 2014లో మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలు పట్టం కట్టారు. 2019లో అదే పని చేశారు. 2024 ఎన్నికలలో సైతం మోడీ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడతారనే విషయంలో ప్రపంచంలోని రాజకీయ విశ్లేషకులు అందరి అభిప్రాయం ఒకటిగానే ఉంది.

ముస్లింలు జాతీయవాదాన్ని నమ్ముతున్నారు!

అమెరికన్ వ్యాపార దిగ్గజం 'జాన్ చాంబర్స్' ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ లాంటి వ్యక్తి అమెరికా దేశానికి లభించి ఉంటే తను చాలా సంతోషించే వాడినని, భారతదేశ భవిష్యత్తుకు మోడీ మూడోసారి ప్రధాని కావడం చాలా అవసరమని చెప్పిన మాటలు ఈ దేశ హితైషులకు అమితానందాన్ని కలిగించగా, దేశ వ్యతిరేకులకు, మోడీ వ్యతిరేకులకు మిక్కిలి ఖేదాన్ని కలిగించిందనే చెప్పాలి. అందుకే మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపడితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తారని 'ఇండియా కూటమి'నాయకులు చేస్తున్న ఆరోపణలను ఈ దేశ ప్రజలు ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. ఇక కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్ గాంధీ ప్రేలాపనలకు రోజురోజుకు విలువ తగ్గుతూనే ఉంది. మరోవైపున మోడీ ప్రభుత్వం మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకం అనే వాదాన్ని ఈ దేశంలో చాలామంది ముస్లిం యువత తిరస్కరించి, బీజేపీ జాతీయవాద భావాలను అక్కున చేర్చుకుంటున్నారు. దేశానికి ఇది ఒక శుభ పరిణామం.

- ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Tags:    

Similar News