ప్రజాస్వామ్యంలో ఈ పోకడ సరికాదు!

Modi, this trend is not right in democracy!

Update: 2023-06-01 23:00 GMT

ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ మోదీ సర్కార్‌ పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రారంభించి ప్రధాని మోడీ నూతన పార్లమెంట్‌ను జాతికి అంకితం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు ముఖ్య కేంద్రంగా నిలిచే పార్లమెంట్‌ నూతన భవనం విషయంలో మోదీ సర్కార్‌ వ్యవహరిస్తున్న ఏకపక్ష ధోరణి వివాదాస్పదమైంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేకుండా చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించటంపై ఒక్కసారి పాలక పక్షం ఆత్మావలోకనం చేసుకోవాలి. పాలక పక్షం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, పార్లమెంటరీ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చిందనే చెప్పాలి. ‘ప్రతి ఏటా పార్లమెంట్‌ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో మొదలవుతాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ఓ భాగం. భారతదేశానికి అధిపతి రాష్ట్రపతి. పార్లమెంటు దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రెండు సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకలు. ఇవి రాజ్యాంగం నుంచి తమ అధికారాన్ని పొందుతున్నాయి. ఈ రాజ్యాంగ సంస్థలు తమ పవిత్రతను, గౌరవాన్ని ప్రభావితం చేసే ఏ సమస్యకైనా అతీతంగా ఉండాలి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వేడుకల కార్యక్రమంలో రాష్ట్రపతి లేకపోవడం మన రిపబ్లిక్ ధర్మాన్ని తగ్గించడమే

మేమెందుకు చేయొద్దు?

కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలను. 1975 అక్టోబర్ 24న పార్లమెంటు అనుబంధ భవనాన్ని ఆనాటి ప్రధాని ఇందిరా ప్రారంభించే సమయంలోనూ, రాజీవ్‌‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1987 ఆగస్టు 15న పార్లమెంట్ లైబ్రరీకి శంకుస్థాపన చేసే సమయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాధినేత ప్రారంభించినప్పుడు, ప్రతిపక్షాన్ని ఆహ్వానించలేదు. ఎన్డీయే ప్రభుత్వాధినేత ఇప్పుడు అదే పని ఎందుకు చేయకూడదు అనే పట్టుదల బీజేపీ సంకుచిత రాజకీయాలకు నిదర్శనం. కొత్త పార్లమెంట్‌ నిర్మాణం విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా బీజేపీ నిరంకుశంగా ముందుకు వెళ్లినా, విభేదాలను పక్కనపెట్టి ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ప్రతిపక్షాలు భావించినా రాష్ట్రపతిని పక్కకు పెట్టి, ప్రధాని మోదీ తానే పార్లమెంట్‌ను ప్రారంభిస్తుండటం ప్రతిపక్షాలకు ఆగ్రహాన్ని కలుగజేసింది. ఈ చర్య రాష్ట్రపతిని అవమానించడమే కాకుండా, నేరుగా మన దేశ ప్రజాస్వామ్యంపై జరిపిన దాడిగా ప్రతిపక్షాలు భావించాయి. ఇది రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్‌ను ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని పేర్కొన్నాయి. అందుకే కాంగ్రెస్‌, డీఎంకే, ఉద్ధవ్‌ వర్గం శివసేన, ఆప్‌, ఎస్పీ, సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్‌-మణి, విధుత్‌లాయి కచ్చి, ఆర్డీఎల్‌, టీఎంసీ, జనతాదళ్‌ (యు), ఎన్సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంఎల్‌, ఎన్‌సీ, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే, ఏఐఎంఐఎం. ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్‌పీపీ-మేఘాలయ, ఎన్డీపీపీ, సిక్కిం క్రాంతికారి, ఏఐడీఎంకే, ఏజేఎస్‌యూ, ఆర్‌పీఐ(అథవాలే), మిజో నేషనల్‌ ఫ్రంట్‌, తమిళ మానిల కాంగ్రెస్‌, పీఎంకే, అప్నాదళ్‌, ఏజీపీ, ఎన్డీయే కూటమిలో లేని పార్టీలు..లోక్‌జనశక్తి(పాశ్వాన్‌), బీజేడీ, బీఎస్పీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ. పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనాయి.

భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం, దేశ ప్రజల ఆత్మ. భారత ప్రజాస్వామ్యం శతాబ్దాల తరబడి పోగుపడిన అనుభవం ద్వారా రూపుదిద్దుకున్న ఒక వ్యవస్థ. అవసరాలకు అనుగుణంగా మారే ప్రయత్నానికి ఇది సమయం. నవీన భారతానికి నవశకానికి పార్లమెంటు కొత్త భవనం నిజమైన ప్రేరణ. అలాగే పాత సహజీవనానికి ఒక ఉదాహరణ. ప్రజాస్వామ్య ఆలోచన జ్ఞానం, అంటే సామూహిక స్పృహ అని రుగ్వేదం ప్రబోధిస్తుంది. మనమందరం పార్లమెంటు సభ ఉనికికి ఆధారం అయిన ప్రజాస్వామ్యాన్ని గుర్తుంచుకోవాలి మన ప్రతి నిర్ణయాలలో జాతీయ ఆసక్తి ప్రబలంగా ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడం చాలా ముఖ్యం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఈ పవిత్ర శాసనాలయంలో గణతంత్ర యంత్రలో ప్రతిష్టితమైనది రాజ్యాంగం. ఇక్కడ చేసిన శాసనాలు అమలయ్యేది రాష్ట్రపతి అమోదముద్రతోనే. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను అర్థం చేసుకోని పాలకపక్షం హుందాగా వ్యవహరించి అందరిని సంప్రదించి రాష్ట్రపతిని ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేసి వుంటే అప్పుడే ఆ లక్ష్యం పట్ల వారికి చిత్తశుద్ధి వుందని తెలియజేయటమే కాకుండా రాజ్యాంగ నిర్మాతకు నిజమైన గౌరవం నివాళి దక్కేది.

కొత్త పార్లమెంట్ భవనం అన్నీ హంగులతో, అధునాతన సాంకేతికతతో అలరాడే ఓ భవనం మాత్రమే కాదు. భవిష్యత్ భారతావని నిర్మాణానికి, ప్రజాస్వామ్య పటిష్టతకు భరోసానిస్తూ దేశ సమగ్రతను సమైక్యతను పరిరక్షిస్తూ స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం అన్న సూత్రాలని పాటిస్తూ సంక్షేమ అభివృద్ధి కోసం శాసనాలు చేసే పవిత్ర శాసనాలయం. నిర్ణయాత్మకమైన నిర్ణయాలు సకల జనుల అభీష్టం మేరకే కార్యాచరణ దాల్చుతాయి అన్న ప్రజాస్వామ్య సూత్రానికి బద్ధులమై ప్రతి ఒక్కరం మెలగాలి అన్న స్పూర్తిని ప్రజల్లోకి తీసుకుపోగలవు. గత పాలకులు చేసిన తప్పులను పదేపదే ప్రస్తావిస్తూ వాటికి చరమ గీతం పాడతాం అని డాంబికాలు పలికే నాయకులు అనుసరించిన, అనుసరిస్తున్న తీరును అత్మావలోకం చేసుకోవాలి. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమ తీరుని యావత్ దేశం నిశితంగా గమనించింది. అందరిని భాగస్వామ్యం చేస్తూ స్నేహపూర్వక వాతావరణంలో అధికార దర్పాన్ని మరచి అత్మీయతను పంచి ఓ జాతీయ పండుగగా దీనిని జరపాల్సిన తరుణంలో ఓ పార్టీకి చెందిన కార్యాలయ భవనం ప్రారంభోత్సవం మాదిరిగా యావత్ తతంగం నడిచింది. దీని పర్యవసాన ఫలితాలను అనుభవించటానికి మనందరం సిద్ధంగా ఉండాలి ఈ విషయంలో పాలక పక్షం తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమే.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Also Read: రాజ్‌భవన్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!

Tags:    

Similar News