కనీ వినీ ఎరుగని మోడీ మ్యాజిక్ షో!
కనీ వినీ ఎరుగని మోడీ మ్యాజిక్ షో!... Modi is showing the development of the country by magic
అద్భుతమైన మ్యాజిక్ షో జరుగుతుంది. జన సందోహంతో నగరమంతా కోలాహలంగా ఉంది. ఇంతలో ఓ ఇద్దరు వ్యక్తులను పట్టుకొని జనం చితక్కొడుతున్నారు వాళ్లను కొట్టండి కొట్టండి కేకలు వినిపిస్తున్నాయి. అలా కాదు చెంపల మీద కొట్టండి, వీపు పగలగొట్టండి, చేతులు విరిచేయండి అంటూ జనాలు తీవ్రమైన ఆవేశంతో రగిలిపోతున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని మ్యాజిక్ షో నిర్వాహకులు బేడి, షాలు ఆరా తీశారు తర్వాత వాళ్లకు అర్థమైన విషయం ఏమిటంటే అక్కడ జనం గుమిగూడి ఉండటంతో వాళ్లు జనాలు జేబులు కొట్టేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి దగ్గర నుండి వారు కొట్టేసిన 150 రూపాయలు తిరిగి రికవరీ చేశారు. ప్రజలంతా చైతన్యంతో ఉంటే ఎంతటి దొంగనైనా పట్టుకోవచ్చని బేడీ, షాలు జనాలకు ఉపదేశం చేసి దొంగలని తమ వేదిక మీదకు పిలిచి కూర్చోబెట్టారు. దొంగతనం చేసిన వారు దొరికితే పోలీసులు అప్పగించాలి తప్ప కొట్టి చంపితే ప్రజలు నేరస్తులు అవుతారని ప్రేక్షకులకు హితవు పలికారు. మీరంతా నేరస్తులు కాకూడదు అనే ఈ దొంగలను ఇక్కడికి పిలిచామని ప్రజలకు నచ్చచెప్పారు. ప్రేక్షకులు కూడా అది నిజమని నమ్మారు. ఇంకా పాత పద్ధతిలోనే ప్రజల జేబులో నుండి డబ్బులు కొట్టేయాలనుకుంటే ఇలానే కొడతారు.. కాలం మారుతుంది కదా కాలంతో పాటు మనము మారాలి అంటూ దొంగలకు బేడీ, షాలు జ్ఞానోదయం చేశారు. ఇంతలో జనాల నుండి షో మొదలు పెట్టండి లేట్ అవుతుంది అంటూ కేకలు మొదలయ్యాయి.
షా లేచి ప్రేక్షకులతో ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతం మీరు చూడబోతున్నారు. ఈ మ్యాజిక్ షో లో ప్రతి ప్రేక్షకుడి జేబులోకి 15 లక్షల రూపాయలు రాబోతున్నాయి ఇది నిజంగా అద్భుతం ఈ అద్భుతాన్ని చేయడానికి గుజరాత్ నుంచి ఓ అద్భుతమైన మ్యాజిక్ బృందం మీ ముందుకు వచ్చింది అంటూ షో ప్రారంభించారు షా. జనాలందరి జేబులోకి డబ్బులు వస్తున్నాయని ఆనందంలో మీరేం చెప్తే మేము చేసేస్తామనీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన మద్దతు మ్యాజిక్ బృందానికి లభించింది. అదిగో ఈ అద్భుతమైన వ్యక్తి బేడీ. బేడీ మాట్లాడుతూ ప్రియ సోదర సోదరీమణులారా, మా ప్రతినిధులు ఇద్దరు మీ దగ్గరకు వస్తారు వారి దగ్గరలో ఉన్న సంచుల్లో మీ జేబులో ఉన్న డబ్బులు వేయండి ఆ తర్వాత అద్భుతమైన మ్యాజిక్‌తో ప్రతి మనిషికి 15 లక్షలు అందించబడతాయి నన్ను నమ్మండి అంటూ వేదిక మీద ఉన్న దొంగల చేతికి రెండు పెద్ద సంచులు ఇచ్చి జనంలోకి పంపించారు. అద్భుతం సంచులు ఫుల్లుగా నిండాయి. ఆ డబ్బుల సంచులను ముందు వరసలో కూర్చున్న తన మనుషులు ముగ్గురికి ఇచ్చి చూశారా ఈ ముగ్గురు వ్యక్తులు కోటీశ్వరులయ్యారు. తర్వాత కోటీశ్వరులు అయ్యేది మీరే అంటూ మ్యాజిక్ మ్యాన్ బేడీ కూర్చునాడు. వెంటనే షా లేచి అద్భుతం అద్భుతం చప్పట్లు కొట్టండి అంటూ జనాలను ఉత్సాహపరిచారు. మధ్య మధ్యలో జేబు దొంగలు ఉంటారు జాగ్రత్త అంటూ ప్రకటన చేస్తున్నాడు. ఎవరైతే మనస్ఫూర్తిగా నాకు డబ్బులు వస్తాయని నమ్ముతారో వారికి మాత్రమే వస్తాయి మమ్మల్ని ఎవరైనా సందేహిస్తే వారి పక్క వారికి కూడా రావు ఇది నిజం అంటూ ప్రకటన చేస్తాడు షా .
మరో రౌండ్ ప్రారంభమైంది ఈసారి ప్రేక్షకుల వంటిపై ఉన్న ఆభరణాలు ఇవ్వాలి అని ఇలా ఆ షోలో పాల్గొన్న ప్రేక్షకుల నిలువు దోపిడీతో తమ వారైన వారందరినీ తన మ్యాజిక్‌తో ధనవంతులుగా మార్చారు బేడీ, షాలు. ఈసారి జరిగే మ్యాజిక్ షోలో ధనవంతులు మీరే అంటూ ప్రేక్షకుల వైపు చూపిస్తూ ఈ షో ఇంతటితో ముగిసింది అని చెప్తారు. ప్రేక్షకులంతా తమకు డబ్బు రాకపోవడానికి కారణం తమ పక్కవారే అని నమ్మి పరస్పరం తన్నులాడుకుంటారు . అప్పుడు పక్కన ఉన్న జేబు దొంగలకు అర్థమైంది అసలు విషయం. సరిగ్గా భారతదేశంలో ఇలాంటి మ్యాజిక్ షో నే ప్రస్తుతం జరుగుతోందని ఇటీవల ఆక్స్ఫార్మ్ విడుదల చేసిన రిపోర్ట్ తెలియజేస్తుంది.
మోడీ చెప్పిన మాట అందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తాం కానీ చేసిన పని 2020 సంవత్సరం తర్వాత స్థూల జాతీయోత్పత్తిలో 67% సంపద కేవలం ఒక్క శాతం చేతికి వెళ్ళింది. ఫలితంగా 2020లో భారతదేశంలో 102 మంది బిలీనియర్స్ ఉండగా 2022 నాటికి 166 మంది బిలీనియర్స్ అయ్యారు. భారతదేశంలో 2021 ఏప్రిల్ ఒక్క నెలలో 80 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను పేరుతో కడుపేదల నుండి 64 శాతం జీఎస్టీ పేరుతో వసూలు చేశారు ధనవంతుల నుండి కేవలం ఒక్క శాతం మాత్రమే వసూలు చేశారు. జీఎస్టీ నోట్ల రద్దు ద్రవ్యోల్బణం పెట్రోల్ డీజిల్ గ్యాస్ అధిక ధరలు ప్రజలను నిలువు దోపిడీ చేస్తే భారతదేశంలో నేటికీ 20 కోట్ల మంది ప్రజలు కనీసం ఒక్క పూట తినడానికి తిండి లేక బాధపడుతున్నారు బట్టలు ఆరోగ్యం నివాసాలు కనీస వసతులకు దూరంగా ప్రజలంతా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వీరి శ్రమను దోచుకోవడం భారీస్థాయిలో మొదలైంది.
ప్రజల రోజువారీ అవసరాల కోసం ఆర్థిక అసమానతలకు కారణాలు తెలుసుకొని తమ శ్రమకు తగ్గ ఫలితం కోసం దేశ సంపద రక్షణ కోసం ఇప్పటికే కార్మికులు, కర్షకులు, యువత దశలవారీగా విడివిడిగా ఉద్యమిస్తున్నారు అందరూ ఐక్యంగా పోరాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రస్తుతం భారతదేశ ఆర్థిక పరిణామాలు రాజకీయ పరిణామాల మార్పుకు కారణం కానున్నాయి.
మందా సైదులు
సామాజిక కార్యకర్త
9704874247