అమాస చంద్రులు మన మంత్రులు
శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ మూడూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. వీటిలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థకు నాయకత్వం
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన మంత్రిమండలికి అవసరమైనంతగా స్వేచ్ఛ ఉండాలి. ప్రజల సంక్షేమం కోసం, భద్రత కోసం సమష్టి బాధ్యతతో వ్యవహరించాల్సిన మంత్రివర్గమే ఉత్సవ విగ్రహాలుగా మారితే ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. వ్యక్తి పూజ పెరిగి రాజరిక వ్యవస్థ గా మారి ప్రజాస్వామ్యమే పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే విధంగా మంత్రలను ప్రోత్సహించాలి. ప్రజాస్వామ్య పరిపుష్టికి ఊపిరులూదుతూ అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వాధినేతలు ముందుకు వస్తారో లేదో కాలమే తేల్చి చెప్పాలి.
శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ మూడూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. వీటిలో శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థకు నాయకత్వం వహించే మంత్రిమండలి నిర్దిష్ట ప్రణాళికలతో పాలనకు వెన్నెముకగా ఉంటుంది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సంపూర్ణ సహకారం అందించే బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రిత్వ కూర్పు సందర్భంగా కులాలు, మతాలు, సామాజిక వర్గాలు, ఆర్థిక పరిపుష్టితో ఎన్నికలలో గెలవడానికి అవసరమైన ఓటు బ్యాంకు సమీకరణాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం అభిలషనీయమే.
అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే నైపుణ్యం, పాలనానుభవం, నిజాయితీ, సేవాతత్పరత గల శాసన సభ్యులనూ, శాసనమండలి సభ్యులనే మంత్రులుగా చేర్చుకోవడమూ సరైందని భావించాల్సిందే. మంత్రులుగా చేరినవారు తమకు సంక్రమించిన అధికారాలతో రాష్ట్రంలో విరివిగా పర్యటించాలి. శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. మంత్రిమండలిలో చర్చించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. కానీ, మెజారిటీ మంత్రులు దానికి భిన్నంగా తమ నియోజకవర్గ ప్రతినిధులుగా మాత్రమే కొనసాగుతున్నారు. తమ సీట్లకు మాత్రమే పరిమితమవుతూ, ప్రత్యర్థులపై విమర్శల కోసమే అధిక సమయం వెచ్చించి ప్రజా సమస్యలను గాలికొలేస్తున్నారని ప్రజాస్వామికవాదుల అభిప్రాయంగా ఉంది.
పనిభారం తగ్గుతుంది కదా!
నిజానికి కేబినెట్ హోదా ఉన్న ఇద్దరు ముగ్గురు మంత్రులు మినహా మెజారిటీ మంత్రులు తాము మంత్రులమనే విషయాన్ని మరిచిపోతున్నారు. వారి శాఖలకు సంబంధించిన సమస్యల పట్ల ఆశించిన చొరవ తీసుకోలేకపోవడమే కాక, అన్నింటినీ ప్రభుత్వాధినేతయే పరిష్కరిస్తారని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఇది మంత్రులుగా వారి పాత్రను ప్రాధాన్యతను తగ్గించుకోవడమే కాకుండా, ప్రభుత్వాధినేత నియంతగా వ్యవహరిస్తున్నాడనే అనుమానం ప్రజలలో కలిగించడం, ప్రజాస్వామ్య ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఓ దశాబ్దం క్రితం మంత్రులు స్వతంత్ర ప్రతిపత్తితో తమకు అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించేవారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేవారు. ఫలితంగా పాలనలో వికేంద్రీకరణ జరిగి పని భారం తగ్గి ప్రభుత్వాధినేత సైతం మరింత సమర్థవంతంగా, ప్రజారంజకంగా తమ పాలనను కొనసాగించే వెసులుబాటు కలిగేది.
అసలేం చేయాలి?
నేడు మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో అవి పరిష్కారం కావడం లేదు. ప్రజలకు మంత్రులెవరో తెలిసినా వారిని నేరుగా కలిసే సందర్భాలు కూడా తక్కువగానే ఉంటాయి. కారణాలేవైనా అధినేత నిర్ణయం కోసం వేచి ఉండటం వలన సమస్యల పరిష్కారం ఆశించినంత వేగంగా జరగడంలేదనేది వాస్తవం. రాష్ట్రంలో ప్రభుత్వాధినేత శాసనసభ్యులకు అందుబాటులోకి రావడం గగనంగా మారుతోందన్న పుకార్ల నేపథ్యంలో ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకునే వెసులుబాటు ఎక్కడిది? ఈ తరహా ధోరణులు రాజకీయ పార్టీలకు అపఖ్యాతిని ఆపాదించేవే.
ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలెంతగా సమర్థులైనా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన మంత్రిమండలికి అవసరమైనంతగా స్వేచ్ఛ ఉండాలి. ప్రజల సంక్షేమం కోసం, భద్రత కోసం సమష్టి బాధ్యతతో వ్యవహరించాల్సిన మంత్రివర్గమే ఉత్సవ విగ్రహాలుగా మారితే ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. వ్యక్తి పూజ పెరిగి రాజరిక వ్యవస్థగా మారి ప్రజాస్వామ్యమే పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే విధంగా మంత్రులను ప్రోత్సహించాలి. ప్రజాస్వామ్య పరిపుష్టికి ఊపిరులూదుతూ అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వాధినేతలు ముందుకు వస్తారో లేదో కాలమే తేల్చి చెప్పాలి.
నీలం సంపత్
సామాజిక కార్యకర్త
98667 67471