వాస్తవ జాతి నిర్మాతలు

Migrant workers are the real GDP generators

Update: 2023-12-06 23:30 GMT

మనం రోజూ అనేక సందర్భాల్లో సినిమా నటులను, సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను తరచూ గౌరవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు వారు చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డులు ప్రదానం చేస్తూ ఉంటారు. కానీ ప్రజలకు, దేశ అవసరాలకు అనుగుణంగా నిర్మించే వివిధ టన్నెల్స్, బ్రిడ్జీలు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, అందమైన భవనాలు, పెద్ద పెద్ద కంపెనీలు, విగ్రహాలు వంటి నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించేది వలస కార్మికులే. వీరిని గుర్తించేది ఎవరు?

దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి సగటున 35 నుంచి 40 శాతం మంది ప్రజలు వివిధ ప్రాంతాలకు వలస వెళుతూ వివిధ నిర్మాణాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం. ఆ ప్రభుత్వాలు ఉచితాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, ఉపాధి అవకాశాలు మెరుగు పరచకపోవడమే... దీంతో పొట్ట చేత పట్టుకుని, కుటుంబ సభ్యులను వదిలి ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల మంది దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, కేరళ, న్యూఢిల్లీ, బెంగళూరు చెన్నై, పంజాబ్, హైదరాబాద్ వంటి రాష్ట్రాలకు, నగరాలకు వలస వెళుతున్నారు.‌ ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఈ వలసలు ఎక్కువగా ఉంటున్నాయి అని తెలుస్తోంది.‌ కొన్ని సందర్భాల్లో వలస కార్మికులు ప్రయాణ సమయంలోనే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది...ఎంత బాధాకరం.‌ వీరి కుటుంబాలకు రక్షణ, భద్రత ఏది?

వారి శ్రమతోనే దేశ నిర్మాణం

వలస కార్మికులతోటే దేశ ప్రగతి జరుగుతుంది. అద్భుతమైన కట్టడాలు ఆవిష్కరింప బడుతున్నాయి. మనదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతోంది.‌ గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, వివిధ జాతీయ రహదారులు, నూతన పార్లమెంట్ భవనం, తీగల వంతెనలు, సొరంగాలు, ఆనకట్టలు, బ్రిడ్జీలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, గ్రీన్ బిల్డింగ్స్, అద్దాల భవంతులు, స్టూడియోలు ఇలా అనేక నిర్మాణాల్లో వలస కార్మికులు పాత్ర చిరస్మరణీయం. కానీ ఈ వలస కార్మికులను కేవలం కూలీ వారిగా మాత్రమే యజమానులు, సంస్థలు, ప్రభుత్వాలు చూస్తున్నాయి.‌ వీరి భద్రతకు, వేతనాలకు సరైన చట్టాలు అమలు చేయడం లేదు. ముఖ్యంగా ప్రమాదం సంభవించినప్పుడు సరైన పరిహారం, కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడం లేదు. ఇంటర్ స్టేట్ మైగ్రేట్ వర్క్ మెన్ యాక్ట్ -1979లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం వలస కార్మికులకు నివాసం, సరైన వేతనాలు, ఆడ మగ తేడా లేకుండా సమాన వేతనాలు, పిల్లలకు విద్య వైద్యం వంటివి సమకూర్చాలి. కానీ ఇవి ఏవీ సక్రమంగా అమలు జరగడం లేదు.. కోవిడ్ కాలంలో 2020-21 సంవత్సర కాలంలో వలస కార్మికులు వెతలు, మన అందరికీ కన్నీళ్లు తెప్పించింది... నేటికీ మనం కళ్ళ ముందు కదలాడుతుంది.

వారి సేవలు కొనియాడదగినవి!

సిల్కయారా టన్నెల్ ఉత్తరకాశీలో సుమారు పదుల సంఖ్యలో వలస కార్మికులు చిక్కుకుపోయిన సంఘటన మన అందరిలో ఆందోళన కలిగించింది. వారందరూ క్షేమంగా బయటపడాలని దేశమంతా ఎదురుచూసింది.. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది వలస కార్మికుల భద్రత కోసం పదునైన చట్టాలు తయారు చేయాలి. వారి వేతనాల కోసం, కుటుంబ సభ్యుల విద్య వైద్యం కోసం, ఆర్థిక భరోసా కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. దేశ ప్రజలకు అవసరమయ్యే వివిధ నిర్మాణాలు, సౌకర్యాలు నిర్మించడంలో వలస కార్మికుల పాత్ర మరువలేనిది. నిజమైన జాతి సంపద నిర్మాతలుగా వీరిని గుర్తించాలి. గౌరవించాలి. భవన నిర్మాణాల్లో, వ్యవసాయ రంగంలో, ఇటుక బట్టిల్లో, ప్రమాదకరమైన పరిశ్రమల్లో వీరు అందిస్తున్న సేవలు మరువలేనివి. దేశ జాతీయ ఉత్పత్తిలో (జీడీపీ) వీరి పాత్ర ముఖ్యమైనదిగా అందరూ భావించాలి. శ్రీశ్రీ చెప్పినట్లు తాజ్ మహల్ సౌందర్యానికి కారకులైన శ్రామికులను మరువరాదు... అలాగే నేడు ఈ 21వ శతాబ్దంలో దేశానికి, ప్రజలకు అవసరమైన వివిధ నిర్మాణాలు, సౌకర్యాలు నిర్మించుటలో వలస కార్మికుల సేవలు సదా కొనియాడదగినవి. వారే నిజమైన జాతి నిర్మాతలు అని గ్రహించాలి. వారి భద్రత కోసం ఇకనైనా మంచి నిర్ణయాలు పాలకులు తీసుకుంటారు అని ఆశిద్దాం... ముఖ్యంగా ప్రతి రాష్ట్రం ఆయా రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడు మాత్రమే వలస కార్మికులు అనే మాట కనుమరుగు అవుతుంది.

ఐ.ప్రసాదరావు

63056 82733

Tags:    

Similar News