సంక్షోభం దిశగా మానసిక ఆరోగ్యం

సంక్షోభం దిశగా మానసిక ఆరోగ్యం... Mental health towards crisis

Update: 2022-12-03 18:45 GMT

క్లినిక్‌లు, దవాఖానాలు. పెద్ద ఆసుపత్రులు ప్రారంభించేందుకు గ్రాంట్లు, రాయితీలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలు, పరిశోధనలు, పబ్లిక్‌ హెల్త్‌ క్యాంపెయిన్‌లు అవసరం, వీటికి ప్రభుత్వాలు కూడ చేయూతనివ్వాలి. తమ చుట్టూ ఉన్నవారిలో కనిపించే మానసిక సమస్యలను మెజారిటీ గ్రామీణ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. నేటికీ మంత్రాలు, యంత్రాలు, చేతబడి, మనిషి, కోడి, దయ్యాలు, భూతాలు, దైవ శాపాలనే భ్రమలలో ఉంటున్నారు. శాస్త్రీయ అవగాహన లోపమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు శాస్త్రీయ దృక్పథంతో మరింత అవగాహన కల్పించిన్నప్పుడే మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

రోగ్యం అనేది ప్రాథమిక మానవ హక్కు. దేశ ఆర్థికాభివృద్ధికి, అంతర్గత స్థిరత్వానికి ముఖ్యమైనది. శారీరక ఆరోగ్యానికీ, మానసిక ఆరోగ్యానికీ సంబంధం ఉంది. అవి వేరు వేరు అంశాలు కానే కావు. ఒకటి మరొకదానిని కచ్ఛితంగా ప్రభావితం చేస్తుంది. మానవుని శ్రేయస్సు కోసం ఈ రెండూ స్థిరమైన స్థితిలో ఉండాలి. మనస్సును, శరీరాన్ని విడివిడిగా చూడటం, శారీరక ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వలన మానసిక సమస్యలను ఆహ్వానించినట్లవుతుంది. పేలవ మానసిక ఆరోగ్య పరిస్థితులు శారీరక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మానసిక ఆరోగ్య పరిస్థితుల కారణంగా దేశం భారీ ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నదని అంచనాలు చెబుతున్నాయి.

2017 నాటికి దేశంలోని మొత్తం జనాభాలో 14 శాతం కంటే ఎక్కువ మంది మానసిక రుగ్మతలతో బాధపడగా. నేడు 25 నుంచి 30 శాతం వరకు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో అతి వేగంగా చోటుచేసుకుంటున్న పలు మార్పులు ఎక్కువ మందిలో మానసిక సమస్యలకు దారితీస్తున్నాయని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నగరాలు భారీగా విస్తరిస్తుండడం, ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తుండడం, చాలామంది పల్లెలు, నగరాలను వీడి కొత్త నగరాలకు మారుతుండడం, అక్కడ అడ్జస్ట్ కాలేకపోవడం లాంటి వన్నీ ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఎదురవుతున్న అనేక ఇబ్బందులు మానసిక క్షోభకు దారి తీయొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

30 శాతానికి పైగా

'మన చుట్టూ ఉన్నవారిలో 25 నుంచి 30 శాతం మంది సాధారణ మానసిక సమస్యలతో బాధపడుతుంటారు, కానీ, ఆ విషయాన్ని వారు గుర్తించలేరు. కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, పాశ్చ్యాత్తీకరణ శరవేగంగా జరుగుతుండడం, కొత్త సాంకేతికతల ఆవిర్భావం కూడా ఒత్తిడి కారణం కావొచ్చు. భారత్‌లో 0.5 నుంచి 1.3 శాతం మంది చిన్నారులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. సకాలంలో వారికి వైద్యం అందకపోతే వారి మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిని బేఖాతర్ చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గర్భిణులలో సగటున పది శాతం, ప్రసవం తరువాత 13 శాతం బాలింతలు డిప్రెషన్‌ (పీపీడీ) కు గురవుతున్నారు.

వర్ధమాన దేశాలకు చెందిన 15 శాతం గర్భిణులు, ప్రసవం తరువాత 19.8 శాతం మంది బాలింతలు డిప్రెషన్‌కు లోనవుతున్నారు. టీనేజర్లు, యువతను డిప్రెషన్‌లోకి నెడుతున్న కారణాలలో సోషల్ మీడియా కూడా ఒకటి. సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, పోస్టులకు లైక్‌లు తక్కువగా రావడం, అసలు రాకపోవడం వంటి వాటితో తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆలోచనలతో భావోద్వేగానికి గురవుతున్నారు' అంటున్నారు తెలంగాణకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కేశవులు. ఆయన 25 సంవత్సరాలుగా వైద్యరంగంలో ఉన్నారు.

30 సెకండ్లకు ఒక ఆత్మహత్య

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి ఎనిమిది లక్షల మందికి పైగా, అంటే ప్రతి 30 సెకనులకు ఒకరు ఆత్మ బలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతీ నాలుగు ఆత్మహత్యలలో ఒకటి భారత్‌లోనే నమోదవుతోంది. ఇండియాను ఆత్మహత్యల కేంద్రంగా పిలుస్తున్నారు. ప్రపంచంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 15 నుంచి 29 యేండ్ల లోపు వారే ఎక్కువ కావడం, మహిళల కంటే పురుషులే అధికంగా ఉండడం, అందులో సింహభాగం వివాహతులే ఉండటం గమనించాల్సిన విషయం.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక 2022 ప్రకారం, 2021 భారతదేశంలో సగటున రోజూ 450 మంది, గంటకు 18.7 మంది, నిమిషానికి ముగ్గురు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక పురుషుల ఆత్మహత్యలలో సగటున రోజుకి 326 మంది, గంటకు 136 మంది, ప్రతి 4.4 నిమిషాలకు ఒకరుగా ఉంటున్నారు. మహిళలు మాత్రం సగటున రోజుకి 124 మంది, ప్రతి గంటకు 5.1 మంది, అనగా ప్రతి 12 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2021లో పురుషులు 1,18,979 మంది, మహిళలు సంఖ్య 45.260 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

అక్కడే ఆత్మహత్యలు ఎక్కువ

15 నుంచి 29 యేండ్ల వయస్కుల మరణాలలో ఆత్మహత్యలది రెండో స్థానమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా 80 శాతం ఆత్మహత్యలు అల్పాదాయ, మధ్యాదాయ దేశాలలోనే జరుగుతున్నాయి. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రభావం 135 మందిపై పడుతుంది. కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు, సహోద్యోగులపై ప్రభావం ఉంటుంది. ఒకసారి ఆత్మహత్యకు యత్నించినవారు మళ్లీ అలాంటి ప్రయత్నం చేసే ప్రమాదముంటుంది.

ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నవారిని గుర్తించి కొద్దిసేపు వారిని ఆ ఆలోచనల నుంచి దృష్టి మళ్లించగలిగితే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు. మానసిక రుగ్మతలు సాధారణంగా అసాధారణ ఆలోచనలు, ప్రవర్తనలు, అవగాహనలు, భావోద్వేగాలు, ఇతరులతో సంబంధాల కలయికతో ఉంటాయి. జన్యుపర కారణాలు, మెదడులోని రసాయనిక పదార్థాల అసమతుల్యత, మెదడుకు గాయాలు, ఇన్ఫెక్షన్లు, కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు, ప్రేమరాహిత్యం, అలవాట్లు, పిల్లల పెంపకంలో లోపాలు, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు, శారీరక సమస్యలతో మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

మానసిక వైద్య సిబ్బంది కొరత

దేశంలో మానసిక వైద్య నిపుణుల సేవలు అనుకున్నంతగా లేవు. అమెరికాలో సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు 60 వేల నుంచి 70 వేల మంది ఉండగా భారత్‌లో వారి సంఖ్య 9.500 వరకు మాత్రమే. కనీసంగా మరో పది వేల మంది కావాలి. సైకియాట్రీలో శిక్షణ ఎంబీబీఎస్ నుంచే మొదలుకావాలని వైద్యులు కోరుతున్నారు. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్ర మానసిక, శారీరక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు జాతీయ బడ్జెట్ కేటాయింపు యేటేటా భారీగా తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా మానసిక ఆరోగ్యానికి ఏ మాత్రము బడ్జెట్ లో కేటాయింపులు పెరగక పోవడం బాధాకరం. క్లినిక్‌లు, దవాఖానాలు.

పెద్ద ఆసుపత్రులు ప్రారంభించేందుకు గ్రాంట్లు, రాయితీలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలు, పరిశోధనలు, పబ్లిక్‌ హెల్త్‌ క్యాంపెయిన్‌లు అవసరం, వీటికి ప్రభుత్వాలు కూడ చేయూతనివ్వాలి. తమ చుట్టూ ఉన్నవారిలో కనిపించే మానసిక సమస్యలను మెజారిటీ గ్రామీణ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. నేటికీ మంత్రాలు, యంత్రాలు, చేతబడి, మనిషి, కోడి, దయ్యాలు, భూతాలు, దైవ శాపాలనే భ్రమలలో ఉంటున్నారు. శాస్త్రీయ అవగాహన లోపమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు శాస్త్రీయ దృక్పథంతో మరింత అవగాహన కల్పించిన్నప్పుడే మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


డా. బి. హర్షిణి కేశవులు ఎంబీబీఎస్ ( ఎండీ )

జూనియర్ రెసిడెంట్. ఫాదర్ ముల్లర్ మెడికల్ సైన్సెస్

మంగళూరు. కర్ణాటక 85010 6165

Tags:    

Similar News