మీడియా మొఘల్‌ అస్తమయం

ప్రముఖ పత్రికాధిపతి, తెలుగు భాష పట్ల అపారమైన అభిమానం, తెలుగు భాషలో సాంకేతిక పదాలను సృజించేందుకు నిఘంటువును

Update: 2024-06-09 00:30 GMT

ప్రముఖ పత్రికాధిపతి, తెలుగు భాష పట్ల అపారమైన అభిమానం, తెలుగు భాషలో సాంకేతిక పదాలను సృజించేందుకు నిఘంటువును తయారు చేయించి ప్రచారం చేయించిన వ్యక్తి, తెలుగునాట మీడియా మొఘల్‌ రామోజీరావు. ఈనాడు దినపత్రిక, విపుల, చతుర, సితార, అన్నదాత వంటి పత్రికలు పాఠకుల మనసుల్ని దోచుకున్నాయి. ఎవరేమన్నా, కాదన్నా ఈనాడు చదవనిదే సరిగ్గా తెల్లవారదనిపించే తెలుగువారు కోకొల్లలు. ఈనాడు ఆదివారంలో కథ ప్రచురితం అయితే చాలు మనం రచయితలం అనే ధైర్యం వస్తుంది.

ఈటీవీ, ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో సంచలనం సృష్టించారు రామోజీరావు. తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాపై తనదైన ముద్ర వేశారు. వారి పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎందరో గాయనీ గాయకులు రూపొందారు. ఎందరో పాత్రికేయులు గానూ ఎదిగారు. ఎవ్వరూ పరిపూర్ణులు కారు. అయితే ఒక సిద్ధాంతాన్ని నమ్మి, పట్టుదలగా శ్రమించి, క్రమశిక్షణగా జీవితాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దుతున్నారు రామోజీరావు.

ప్రతి సినిమా ఓ సందేశం

తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించారు. ప్రియా పేరుతో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ సెగ్మెంట్‌లోనూ ఆయన అడుగులు వేశారు. అక్కడా విజయవంతం అయ్యారు. నిర్మాతగా టాలీవుడ్‌లో ఎన్నో మరపురాని సినిమాలను నిర్మించారు. తెలుగు, బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. సమాజాన్ని మేలుకొలిపేలా ఆయన సినిమాలు ఉంటాయనే గుర్తింపును పొందారు. ఆయన బ్యానర్ నుంచి మయూరి, ప్రతిఘటన, మౌనపోరాటం వంటి ఎన్నో సందేశాత్మక సినిమాలు వెలువడ్డాయి. వారిని స్మరించుకుంటూ, వారి ఆత్మకు ఊర్ధ్వ గతులు కలగాలని కోరుకుంటూ రంజని వినమ్ర నివాళి.

పద్మావతి జయరం నందిరాజు

రంజని తెలుగు సాహితీ సమితి

94929 21383

Tags:    

Similar News