భగత్‌సింగ్.. ఊహకు అందని సముద్ర గర్భం

Martry Day 2024: Bhagat Singh.. Unimaginable sea womb

Update: 2024-03-23 01:15 GMT

ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలో అయినా వ్యక్తులుగా, జాతులుగా అభివృద్ధి చెందిన వారి విజయ రహస్యం మార్పుని అంగీకరించడం, మార్పుని ఆహ్వానించడం, మార్పుని కోరుకోవడం... అదే భగత్‌సింగ్‌ నిర్వచనంలో విప్లవం అంటే. వందలాది ఇంగ్లీషు, తెలుగు అనువాద పుస్తకాలు తిరగేసి, గూగుల్లో శోధించి అన్నీ కలబోసి గొప్ప గొప్ప మోటివేషనల్‌ స్పీకర్స్‌ చేప్పేది కూడా ఇదే. అయితే అలాంటి సదుపాయాలు ఏ మాత్రం లేని రోజుల్లో అజ్ఞాతంలో గడుపుతూ, నిత్యం మరణంతో సహజీవనం చేస్తూ ఇంతటి గొప్ప విషయం చెప్పే నాటికి భగత్‌సింగ్‌ వయస్సు కేవలం 22 సంవత్సరాలు.

ప్రస్తుతం దేశానికి ఉన్న ప్రధాన సానుకూల అంశం యువ జనాభా. ప్రపంచం మొత్తం మీద యువత ఎక్కువగా ఉన్నది భారతదేశంలోనే. అయితే సంఖ్యాపరంగా యువత ఎక్కువగా ఉన్నంత మాత్రాన యువభారత్‌ అయిపోతుందా! యువత ఆలోచనలు, ఆశయాలు, అభిప్రాయాలు ఇవి కదా ముఖ్యం. వాటి ప్రాతిపదికన యువశక్తి, ఏ మేరకు దేశ అభ్యున్నతికి తోడ్పాటునందించగలదో తెలుస్తుంది. ఆధునికత అంటే బ్రాండెడ్‌ బట్టలేసుకోవడం, ఆధ్యాత్మికత అంటే బిలియనీర్లయిన స్వాముల ప్రవచనాలు వినడం అనుకునే యువత భగత్‌సింగ్‌ గురించి తెలుసుకోవడం కనీస బాధ్యతగా భావించాలి.

భగత్‌సింగ్ అనగానే ఆవేశం కాదు..

భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు అనే మిత్ర త్రయం ఈ దేశం కోసం ప్రాణాలర్పించి విప్లవ వీరులుగా దేశం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మార్చి 23 అమరవీరుల దినోత్సవమయింది. 24 ఏళ్ళ వయస్సుకే ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన భగత్‌సింగ్‌ అంటే ఆవేశపరుడు అన్న ముద్ర కూడా పడిపోయింది. ఆ ముద్రను దాటి ఆవలి వైపు చూసి అర్థం చేసుకునే ప్రయత్నం ఎందుకో ఈ దేశం చేసినట్లు అనిపించదు. భగత్‌సింగ్‌ అనగానే హింస, ఆవేశం మాత్రమే గుర్తుకు వస్తున్నాయంటే దేశానికి ఓ మేధావిని గుర్తించేంత జ్ఞానం లేదనే అనుకోవాలి. అతడో అభ్యుదయవాది, సామ్యవాది, ప్రపంచ పోకడలను, పలు దేశాల్లో నడిచిన ఉద్యమాల తీరుతెన్నులను, వాటి విజయాలను, వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషించిన జ్ఞాని. సముద్రం ఒడ్డున నిలబడి చూస్తుంటే కనబడే ఎగసిపడుతున్న కెరటాలు భగత్‌సింగ్‌ ఆవేశం అయితే సామాన్య మానవుడి ఊహకు అందని సముద్ర గర్భం భగత్‌సింగ్‌ అంతరంగం, భావజాలం. అవేంటో ఓసారి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అవి ఇప్పుడు మనకు చాలా అవసరం.

గతం నుంచి మంచినే స్వీకరిద్దాం

ప్రగతిని కోరే ప్రతి మనిషీ తన బుద్ధితో ఆలోచించగలగాలి. మూఢనమ్మకాలు వీడి గుడ్డి నమ్మకాలను సవాల్‌ చేయాలి. పరిశీలన ద్వారా ఎందులోనైనా వాస్తవం కనిపిస్తే అది సిద్ధాంతమైనా, మతమైనా అనుసరిస్తే ఆహ్వానించదగిందే. గుడ్డి నమ్మకాలు బుద్ధిహీనతకు తద్వారా అభివృద్ధి నిరోధకతకు దారితీస్తాయి. పురాతన భావాల్లోని అంధత్వం తొలగించి నూతన భావాలను ప్రవేశపెట్టాలి. గతం నుంచి, మత విశ్వాసాల నుంచి మంచి స్వీకరించి ప్రగతికి వాడుకోవాలని ఈ అంశంపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని భగత్‌సింగ్‌ పేర్కొన్నారు. నాటి పెద్దలు వందేమాతరం నినాదంతో స్వతంత్రం కోసం నినదిస్తున్న సమయంలో ఇంక్విలాల్‌ జిందాబాద్‌ అనే గర్జనతో దేశ యువతను మేల్కొలిపిన వాడు భగత్‌సింగ్‌. స్వతంత్రం మనం ఎలాగైనా సాధించుకోగలం. అంతకంటే ముఖ్యమైనది స్వాతంత్రం సిద్ధించాక ఈ దేశం ఎలా ఉండాలి అనే ప్రణాళిక. మనం ఆ దిశగా ఆలోచించాలనీ, సోషలిస్టు రాజ్యస్థాపనే మన లక్ష్యం కావాలనీ 21 సం॥ల వయస్సులో హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ అసోసియేషన్‌ సంస్థను స్థాపించాడు.

విప్లవం అంటే...

విప్లవం అనే మాట వింటే కొందరికి వణుకు, ఇంకొందరికి బెరకు మరి కొందరికి మాత్రం అది శక్తినిచ్చి ఇంధనం అయితే అసలు విప్లవానికి ప్రతికాలానికీ అన్వయించుకునేలా భగత్‌సింగ్‌ నిర్వచనం చేశాడు. తన దృష్టిలో ‘‘విప్లవం అంటే కేవలం సాయుధ పోరాటం, బాంబులు విసరడం, తుపాకులు పేల్చడం మాత్రమే కాదు, అన్ని తిరుగుబాట్లు విప్లవం కావు ఇక్కడ విప్లవం అనే మాట మరింత మెరుగైన స్థితికోసం మార్పు సాధించడం అనే అర్థంలో చూడాలి. స్వతహాగా మనుషులు ఒకే తరహా జీవితానికి అలవాటుపడి దానికే పరిమితమై ఉంటారు. దానిలో మార్పు జరిగితే కంపించిపోతారు. సరిగ్గా ఈ బద్ధకపు భావన స్థానే ఒక విప్లవ స్ఫూర్తి నింపవలసి ఉంటుంది. లేకుంటే శిథిలత పైచేయి సాధించి, అభివృద్ధి నిరోధక శక్తులు మానవాళిని భిన్నాభిన్నం చేస్తాయి. ఇది మానవ పురోగమనంలో ప్రతిష్టంభనకు కారణమవుతుంది. అందుకే విప్లవ భావన ఎల్లప్పుడూ మానవతలో తొణికిసలాడాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని మేము నినదిస్తున్నది’’ అని బదులిచ్చారు.

సామాన్యులకే అర్థం కావాలి

మెడలో ఎర్రటి కండువాలు వేసుకుని వేదికలపై ఊగిపోయే కమ్యూనిస్టు కురువృద్ధులకు ఇప్పుడు విప్లవం అంటే అర్థం తెలియకున్నా పెద్ద నష్టం కలగదు కానీ, తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే కష్ట,నష్టాల గురించి కలతచెందే సామాన్యులు మాత్రం తెలుసుకోవల్సిందే. 24 సంవత్సరాలకే ఉరికంబమెక్కిన భగత్‌సింగ్‌‌ను ఆయన మరణించిన 93 సంవత్సరాల తర్వాత కూడా చర్చించుకోవడం గురించి సంతోషించాలో లేక ఇన్నాళ్ళ తర్వాత కూడా అతడిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామని బాధపడాలో తెలియని స్థితిలో ఉన్నాం. విజయానికి, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోడానికీ, ఆలోచనల్లో ఉన్నతకూ విజయానికి మెట్లు, వ్యక్తిత్వ వికాసాలు చదవడం కంటే ఒక్క భగత్‌సింగ్‌ జీవితం గురించి తెలుసుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది.

(నేడు అమరవీరుల దినోత్సవం)

నరసింహ ప్రసాద్‌ గొర్రెపాటి

9440734501

Tags:    

Similar News