మహావీరుడి బోధనలే కావాలిప్పుడు..

అహింస, సత్యము అనే రెండు అస్త్రాలను దేశానికి అందించినది జైనమతం. వీటిని మహావీరుడు దేశమంతా వ్యాపింపజేశారు. దీనితో ఇతర మతాలవారు

Update: 2024-04-21 00:45 GMT

అహింస, సత్యము అనే రెండు అస్త్రాలను దేశానికి అందించినది జైనమతం. వీటిని మహావీరుడు దేశమంతా వ్యాపింపజేశారు. దీనితో ఇతర మతాలవారు వాళ్ళమతాలలో చోటివ్వక తప్పలేదు. ఆధునిక కాలంలో సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకొని జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించిపెట్టారు. దీంతో మరోసారి వాటి ప్రత్యేకతలు రుజువైనాయి. ఇలా రెండువేల ఐదు వందల సంవత్సరాల కిందే వ్యక్తిత్వ వికాసం, సమాజ హితాన్ని కోరుతూ లోక కళ్యాణాన్ని కాంక్షించి మహావీరుడు చేసిన బోధనలు నేటి సమాజానికి అత్యంత అవసరం. ప్రతి ఒక్కరికి ఆచరణీయం

అవసరానికి మించి ఆస్తిపాస్తులు కలిగి ఉండడం అసమానత్వానికి దారితీస్తుందని గమనించి ప్రపంచంలోనే తొలిసారి సామ్యవాదానికి బీజాలను వేసింది మహావీరుడే. అలాగే ఆస్తివల్లే నూతన వర్గాలు ఏర్పడుతాయని అవి పరస్పరం సంఘర్షించుకొని సమాజ అస్థిరతకు కారణమౌతాయని వివరించారు. ఆస్తి ఆశతోనే అస్తేయానికి (దొంగతనం) కూడా వెనకడుగు వేయరని చెప్పారు. ఈనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతికి కారణం అపరిగ్రాహం, అస్తేయమేనని ఎప్పుడో మహావీరుడు ఉద్ఘాటించాడు. మహావీరుడు భగవంతుడి విషయంలో మౌనాన్ని ఆశ్రయించారు. సృష్టి ఆవిర్భావ సిద్ధాంతంలో ఆధునిక విజ్ఞానానికి ఏ మాత్రం తగ్గకుండా అది పరిణామక్రమ ఫలితమేనని స్పష్టపరిచారు. మహావీరుడు ప్రబోధించిన పంచవ్రతాలు, త్రిరత్నాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.

సౌఖ్యాల పట్ల అనాసక్తిని పెంచుకుని..

ఏ నది కాదొక స్థిరబిందువు, అనేక బిందువుల అంత సింధువు. అదే రీతిన భారతీయ సంస్కృతి భిన్నమత సిద్ధాంతాల, నమ్మకాల, విశ్వాసాల సమ్మేళితం. మన సంస్కృతి ఒక ప్రాంతానికో, మతానికో చెందింది కాదు. ప్రతి ప్రాంతంలోనూ, మతంలోనూ అంతర్లీనంగా విభిన్న సంస్కృతుల మేళవింపులు కనబడతాయి. వేలాది సంవత్సరాల ఈ సాంస్కృతిక ప్రవాహంలో ప్రతి మతం ఏదో ఒక కాలంలో ఉజ్జ్వలంగా ప్రజ్జ్వరిల్లినదే. అలాంటి వాటిలో జైనమతం ఒకటి. వృషభనాథుడు లేదా ఆదినాథుడు ఈ మత స్థాపకులు. చారిత్రకంగా 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడిని జైనమత స్థాపకుడిగా చెబుతారు. అసలు తీర్థంకరుడు అంటే జీవనప్రవాహమును దాటించువాడు అని అర్థం. మొత్తం 24 మంది తీర్థంకరులు కలరు. అందులో చివరివారు వర్థమాన మహావీరుడు.

మహావీరుడి అసలు పేరు వర్ధమానుడు. సా.శ.పూ.540 లో నేటి బీహార్ రాష్ట్రంలోని ముజుపూర్ జిల్లాలోని కుంద(బసుకుంది)గ్రామంలో క్షత్రియ కుటుంబంలో జన్మించారు. తండ్రి సిద్ధార్థుడు. తల్లి త్రిశాల లిచ్ఛవి రాకుమార్తె. సిద్దార్థుడికి యుక్తవయస్సు రాగానే యశోద అనే రాకుమారితో వివాహం జరిపించారు. ఈ దంపతులకు అణోజ్ఞి(ప్రియదర్శి)అనే ఏకైక పుత్రిక కలిగింది. తల్లిదండ్రుల మరణం వర్థమానుడిని ఎంతగానో కలచివేసింది. దానితో ఆయన ఇహపర సౌఖ్యాలపట్ల అనాసక్తిని పెంచుకున్నాడు.

పార్శ్యనాథుడి సిద్ధాంతాలను వివరిస్తూ..

అన్న నందివర్ధనుడి అనుమతితో ఇల్లు వదిలి ముప్పైవ ఏట సన్యాసంను స్వీకరించాడు. తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన జైనమత సిద్ధాంతాలను పాటిస్తూ పదమూడు సంవత్సరాలు కఠిన తపస్సు ఆచరించాడు. చివరికి రిజుపాలికా నదీ ఒడ్డున జృంబిక గ్రామసమీపంలో సాలవృక్షం కింద నలభై మూడవ ఏట జినత్వమును పొందాడు. జిన అనగా జయించినవాడు. మహాధైర్యంతో కఠిన ఉపవాసాలతో, జ్ఞానాన్ని అన్వేషించడం వలన ఇతడిని మహావీరుడని‌. ఇంద్రియాలను జయించి బంధాలను వీడటం వల్ల నిర్గ్రందుడని పిలుస్తారు. కైవల్యం సిద్ధించిన పిదప ముప్పై సంవత్సరాలు దేశమంతా తిరుగుతూ జైన మతంను దశదిశలా వ్యాప్తిజేశాడు. చివరికి తన డెబ్బై రెండవ ఏట సా.శ.పూ.468లో పావాపురిలో నిర్యాణం పొందారు.

మహావీరుడు తనకంటే ముందు తీర్థాంకరుడైన పార్శ్వనాథుడి నాలుగు సిద్ధాంతాలకు అదనంగా బ్రహ్మచర్యం జోడించి విస్తృత ప్రచారంగావించారు. వాటినే పంచవ్రతాలుగా పిలుస్తారు. అవి అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. అహింస అనగా మనోవాక్కాయ కర్మలచే సృష్టిలోని ఏ జీవిని హింసించకుండా ఉండటం. రెండవది సత్యమునే ఎల్లప్పుడూ పలకాలి. అసత్యమనేది ఏ రూపంలోనూ పలుకరాదు. మూడవది అస్తేయము అనగా దొంగతనం చేయకుండుట. కేవలం వస్తువులను దొంగిలించడమే కాదు. అన్యాయంగా, అక్రమంగా తప్పుడు తూనికలు, కొలతలు పాటించడం, అవినీతికి పాల్పడడం కూడా అస్తేయంగానే చెప్పబడింది. నాలుగవది బ్రహ్మచర్యం అనగా ఇంద్రియాలను, కోరికలను అదుపులో ఉంచుకోవడం. ఐదవది అపరిగ్రహం అనగా వస్తువులపై, ప్రదేశాలతో ఎటువంటి మమకారం పెంచుకోకపోవడం. దీనిలో ప్రధాన అంశం ఆస్తిని కలిగి ఉండకపోవడం. మానవుడికి ఆస్తి కలిగి ఉండాలనేదే చెడు ఆలోచనలను కలిగిస్తుంది. దానితో అతడు ఆస్తి సంపాదన కోసం ఏ మార్గాన్నైనా ఎంచుకుంటాడని దీనిలో సారాంశం.

అవసరానికి మించి ఆస్తి హానికరం

ఆస్తివల్ల సమాజంలో అంతరాలు పెరిగి అస్థిరతకు కారణమౌతుంది. అందువల్ల అవసరానికి మించిన ఆస్తి కలిగి ఉండొద్దని మహావీరుడు ప్రబోధించాడు. పంచవ్రతాలను ఆచరించడం వలన కర్మ నాశనమై జీవి కైవల్యాన్ని పొందుతుందని విశదపరిచారు. జైనులు దీనినే మోక్షం అంటారు. మోక్షమనేది దుఃఖం లేని అనంత సౌఖ్యం. సిద్ధశీల, కైవల్యావస్థ అని కూడా పిలుస్తారు. పంచవ్రతాలకు తోడు సమ్యక్ చరిత్ర, సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం అనే త్రిరత్నాలను జైనులు అనుసరించాలని మహావీరుడు ప్రబోధించాడు. ఈ విధంగా దేశంలో అప్పటిదాకా ఉన్న సాంప్రదాయాలకు వ్యతిరేకంగా తొలిసారిగా భౌతిక సుఖాలను, విలాసాలను పరిత్యజించాలని మహావీరుడు ఉద్బోధించారు. ఈ సిద్ధాంతాలు మానవుడి ఆలోచన, తాత్విక ధోరణులపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. వర్ణ వ్యవస్థను, వైదిక ఖర్మకాండలను ఖండించి సామాన్యుడి మోక్షప్రాప్తికై తొలిసారిగా మహావీరుడు మార్గం చూపారు.

(నేడు మహావీర్ జయంతి)

డాక్టర్ సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

98496 18116

Tags:    

Similar News