స్థానిక పాలన... ప్రగతికి ఆలంబన!
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక ప్రజల భాగస్వామ్యానికి ఆనవాలు మన పంచాయతీలు. ఇవి పరిపాలనా వికేంద్రీకరణ నమూనాలు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక ప్రజల భాగస్వామ్యానికి ఆనవాలు మన పంచాయతీలు. ఇవి పరిపాలనా వికేంద్రీకరణ నమూనాలు. అంతే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, పల్లెల ప్రగతే, దేశ ప్రగతి అని మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ఎన్ని చట్టాలు చేసినా, నేటికీ అది కలగానే మిగిలిపోయింది.
స్వాతంత్ర్యానంతరం దేశంలో అత్యధిక భాగంగా ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం ఆలోచించిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1957లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ బాధ్యతగా దేశంలో క్రింది స్థాయి వరకు సుపరిపాలన, స్వపరిపాలన కోసం అధ్యయనానికి ఆదేశించడమైనది. సుదీర్ఘ అధ్యయనం అనంతరం 1959, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశంలో మొట్టమొదటిసారిగా మూడంచెల పంచాయతీ వ్యవస్థ మొదలైంది. తద్వారా జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, బ్లాక్ స్థాయిలో సమితి, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ వ్యవస్థలు ఏర్పడ్డాయి.
పంచాయతీలను నిర్జీవం చేసి..
నాటినుండి నేటివరకు అనేక ప్రభుత్వాలు పంచాయతీరాజ్ స్ధానిక సంస్థల బలోపేతానికి చేసిన చర్యలు, చట్టాలు, రాజ్యాంగ సవరణలు అరకొరగా ఉన్నప్పటికీ, అవి కూడా ఆచరణకు నోచుకోని స్థితిలో అచేతన దశలో ఉన్నాయి. ఆ చర్యలలో భాగంగా 1992లో స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా పంచాయతీరాజ్ స్థానిక సంస్థల బలోపేతానికి 73, 74 రాజ్యాంగ సవరణలు చేశారు. దానిలో భాగంగా స్థానిక సంస్థలకు ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు నిర్వహించాలని, విద్య, వైద్యం, డ్రైనేజీ, పరిశ్రమలు, తాగునీరు, సాగునీరు లాంటి 29 అధికారాలను ఆయా సంస్థల పరిధిలో బదలాయించారు. స్థానిక సంస్థల, స్వపరిపాలన ద్వారా స్థానిక సమస్యలు గుర్తించబడి, పరిష్కారానికి నోచుకుంటాయన్న సదుద్దేశ్యంతో చేసిన సవరణలవి. కానీ చేసి మూడు దశాబ్దాలు దాటినా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేసిన దాఖలాలు లేవు. మరీ మన తెలుగు రాష్ట్రాలలో స్ధానిక సంస్థలకు అధికారాలు, నిధులు ఇవ్వకపోగా వాటిపై పెత్తనం చలాయిస్తున్న తీరు ముమ్మాటికీ దుర్మార్గం. రాజ్యాంగ విరుద్ధం. ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలు తన ఇష్టారాజ్యంగా పాలన చేసుకోవడమే కాక దేశ బడ్జెట్‌లో తన వాటాను పొందుతూ, క్రింది స్థాయి రాజ్యాంగ సంస్థలైన పంచాయతీ రాజ్ సంస్థలను నిర్వీర్యంతో పాటు నిర్జీవం దశకు చేర్చాయి.
ఉత్సవ విగ్రహాలుగా మార్చి..
అరకొర నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడే విధంగా ఆర్థిక దుస్థితిలో నేడు తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థలు ఉన్నాయి. నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ద్వారా తెలంగాణలో స్థానిక సంస్థల పరిపాలనా స్వేచ్చ హరించబడి, పాలనా అధికారాలను కలెక్టర్లకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే పంచాయతీలకు, స్ధానిక సంస్థలకు సమాంతరంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి, పాలక వర్గాలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. దేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురికాబడిన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి. ఇక్కడ ఐదేళ్లకు ఒకసారి జరపవలసిన పంచాయతీ ఎన్నికల కోసం ప్రజలు, సంస్థలు న్యాయ పోరాటం చేయాల్సిన దుస్థితిలో పాలన సాగుతుంది. విచిత్రం ఏమిటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు స్థానిక సంస్థలకు చట్టబద్దంగా రావాల్సిన నిధులు ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘాల తలసరి గ్రాంట్స్ కూడా దారి మళ్లించి తమ స్వంత పథకాలకు వాడుతున్న తీరుపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా ఫలితం లేని స్థితి .కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి వామపక్ష ప్రభుత్వాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు రాష్ట్రాల పెత్తనంలో నలిగిపోతున్నాయి. 1994లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టం అనేక విధాలుగా వక్రీకరించబడుతున్నది. రాష్ట్రాలలో పంచాయతీరాజ్‌కు బదులుగా ఎంఎల్ఏ రాజ్ నడుస్తోంది. గ్రామ స్థాయిలో ఎన్నిక కాబడిన పాలకవర్గాలకు కళ్ళెం వేస్తూ, అధికారుల వత్తాసుతో ఎమ్మెల్యే పెత్తనం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యం గ్రామ స్థాయికి చేరాలంటే..
తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగేళ్లుగా సుమారు ముప్పై వేల కోట్లు స్థానిక సంస్థలకు చెందినవి దారి మళ్లించబడ్డాయి. ఈ అన్యాయంపై తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ ప్రజా ప్రతినిధులు సంఘాలుగా ఏర్పడి, ఉద్యమాలు చేసినా, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగా మారింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సంస్థలైన స్థానిక సంస్థలను తమ శాఖలుగా గుర్తించాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు వేదికగా వినియోగించుకోవాలి. కానీ నిరంతరం రాజకీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచిస్తున్న తీరు అభివృద్ధికి ఆటంకంగా మారిందని చెప్పవచ్చు. అందుకే పంచాయతీరాజ్ సంస్థలపై రాష్ట్రాల పెత్తనం నిరోధించడానికి దేశవ్యాప్తంగా ఒకే పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు చేయాలి. సాంకేతిక లోపభూయిష్టంగా ఉన్న 73,74 రాజ్యాంగ సవరణలను మరోసారి సవరించాలన్నది పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధుల డిమాండ్.
స్థానిక సంస్థలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణ, పరిశీలనతో సుపరిపాలనకు తగు సూచనలు మాత్రమే ఇవ్వాలి. అవినీతి, అక్రమాల నివారణకు నిరంతర శాఖాపరమైన అధికారుల సమీక్షలతో స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించిన నాడే నిజమైన ప్రజాస్వామ్యం గ్రామ స్థాయికి చేరుతుంది. అప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. నిర్మాణాత్మక, శాశ్వత ప్రజా ప్రయోజనాల కోసం తీసుకొనే నిర్ణయాలు ప్రజలు హర్షిస్తారు తప్పితే, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను, సంస్థలను నిర్వీర్యం చేస్తే ప్రజాగ్రహానికి గురి కాబడతారన్నది నేటి పాలకులు గుర్తించాలి.
(నేడు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం)
జి.వీరభద్రాచారి,
గ్రామస్వరాజ్య సాధన సమితి.
63017 96606