లిటిల్ ఫింగర్...ఇది దేశం సమస్య

Little Finger is A Short Film On Girls Struggle in Need Of Public Toilets

Update: 2023-05-13 00:45 GMT

క పురుషుడు మూత్ర విసర్జన చేయాలంటే, ఏ చెట్టు పక్కనో, గోడ పక్కనో దర్జాగా కానిచ్చేయగలడు !... కానీ మన పట్టణాల్లో, మహానగరాల్లో ఒక అమ్మాయికి అర్జెంటుగా ఒకటికి వస్తే, పబ్లిక్ టాయ్‌లెట్లు సమీపంలో లేకపోతే ఆమె ఏం చేయాలి? ఒకటికి, రెంటికి బలవంతంగా ఆపుకోవలసిన పరిస్థితి వస్తే అది ఎంత నరకంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. దురదృష్టం కొద్ది ఇది మనదేశంలో ప్రతిరోజు నగరాల్లో వేలాదిమందికి ఎదురవుతున్న సమస్య. షీ టాయిలెట్స్ ఆవశ్యకత గురించి చిత్ర దర్శకులు కేఎల్ ప్రసాద్ నాలుగేళ్ల క్రితం తీసిన ఒక లఘు చిత్రంలో దయనీయంగా చిత్రించారు.

హైదరాబాద్‌ నగరంలో 10 వేల బహిరంగ టాయ్‌లెట్ల నిర్మాణానికి కారణమైన మూకీ షార్ట్ ఫిలిం 'Little finger'. స్క్రీన్ ప్లే సినిమా డైరెక్టర్ కేఎల్ ప్రసాద్ గారు తీసిన గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. కోట్లాది మంది ప్రశంసలు పొందిన 'లిటిల్ ఫింగర్' ఒక బాలిక టాయ్‌లెట్ సమస్యను అత్యంత హృద్యంగా చూపిన లఘు చిత్రం. ప్రముఖ దర్శకుడు ఆనంద్ పట్వర్థన్ 40 ఏళ్ల క్రితం ముంబై ధారవి మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల టాయ్‌లెట్ సమస్యపై తీసిన 'హమారా షహర్' హిందీ సినిమా తర్వాత మన దేశంలో అమ్మాయిల టాయ్‌లెట్ సమస్యపై నాలుగేళ్ల క్రితం కేఎల్ ప్రసాద్ గారు తీసిన హృద్యమైన షార్ట్ ఫిల్మ్ 'లిటిల్ ఫింగర్'. ఈ లఘుచిత్రం కథతో పోటీపడి నేపథ్యంలో వినిపించిన సంగీతం ఒక అమ్మాయి లఘుశంక సమస్య పట్ల చూస్తున్న వీక్షకుల కంట తడి తెప్పించేంత కారుణ్యభరితంగా రూపొందింది.

హైదరాబాద్‌లో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను చావుదెబ్బ తీయడానికి బీజేపీ గొప్పగా వాడుకున్న లఘుచిత్రం లిటిల్ ఫింగర్. ఒకమ్మాయి లఘు శంక తీర్చడానికి రోడ్డుమీద కాన్వెంట్ టీచర్ తన స్టూడెంట్లను అడ్డుపెట్టి చేసిన ఆ సాహసకృత్యం హృదయమున్న ప్రతి మనిషికి కన్నీళ్లు తెప్పిస్తుంది. మగవారు మాత్రమే రోడ్లపై మూత్ర విసర్జన చేయాలా, అమ్మాయిలకు ఆ హక్కు లేదా అనే సమస్యకు ఈ లఘుచిత్రం చివరలో చూపిన పరిష్కారం ఈ దేశ పాలకులకు కనువిప్పు కావాలి. మన దౌర్భాగ్యం ఏమిటంటే మన పాలకులకు దున్నపోతు మందం చర్మాలు వచ్చి ప్రజల సెన్సిబిలిటీస్ కూడా వినబడకుండా పోవడమే (దీనికి కూడా దున్నపోతునే తిట్టడం భావ్యం కాదేమో). సూటిగా చెప్పాలంటే ఇది ఆ అమ్మాయి సమస్య మాత్రమే కాదు. ఇది ఈ దేశం సమస్య. భారత్ అనే మహా గొప్ప పుణ్యభూమిలో సగం జనాభా సమస్య. నిద్రలేచింది మొదలుకుని రోడ్లమీదే తిరిగే అసంఖ్యాక జనం సమస్య.

ఈ లఘుచిత్రం విడుదలకు ముందు హైదరాబాద్‌లో బహిరంగ టాయ్‌లెట్లు 1200 లోపు మాత్రమే ఉండగా, లిటిల్ ఫింగర్ విడుదలైన తర్వాత ఇప్పుడు ఈ మహానగరంలో 10 వేల బహిరంగ టాయ్‌లెట్లు నిర్మించారు. కానీ కోటి పైబడిన జనాభా ఉన్న భాగ్యనగరంలో ఇవి కూడా ఏమూలకూ సరిపోవన్నది వాస్తవం. 2019 లో మన జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటింగుకి నాలుగు రోజుల ముందు బీజేపీ ఒక పాంప్లెట్ విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో ప్రతి కిలోమీటరుకు మహిళల టాయ్‌లెట్లు నిర్మిస్తాం.. బీజేపీకే ఓటు వేయండి అన్నది ఆ పోస్టర్ సారాంశం. ఆ ఎన్నికల్లో బీజేపీకి తొలిసారిగా 42 సీట్లు అధికంగా వచ్చాయిన్నది తెలిసిందే. ఎన్నికల తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం నెల రోజుల్లో హైదరాబాద్‌లో పది వేల టాయ్‌లెట్లు వుంటాయని ప్రకటించి మాట నిలబెట్టుకుంది.

ఒకటికి, రెంటికి అనే ప్రకృతి అవసరాలు మనకు చెప్పి, టైమ్ పెట్టుకుని రావు కాబట్టి ప్రతిరోజూ ఈ దేశంలో ఎక్కడో ఒకచోట అందుబాటులో టాయ్‌లెట్ లేక అగచాట్లు పడే ప్రజలందరి సామూహిక సమస్యను ఒక కోణంలో చూపిన చిత్రం ఈ లిటిల్ ఫింగర్. పల్లెల్లో అయితే ఏ చెట్టు మరుగునో, ఆరుబయటకి పరుగెత్తో ఈ రెండు పనులను సులువుగా పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మహిళలకు నరకమే అనుకోండి. కానీ సులభ్ కాంప్లెక్సులు ఎన్ని ఉన్నా అవసరాన్ని సకాలంలో తీర్చే సంఖ్యలో టాయ్ లెట్లు లేని మహా నగరాల్లో ఈ రెండు సమస్యలకు లోనైన వారు ఎంత నరకం అనుభవిస్తారో సూచనాప్రాయంగా తెలిపిందీ లఘుచిత్రం. ఉన్నట్లుండి ఒత్తిడితో ఒకటీ, రెండూ వస్తున్న సందర్భంలో సమీపంలో టాయ్ లెట్ లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మనదేశంలో లక్షలాదిమందికి దశాబ్దాలుగా అనుభవమే కదా. భారతీయ చిత్ర పరిశ్రమలో పబ్లిక్ టాయ్‌లెట్స్‌పై చైతన్యం తెచ్చిన అతి చిన్న లఘుచిత్రం లిటిల్ ఫింగర్ (little Finger). కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌ని ఇప్పటికే కోట్లమంది చూశారు. ఇంకా ఎవరైనా చూడకపోతే అలాంటి వారు యూట్యూబ్‌లో ఉంది చూడండి.

కె. రాజశేఖర రాజు

73964 94557

Also Read...

కేరళ స్టోరీ... బ్రెయిన్ వాష్ చేశారా?


Tags:    

Similar News