బలహీన వర్గాల ఐక్యతా కేంద్రం పద్మశాలీలు..

Let's unite Padmasalians! It is time for us to vote wisely.

Update: 2023-08-21 23:15 GMT

నాగరిక మానవునికి మానాన్ని కాపాడడానికి దైవానుగ్రహం ద్వారా నేత వృత్తి అందిపుచ్చుకున్న వారు చేనేత ప్రతిభాశాలులు. మరణాన్ని జయించిన మార్కండేయ మహర్షి వంశస్థులైన పద్మశాలి కులస్తులు నేడు ఆత్మాభిమానం కాపాడుకునేందుకు ఆత్మహత్యల పాలవుతున్న సంగతి మనందరం వింటూ, కంటూనే ఉన్నాం. చేనేత రంగాన్ని వ్యవసాయం తర్వాత రెండవ అతిపెద్ద ఉపాధి రంగంగా భావించకపోవడం వల్ల, వస్త్ర ఉత్పాదనలో వేగవంతమైన పారిశ్రామీకరణ కారణంగా చేనేత వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు కొన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేనేతని ఒక ప్రచార అస్త్రంగా మాత్రమే చూస్తూ వచ్చినట్టుగా అనిపిస్తుంది.

ఉద్యమంలో పద్మశాలీల పాత్ర

అమలు గాని హామీలు, విడుదల గాని బడ్జెట్లు, అలసత్వం నిండిన కొద్దిమంది అధికారులు, నిబద్ధత, సఖ్యత, దూరదృష్టి కొరవడిన కుల నాయకుల వల్ల, నూతన ఒరవడి, కాలానుగుణంగా మారుతున్నటువంటి అభిరుచులకు తగినట్టుగా నైపుణ్యాన్ని పెంచుకోకపోవడం వల్ల, నానాటికీ చేనేత రంగం చితికి పోతున్నది. దీనికి తోడుగా రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గుతుండటం, మొదటి శాసనసభలో ముగ్గురు పద్మశాలి శాసనసభ్యులు ఉండగా, ఈ రోజు ఒక్క పద్మశాలి శాసనసభ్యుడు కూడా తెలంగాణ శాసనసభలో లేకుండా ఉండడం, అతి తక్కువ ఆర్థిక వనరులు కలిగిన వర్గం అవ్వడం వల్ల రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈ రంగం నుంచి వచ్చిన నాయకత్వాన్ని సరైన రీతిలో ప్రోత్సహించకపోవడం వల్ల చేనేత వృత్తి ఆ ప్రభనీ, ప్రభావాన్ని పోగొట్టుకుంటున్నది. అంబేద్కర్ చెప్పినట్టు అధికారానికి దూరంగా ఉండే జాతి క్రమంగా కనుమరుగైపోతుంది అన్నదానికి చేనేత రంగం అద్దంగా కనబడుతుంది.

తెలంగాణ తొలి, మలి ఉద్యమ సందర్భాలలో పద్మశాలీల పాత్ర గణనీయంగానే ఉన్నది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి చూపిన దారి స్ఫూర్తి దాయకం. ఆయన నివాసం జలదృశ్యంలోనే నేటి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పురుడు పోసుకుంది. టైగర్‌గా పేరు పొందిన ఏల నరేంద్ర తన రాజకీయ పార్టీని నాటి టీఆర్ఎస్‌లో విలీనం చేసి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసినారు. పులి వీరన్న, మలిదశ ఉద్యమంలో పోరాడిన మహిళ నేత వనం ఝాన్సీ, ప్రాణాలు త్యాగం చేసిన సిరిపురం యాదయ్య అలాగే ఉద్యమానికి మద్దతుగా 2010లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో మొట్టమొదటిసారి ఒక కులం తరపున బహిరంగ సభ ఏర్పాటు చేసి పద్మశాలీల యువగర్జన ద్వారా ప్రపంచానికి తెలంగాణ ఆవశ్యకతని తెలియజేసినారు. ప్రతి ఊరు వాడ వాడ మగ్గాలు రాట్నాలతో రోడ్డు మీది కొచ్చి చేనేత వృత్తి కార్మికులు, పద్మశాలి మేధావులు, యువకులు ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని కోరుకున్న వాళ్లలో పద్మశాలీలు అగ్రభాగాన ఉన్నారు. వారి వారి ఆకాంక్షలను వివిధ రూపాలలో తెలియజేస్తూనే ఉన్నారు. చేనేత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 లక్షల పైగా చేనేత కార్మికులకి, పరోక్షంగా సుమారు కోటి మంది పైగా ప్రజలకి ఉపాధిని కల్పిస్తున్న చేనేతకు సంబంధించిన అంశాల చర్చల కోసం, ఈ రంగంలో ప్రతిభాశాలీలను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, 2015లో మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం ఆగస్టు 7 వ తారీఖును జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రకటించింది.

బడ్జెట్‌లో కేటాయింపులున్నా…

రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకి ఎన్నికలను పెట్టి పాలకవర్గాలని ఏర్పాటు చేస్తూ టెస్కోను మరింత బలోపేతం చేయడానికి కావలసినటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసి, తయారు చేయబడ్డ అన్ని చేనేత ఉత్పత్తులని టెస్కో ద్వారా కొనుగోలు చేసి నిర్ణీత వ్యవధిలో వాటికి పేమెంట్ చేసి, రంగు రసాయనాలు నూలు, పట్టు లాంటి ముడి సరుకుల లభ్యత, మార్కెటింగ్ సౌకర్యాలను పెంచగలిగితే చేనేత రంగం పూర్వవైభవాన్ని చేరుకుంటుంది. ఎందుకంటే చేనేత వస్త్రాలకి ఉన్నటువంటి డిమాండ్, నాణ్యత, ఆదరణ నేటికీ తగ్గలేదు. పద్మశాలిలల్లో 90 శాతం వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. వారికి ఆర్థికంగా నిలబడేందుకు ప్రభుత్వ పథకాలు అవసరం. అనుబంధ పారిశ్రామిక, రాజకీయ, ప్రభుత్వ రంగాలలో వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం, ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.

45 లక్షల కోట్ల జాతీయ బడ్జెట్లో కేవలం 200 కోట్ల రూపాయలు, దాదాపు మూడు లక్షలు కలిగిన రాష్ట్ర బడ్జెట్లో కేవలం 80 నుంచి 100 కోట్ల లోపు మాత్రమే నికర కేటాయింపులు జరుగుతున్నవి. రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్లు ఈ రంగానికి కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చడం లేదు. బతుకమ్మ చీరలు చేనేత రంగానికి ఏ విధంగానూ ప్రోత్సహించవు. ఆ చీరలు పూర్తిగా మరమగ్గాలపై తయారయ్యేటటువంటివి. కానీ చాలామంది శాసనకర్తలకు బతుకమ్మ చీరల ద్వారా చేనేత కార్మికులు లాభపడుతున్నారు అన్న అపోహ ఉన్నది.

మగ్గాన్ని మ్యూజియంలో చూసే పరిస్థితి!

చేనేత కోసం గతంలో లాగా జనతా వస్త్రాల పథకం అవసరం, ప్రభుత్వం వివిధ అవసరాల కోసం, డిపార్ట్మెంట్ల కోసం కొనుగోలు చేస్తున్నటువంటి వస్త్రాలలో చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. చేనేతపై జీఎస్టీ రద్దు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నవి. కేంద్రం త్వరితగతిన చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి. చేనేత కార్మికులు కూడా వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి, వృత్తి నిపుణతను పెంచుకోవాలి. వేరొక వృత్తి, వ్యాపారం చేసుకోలేనటువంటి వారు చిన్న చిన్న పనుల, వేరొక ఉపాధి కోసం గ్రామాలు వదిలి వలసలు వెళుతున్నారు. యువకులు, విద్యావంతులు నేత చేనేత రంగానికి దూరం అవుతున్నారు.

గతంలో ఉన్నటువంటి జాతీయ చేనేత బోర్డు రద్దు అవడం, జీఎస్టీ రూపంలో చేనేతపై పన్ను భారం పడటం, చిలుపనూలు, రంగు రసాయనాల ధరలు విపరీతంగా పెరగడం, చేనేత రిజర్వేషన్ చట్ట అమలులో లోపాలు ఉండటం వల్ల మధ్య దళారీలు, కొన్ని వ్యాపార సంస్థలు పవర్లూమ్‌పై అతి తక్కువ ధరలో తయారైన, నాణ్యత లేని, చేనేత కానటువంటి వస్త్రాలను చేనేత వస్త్రాలుగా ప్రజలని మభ్యపెట్టి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం జరగవలసినటువంటి ఆప్కో పంపకాలలో స్పష్టత రానందున, టెస్కోకు పాలకమండలి లేకపోవడం వల్ల, గత కొన్ని సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకు పాలకమండలి ఎన్నికల నిర్వహణ జరగకపోవడం వల్లను, చేనేత సహకార సంఘాల అపెక్స్ బాడీ అయినటువంటి టెస్కో భవితపై స్పష్టత లేకపోవడం వల్ల, ముఖ్యంగా చేనేత, నేత రంగం నుంచి రాజకీయ ప్రజా ప్రాతినిధ్యం కొరవడడం వల్ల చేనేత రంగం కునారిల్లుతుంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మగ్గాన్ని మ్యూజియంలోనే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది.

ఆయన చూపిన మార్గంలో..

వృత్తి నిపుణతను పెంచేటటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తే తమిళనాడులో లాగా మెడికల్ టెక్స్టైల్ అలాగే, నిట్ వేర్ లాంటి ప్రత్యామ్నాయ నేత పరిశ్రమలు ఏర్పాటు జరిగి చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు, ఎగుమతులని పెంచుకోవచ్చు. రాష్ట్రంలో టెస్కో ఆధ్వర్యంలో నడుస్తున్న షోరూమ్‌లని ఆధునీకరించి అమ్మకాలను పెంచుకోవడం ద్వారా కార్మికులకి నిరంతరంగా పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానం చూరగొంటున్నటువంటి కొన్ని డిజైన్స్, పట్టు చీరలు, ఇతర వస్త్రాల తయారీ పెంచడానికి చర్యలు తీసుకుంటూ, ఈ రంగానికి అవసరమైనటువంటి ముడి సరుకులని విరివిగా తక్కువ ధరలో అందే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా, మంచి మార్కెటింగ్ విధానాలు అమలు పరచడం ద్వారా మళ్లీ చేనేతకి జీవసత్వాన్ని అందించవచ్చు.

ఈ క్రమంలోనే పద్మశాలీలలో రాజకీయ చైతన్యం కోసం, రాజకీయ అవకాశాలకై, ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం కోసం, పద్మశాలీలు, ఇతర బీసీ కులాల ఐక్యత కోసం, రాష్ట్రంలో అతిపెద్ద జనాభాగా ఉన్నటువంటి ఒక సమూహానికి రాజకీయ దిశ నిర్దేశం చేయడం కోసం ఇటీవలే కోరుట్లలో పద్మశాలి రాజకీయ యుద్ధభేరి పేరుమీద సంఘాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకతీతంగా బహిరంగ సభ జరిగి బ్రహ్మండంగా విజయవంతమైంది. నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పద్మశాలీలు కదలి వచ్చారు. రాబోవు రోజుల్లో బీసీ కులాల మధ్య రాజకీయ పొత్తుల దిశగా ఆలోచించేటటువంటి సమయం ఆసన్నమైనది. గతంలో లాగానే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన మార్గంలో బడుగు బలహీన వర్గాల ఐక్యతా కేంద్రంగా పద్మశాలి కులం శ్రీకారం చుట్టబోతున్నది. సెప్టెంబర్ 3న ఎల్బీ నగర్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో జరుగనున్న భారీ బహిరంగసభకు పెద్ద ఎత్తున పద్మశాలీలు, ఇతర బీసీ కులాలు హాజరై తెలంగాణ రాజకీయాధికారంలో తమ ప్రాతినిధ్యం గురించి ఎలుగెత్తి చాటాలని కోరుతున్నాం.

డా. కర్నాటి శ్రీనివాసులు

జనరల్ సెక్రెటరీ, పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్,

92474 81111

Tags:    

Similar News