వృద్ధులకు బాసటగా నిలుద్దాం!
భారతదేశ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై వృద్ధులను ఒంటరిగా చేస్తోంది. స్వార్థ కారణాల కోసం పిల్లలు తమ పెద్దలను విడిచిపెట్టడం
భారతదేశ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై వృద్ధులను ఒంటరిగా చేస్తోంది. స్వార్థ కారణాల కోసం పిల్లలు తమ పెద్దలను విడిచిపెట్టడం నిత్యం కనిపిస్తుంది. తద్వారా దేశంలో వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం. పూర్వం కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. అక్కడ పెద్దలను గౌరవించేవారు.. వారి పిల్లలను, మనుమలు చూసుకునేవారు. ఇలా వృద్ధులు .. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేవారు. కానీ రానూ రానూ కుటుంబాల్లో ఆర్థిక గొడవలు ఎక్కువవడంతో ఉమ్మడి కుటుంబాలకు దూరమవుతున్నారు. దీంతో వృద్ధులు ఒంటరిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. దీనికి తోడు తల్లిదండ్రులను ఒంటరిగా వదిలివేసి విదేశాలకు వలస వెళ్లేవారు ఎక్కువయ్యారు. ఫలితంగా వృద్ధులకు సాంగత్యం మరియు సంరక్షణ లభించే నర్సింగ్ హోమ్‌లు పెరిగాయి.
ప్రైవసీ కోసం..
వృద్ధులలో దీర్ఘకాలిక వ్యాధులు తక్కువకాకపోవడానికి వృద్ధాశ్రమాలు పెరగడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పెద్దలు ఇంటి పని చేసుకోలేరు వారి అవసరాల కోసం సంపాదించుకోలేరు. వారికి అన్ని సేవలు చేయాల్సి వస్తుంది. ఇలా వారికి అన్ని సేవలు చేసిపెట్టాలనే ఉద్దేశ్యంతో వారిని కొడుకులు బాధ్యత గా పరిగణించడం లేదని తత్ఫలితంగా, వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. చివరికి కొన్ని దారుణమైన సందర్భాల్లో ఆస్తుల కోసం డబ్బుల కోసం కొంతమంది వ్యక్తులు తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. కొన్ని కుటుంబాలలో భార్య మాటలు విని, ఇతరుల మాటలు విని కూడా తల్లిదండ్రులను వారి నుండి దూరం చేసుకుంటున్నారు. డబ్బు ప్రధాన కారకంగా మారినందున ఇది వెనుకబడిన వర్గాలలో ఎక్కువగా కనిపిస్తుంది. కొందరేమో వృద్ధులు ఇంట్లో ఉంటే ప్రైవసీ దెబ్బతింటుందనేటువంటి దురాలోచనతో వారిని వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు.
పిల్లలు అందుబాటులో లేకపోవడంతో..
2021లో భారతదేశంలో దాదాపు 138 మిలియన్ల మంది వృద్ధులు ఉన్నారు. ఈ సంఖ్య 2031 నాటికి దాదాపు 56 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఆఫ్ ఇండియా 2020 ప్రకారం.. భారతదేశంలో నిరాశ్రయులైన వృద్ధులు కొన్ని మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 728 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఇందులో వారి అవసరాల అనుగుణంగా సేవలు అందిస్తుంటారు. కొన్ని వృద్ధాశ్రమాలలో సేవా పరంగా వారికి సాయం చేసేటువంటి స్వచ్ఛంద సంస్థ లాగా పనిచేస్తే, మరికొన్ని వృద్ధాశ్రమాలు నెలకు కొన్ని డబ్బులు తీసుకుని వారికి సేవలు చేస్తున్నారు. చేతకాని వయసులో పెంచినటువంటి పిల్లలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ దుస్థితి దాపరించిందని వాపోతున్నారు వృద్ధులు.
నలుగురితో ఉంటేనే..
వృద్ధులను మరచిపోవడమంటే సంవత్సరాల జ్ఞానాన్ని విస్మరించడమే’ అనే సామెత ప్రకారం మన జీవితంలో వృద్ధులను ఆస్తులుగా పరిగణించాలి. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను మనం పరిశీలించాలి. సీనియర్ సిటిజన్ల సేవ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న సంస్థలకు మద్దతు ఇవ్వాలి. వ్యక్తులు వయస్సు పెరిగేకొద్దీ, రోజువారీ కార్యకలాపాల్లో వారికి మరింత శ్రద్ధ, సహాయం అవసరం కావచ్చు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి జీవించడం లేదా సంరక్షకులను నియమించుకోవడం ఎంచుకుంటున్నారు. మరికొందరు వృద్ధాశ్రమం లేదా పదవీ విరమణ సంఘంలో నివసించడాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నిర్ణయం కష్టంగా ఉన్నప్పటికీ, వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే వృద్ధాశ్రమంలో నివసించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వారి వయస్సుకు తగ్గవారితో ఆశ్రమంలో వారి యొక్క అభిప్రాయాలను, బాధలను, ఇతర విషయాలను పంచుకోవడం జరుగుతుంది. నలుగురితో ఉన్నప్పుడు నేను ఒంటరిగా లేను అనేటువంటి ఆలోచన కలిగి మరింత ఉత్సాహంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకే మనకు నడక నేర్పినటువంటి తల్లిదండ్రులు వారు నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారికి బాసటగా నిలవాలి. ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం పొందాలి. అప్పుడే మీ జీవితానికి సార్ధకత చేకూరుతుంది.
- మోటె చిరంజీవి
9949194327