అందెశ్రీ చాయిస్‌ని గౌరవిద్దాం..!

జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం / ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం" కీరవాణి ఆంధ్ర వ్యక్తి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర

Update: 2024-05-31 01:15 GMT

"జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం / ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం" కీరవాణి ఆంధ్ర వ్యక్తి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆయన సంగీతం చెయకూడదనడం అర్థంలేని గొడవ. లోగడ తెలంగాణ బతుకమ్మ పాటలు ఆంధ్ర కళాకారులతో చేయించుకున్నారు. తమిళ వ్యక్తి ఏ. ఆర్. రహ్మాన్ బతుకమ్మ పాట చేశారు. యాదాద్రి విషయంలో చినజీయర్ అభినివేశం ఎంతో ఉంది, పైగా దానికి ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన ఆనంద్ సాయి, చినజీయర్ ఇద్దరూ ఆంధ్రులే..! అప్పుడు లేని 'ఆంధ్ర అన్న పట్టింపు' ఈ పాట విషయంలో కీరవాణి పరంగా రావడం అసమంజసం. కీరవాణి తెలుగు వ్యక్తే అన్న నిజాన్ని మరిచిపోకూడదు.

అందెశ్రీ రాసిన ఈ పాట ఇవాళ వివాదానికి కేంద్ర బిందువైంది. ఈ పరిణామం బాధాకరం. ఈ పాటను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా తీసుకుంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం చెయ్యడం తప్పన్నట్టుగా అర్థంలేని రచ్చ జరుగుతోంది. అందెశ్రీ స్వయంగా కీరవాణి చేత ఈ పాటకు సంగీతం చేయించడం వివాదస్పదం ఔతోంది. వివాదం అవసరమా?

కీరవాణిపై సంకుచితత్వం ఏల?

కీరవాణి దేశంలో ఇప్పుడున్న గొప్ప సంగీత దర్శకుల్లో ఒకరు. అలాంటి కీరవాణిని సరైన ఆలోచనతో, విజ్ఞతతో, ఈ పాటకు సంగీతం చేయడానికి అందెశ్రీ ఎంచుకున్నారు. అందుకు అందెశ్రీ అభినందనీయులు. ఆయన రాసిన ఈ పాటకు, ఒక రాష్ట్ర గీతంగా ఉండ తగ్గ పాటకు సంగీతం చేయడానికి మొత్తం తెలుగులో కీరవాణి కన్నా గొప్ప సంగీత దర్శకుడు లేడు!

ఎవరు సంగీతం సమకూర్చుతేనేమి.. 'తెలంగాణ రాష్ట్ర గీతం గొప్పగా ఉండాలి అన్నది కావలసింది. అందుకు కీరవాణి అర్హుడు'. ఆయన తెలంగాణ వ్యక్తి కాదు కనుక ఈ పాటకు ఆయన సంగీతం చేయకూడదు అనడం సంకుచితత్వం. అంతే కాదు అది లోక జ్ఞానం, తెలివిడి లేని స్థితి.

జాతీయ గీతాలు 'పరాయి' రచనలే

అమెరికా జాతీయ గీతం సంగీత కర్త జాన్‌సన్ స్టాఫడ్ స్మిత్ (Johnson Stafford Smith) బ్రిటిష్ సంగీతకారుడు. అమెరికన్ కాని వ్యక్తి సంగీతంలో అమెరికా జాతీయ గీతం రవళిస్తోంది! 1950లలో అధికారిక శ్రీలంక జాతీయ గీతం తెలుగు గాయని కె. రాణి గొంతుతో నమోదైంది. తమిళనాడు రాష్ట్ర గీతం మనోన్మణియమ్, సుందరమ్ పిళ్లయ్ రాసిన "నీరారుమ్ కడల్ ఉడుత్త నిలమడన్‌దై..." 1970లో ఈ పాట అధికారిక గీతం అయినప్పుడు ఈ పాటకు సంగీతం చేసిన వారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాథన్. ఈయన తమిళ వ్యక్తి కాదు మలయాళి. ఆ పాటను పాడిన గాయకులు పి. సుశీల, టీ.ఎమ్. సౌందరరాజన్. పి. సుశీల తెలుగు వ్యక్తి, టీ.ఎమ్. సౌందరరాజన్ సౌరాష్ట్ర భాష వ్యక్తి.

కన్నడ రాష్ట్ర గీత కర్తలెవరు?

కర్ణాటక రాష్ట్ర గీతంగా కవి కుప్పనహళ్లి వెంకట కృష్ణప్ప (కు.వెం.పు.) రాసిన "జయ భారత జననియ తనుజాతే/ జయహే కర్ణాటక మాతే..". ఈ పాట ప్రభుత్వం పరంగా మైసూర్ అనంత స్వామి సంగీతం చేసి పాడిందే అమలులో ఉంది. కానీ తమిళ వ్యక్తి విజయ్ భాస్కర్ సంగీతంలో తెలుగు వ్యక్తి పి.బి. శ్రీనివాస్ పాడింది జనరంజకమై విశేషంగా ప్రాచుర్యంలో ఉంది. బంగ్లాదేశ్ జాతీయకవి నజ్‌రుల్ ఇస్లామ్. ఆయన భారతీయుడు. బంగ్లాదేశ్ జాతీయ గీతం రాసింది భారతీయుడైన రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా ఇలాంటి విషయాలు, వాస్తవాలు ప్రపంచంలో మరెన్నో.

ఈ రచ్చ, రాద్ధాంతం అవసరమా?

తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో ప్రపంచంలో లేని విధంగా లేదా ప్రపంచానికి భిన్నంగా రచ్చ, రాద్ధాంతం, వివాదం జరుగుతుండడం బాధాకరం.. అవాంఛనీయం. ఈ విషయంగా చిచ్చు రగలే పరిస్థితి రాకూడదు. మనోవికాసంతో, విజ్ఞతతో, లోక జ్ఞానంతో తెలంగాణ ప్రశాంతతకు, తెలంగాణ నాణ్యతకు భంగం వాటిల్లకుండా చూసుకోవడం తెలంగాణ వాసుల బాధ్యత. పప్పు నారాయణాచార్య తెలంగాణ గీతాన్ని అందెశ్రీ నకలు చేశారనడం కూడా సరికాదు. సాహిత్యం పరంగా పప్పు నారాయణాచార్య తెలంగాణ గీతం కన్నా అందెశ్రీ రాసిందే మేలుగా ఉంది. ప్రస్తుత పరిస్థితిలో రాజకీయాలకు అతీతంగా అందెశ్రీకి నైతిక, సామాజిక, సాంస్కృతిక మద్దతునివ్వడం విజ్ఞత. ప్రస్తుత తెలంగాణ గీతం విషయంగా కవి అందెశ్రీకి, సంగీత దర్శకుడు కీరవాణికి అభినందనలు.

-రోచిష్మాన్

94440 12279

Tags:    

Similar News