రాజకీయ నాయకులను ప్రశ్నిద్దాం!
Let's question politicians on illegal cases!
దశాబ్ద పాలనను ముగించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు అధికారం కోసం ప్రజల ముందుకు ఓట్ల కోసం వస్తున్నది. నేడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలతో పాటు సీపీఐ, సీపీఎంలు కూడా ఎన్నికల్లో గెలవడం కోసం ముందుకు వస్తున్నాయి. కానీ ఏ పార్టీ కూడా ప్రజల హక్కులకు భరోసా ఇవ్వడం, సమస్యలను పరిష్కరిస్తామని హామీ లేకుండానే కేవలం ఉచిత పథకాలను పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో తెలంగాణలో అణచివేత పట్ల ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు. అధికార పార్టీ అణచివేతలను మేం కొనసాగించమని, ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తామని ఎవరూ మాట్లాడటం లేదు. ఈ దశాబ్ది కాలంలో కొనసాగిన హత్యలకు, ఆత్మహత్యలకు రాజ్యాంగపరంగా గుర్తించి, శిక్షించే ప్రయత్నం చేసినా, ప్రజలకు ఇతర పార్టీల మీద కొంచమైనా విశ్వాసం కలిగేదేమో. ఎన్నికలంటే రాజకీయ పార్టీల మధ్య యుద్ధంగానే చూసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదు. మాట్లాడడం లేదు.
మేధావులపై నిర్బంధం
గత వలస ప్రభుత్వాలు కొనసాగించిన విధానాన్నే తెలంగాణ ప్రభుత్వం కూడా అభివృద్ధి పేరిట హక్కుల విధ్వంసాన్నే దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్నది. వలస పాలకులు.. బుద్ధి జీవులకు, మేధావులకు కొంత విలువ గౌరవం ఇచ్చేవాళ్ళు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మేధో బలంగా పనిచేసిన ప్రొ. హరగోపాల్, ప్రొ. కోదండ రామ్‌లను కూడా ఊహించని విధంగా నిర్బంధాలకు గురి చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పాలి. తెలంగాణ ఏర్పడ్డాక ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు అన్ని విశ్వ విద్యాలయాల్లోని విద్యార్థి సంఘాలు కూడా గతంలో ఎప్పుడూ ఎదుర్కొని, అనుభవించని నిర్బంధాలను చవిచూడడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. రైతాంగం, కార్మికులు, విద్యార్థి పోరాటాలు లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదు.
దశాబ్ద పాలనలో విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు, అన్ని రంగాల ప్రజలు అణచివేతకు గురయ్యారు. తప్పు ఎక్కడ కూడా వారి ఆందోళన పట్ల ప్రజాస్వామిక పరిష్కారాలను పొందలేకపోయింది. అందులో భాగంగా ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు వారి వారి అకడమిక్ సమస్యలను, హాస్టల్ సమస్యలకు గానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన పోలీసు దాడులు, లాఠీచార్జీలు అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు తప్ప ఏ ఒక్క సమస్యకు పరిష్కారాన్ని అందించలేదు. దానికి తోడు గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో లోపభూయిష్టమైన విధానాల వలన అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షా ఫలితాల మంచి నేటి పరీక్షల నిర్వహణ వరకు అన్ని ఆటంకాలు, అవరోధాలు, లోపభూయిష్టాలు. వీటితోనే కనీసం 100కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రశ్నించకపోయినా ఉద్యమించకపోయినా మన సమస్యలను పరిష్కరించలేరు అనే సత్యాన్ని ప్రజలు గ్రహించి ఈ ఎన్నికల సందర్భంగా నైనా ఊపా, ఎన్ఐఎలను రద్దు చేయాలనీ, ప్రజాస్వామిక వాదులపై నిర్బంధాన్ని ఎత్తివేయాలనీ డిమాండ్ చేయాలి. మౌలిక సమస్యలను పరిష్కరించడంపై, మన ముందుకు వస్తున్న రాజకీయ నాయకులను ప్రశ్నించాలి, నిలదీయాలి. ప్రశ్నించే గొంతులపై ఊపా, ఎన్ఐఏలను రద్దు చేయాలని ఎన్నికల్లో పాల్గొనే ప్రతి రాజకీయ పార్టీ తన మ్యానిఫెస్టోలో అంశంగా చేర్చాలి.
ఎస్. నారాయణరావు
98667 34867