అభిరుచికి అనుగుణంగా చదువుకోనిద్దాం!

వేసవి కాలం వచ్చిందంటే పిల్లలకి వారి తల్లిదండ్రులకి పరీక్షా సమయం. ఎంతో కష్టపడి చదివి ఎలా రాస్తామో.. అన్న ఆందోళన పిల్లలలో

Update: 2024-05-26 01:00 GMT

వేసవి కాలం వచ్చిందంటే పిల్లలకి వారి తల్లిదండ్రులకి పరీక్షా సమయం. ఎంతో కష్టపడి చదివి ఎలా రాస్తామో.. అన్న ఆందోళన పిల్లలలో, వారికి ఎన్ని మార్కులు వస్తాయో.. ఏ ర్యాంక్ వస్తుందోనని తల్లిదండ్రుల ఆందోళన. వేసవి వల్ల వచ్చే ఉక్కబోత, వేడి కంటే పరీక్షలు, వాటి ఫలితాలు తెచ్చే తాపం ఎక్కువగా ఉంటుంది. సంవత్సరం అంతా కష్టపడి ఎన్నో ప్రశ్నలకు జవాబులు బట్టీ పట్టినా పరీక్షలో వచ్చే కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలియకపోతే ఆశించిన ఫలితాలు రావు.

విద్య వల్ల మనిషి ఏమి సాధించాలి విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం, తతః సుఖం అని మిత్రలాభంలో చెప్పినట్టు, విద్య వలన వినయం అలవడాలి. వినయం వలన అర్హత కలుగుతుంది. విద్యా వినయాల వలన ధనం ప్రాప్తిస్తుంది. ఆ ధనం ద్వారా ధర్మ నిరతితో కూడిన సుఖం పొందాలి. స్వయం పురోగతితో పాటు సమాజ అభివృద్ధికి పాటుబడే తత్వం ధర్మ నిరతిలో భాగం.

ఈ కాంక్ష తల్లిదండ్రుల్లో ఎక్కువైంది!

భారతీయ విద్యా విధానంలో నైనా.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న విద్యావిధానంలోనైనా.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు డిగ్రీ పరీక్షలు కూడా విద్యార్థి మననం చేసిన విషయాన్ని పరీక్షలలో రాసే శక్తిని మాత్రమే పరీక్షిస్తున్నాయి. కానీ విద్యార్థులలో ఉండే సృజనాత్మకతని, సాంకేతిక అభిరుచిని ప్రోత్సహించే అవకాశాన్ని కలిగించడం లేదు. కొన్ని సంస్థలు చేసిన పరిశోధన ప్రకారం.. భారతదేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి ఉత్తీర్ణులైన వారిలో సగం మందికి పైగా ఉద్యోగార్హత లేని వారు. అంటే, వారిలో సంస్థలకి అవసరమయిన నైపుణ్యం లేదన్న మాట. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల మధ్య ఉన్న అంతరంతో పాటు, ఇంజనీరింగ్ లాంటి చదువులు చదువుకున్న వారికంటే మిగతా చదువులు చదువుకున్న వారికి అవకాశాలు తక్కువ అన్న విషయం పరిశోధన చేయకుండానే చెప్పవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులు.. వారి మీద వారి తల్లిదండ్రులు పెట్టుకుంటున్న అంచనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా వారు సాధించలేనివి వారి పిల్లలు సాధించాలనే ఆశ, వారి బంధుమిత్రుల పిల్లల కంటే గొప్ప చదువులు చదివి.. ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలన్న ఆకాంక్ష మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి తల్లిదండ్రులలో ఎక్కువైంది.

పిల్లల అభిరుచిని గౌరవించి..

ప్రస్తుతం పిల్లల కంటే ముందే వీరు ఏ డిగ్రీలు సాధిస్తే తొందరగా పెద్ద ప్యాకేజ్‌తో ఉద్యోగం వస్తుంది. లేదా విదేశాలలో ఉద్యోగం పొందాలంటే ఏ చదువులు చదవాలి.. అన్న అంశాల మీద ఆసక్తి ఎక్కువైంది. ఒకరి పిల్లలు ఇంజనీరింగ్ చదివితే.. ఆ కాలనీలో ఉండే వారి పిల్లలలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువు కోసం ఆరాటపడే అవకాశాలు ఎక్కువ ఉండడం సాధారణంగా చూస్తాము. కానీ పిల్లల అభిరుచి గమనించి.. వారి ఇష్టాలను గౌరవించి తగిన విద్యావకాశాలు కలిగించే తల్లిదండ్రులు కొంతమందే ఉంటారు. చదువు ఉద్యోగావకాశాలను కలిగించేదిగా ఉండాలన్నది సాధారణ ఆలోచన. అది తప్పు కాదు. కానీ ఇష్టం లేని చదువు చదివి, ఇష్టం లేని వృత్తి చేపట్టి.. జీవించడం అందరికీ సాధ్యం కాదు. భారతీయ యువకులు పరిస్థితులను బట్టి తమను తాము మలచుకునే తత్త్వం గలవారు అయినప్పటికీ.. అభిరుచికి భిన్నమైన పనిని జీవితాంతం చేయడం కష్టం కదా..? పాశ్చాత్య దేశాలలో ఉన్నత పాఠశాల ముగిసే సమయంలో విద్యార్థులలో వృత్తి అభిరుచి (career aptitude) ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రక్రియలో చాలామంది విద్యార్థులు తాము ఏ వృత్తిలో రాణించే అవకాశం ఉందో.. ఏ వృత్తి తమ నైజానికి నప్పదో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి ప్రక్రియ భారతదేశంలో కూడా అక్కడక్కడ ఉందేమో.. గానీ ప్రతి కళాశాల విద్యార్థికి అందుబాటులో ఉంటే బాగుంటుంది.

కలిసి పనిచేసే తత్వం..

కాలేజీ చదువు అయ్యాక ఏమి చేద్దామనుకుంటున్నావు అన్న ప్రశ్న దాదాపు విద్యార్థులందరూ ఎదుర్కొనేదే. నువ్వు ఎలాంటి మనిషిగా అవ్వాలనుకుంటున్నావు అని మాత్రం ఎవరూ అడగరు. తాను చేపట్టిన ఉద్యోగం, వృత్తి మీద ఒక వ్యక్తి విలువ ఆధారపడి ఉండడం సమాజంలో సాధారణంగా చూస్తాము. ముఖ్యంగా భారతదేశంలో.. ఉన్నత పదవులలో, ప్రభావశీలమైన పదవులలో ఉన్న వారితో స్నేహం, వియ్యం పొందాలని ఉవ్విళ్లూరతాము.. కానీ ఉన్నతంగా ఆలోచించే ఉత్తమ వ్యక్తుల సాంగత్యం కోసం తపించడం అరుదు. ఉన్నత విద్య, ఉద్యోగం ఉన్నా సామాజిక వర్గ ప్రాతిపదికన స్నేహం చేసేవారు.. ఇంకా ఎంతో మంది భారత సమాజంలో ఉన్నారన్నది నిర్వివాదాంశం. కలిసి పనిచేసే తత్వం గల వారిని అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తత్వం చిన్నప్పటినుండి అలవడేలా తల్లిదండ్రులు, విద్యాలయాలు కృషి చేయాలి. స్వంత లాభంతో పాటు, పరాయి వారికి చేయూతనిచ్చే కార్యక్రమం చేపట్టాలన్నది ప్రాచీన సాహిత్యంలో నుంచి గురజాడ పాట వరకూ మనం చదువుకుంటున్న విషయమే. ఉన్నత ఆలోచనలు, ఆశయాలు సమాజంలో విస్తరింప చేయడానికి ఉన్నత విద్య ఉపయోగపడాలి. ఈ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ తమ అభిరుచికి అనుగుణంగా, తమ కలల సాకారం దిశగా అడుగులు వేస్తూ ఆనందమయ జీవితం సాగించాలని ఆకాంక్షిద్దాం.

- డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ

ప్రకాశిక సంపాదకులు

editor@prakasika.org

Tags:    

Similar News