ఊసరవెల్లులకు.. కర్రు కాల్చి వాత పెట్టండి!
Let the people defeat the political chameleons
బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ రాజకీయ నేతలు చేరుతారు. పదవులు, డబ్బులు సమకూరేంత వరకు పార్టీ అధినేతను ఇంద్రుడూ, చంద్రుడూ అంటూ పొగుడుతారు. పార్టీ అధినేతకు, పార్టీకి వీర విధేయత ప్రకటిస్తారు. పార్టీకి అధికారం చేజారితే వెంటనే... ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి చేరిపోతారు. నిన్నటి దాక పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చెడదిట్టిన పార్టీలోకి సిగ్గూ, ఎగ్గూ, బిడియం లేకుండా చేరిపోతారు. పేర్లు పెట్టి వ్యక్తిగతంగా బూతులు తిట్టుకున్నవారు తెల్లారేసరికి పార్టీ కండువాలు మార్చుకుంటూ, నవ్వు మొఖాలతో కౌగలించుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తూ కనపడతారు. ఈ ఊసరవెల్లి వలస రాజకీయాలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నా అవకాశవాదానికీ, అధికార దాహానికీ పార్టీ ఫిరాయింపులకి నిలయంగా చైతన్యగడ్డ తెలంగాణ కూడా అతీతం కాకపోవటం నిజంగా శోచనీయం.
ఒకసారి పార్టీ సిద్ధాంతాలు నచ్చి, అందులో ప్రాథమిక కార్యకర్తగా ప్రవేశించి, వివిధ దశల్లో నమ్మకంగా పనిచేసిన కార్యకర్తలకే వారి శక్తి, సామర్ధ్యాల మేరకు పూర్వం పార్టీ అవకాశాలు కల్పించేది. ఈ సంస్కృతి మన దేశంలో మొదట వామపక్షాల్లో, ఆ తరువాత జనసంఘ్ బీజేపీలో కనిపించేది. వారే పార్టీ జెండాలు మోసేవారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా నమ్మేవారు. ఏళ్ళ తరబడి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా పార్టీ కోసం అహర్నిశలూ పనిచేసేవారు. వారే పార్టీ సిద్ధాంత భావ వ్యాప్తికి తోడ్పడేవారు. పార్టీ కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడే వారు కాదు. కొన్నిసార్లు వివిధ అంతర్గత, బాహ్య కారణాల వల్ల పదవులు వచ్చినా, రాకున్నా పార్టినీ, దాని సిద్ధాంతాన్నీ మనసా, వాచా బలంగా నమ్మి, గాఢంగా విశ్వసించి పనిచేసేవారు.
కులం, ధనం ఆధారంగా..
ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు అలాంటి పార్టీలూ, పార్టీ నేతలూ కరువయ్యారు. మారుతున్న పరిస్థితులతో రాజీపడి బీజేపీ, వామ పక్షాలు కూడా పార్టీ క్రమశిక్షణకు తిలోదకాలు ఇచ్చారు. ఇప్పుడు పార్టీలు టిక్కెట్ ఇచ్చేటప్పుడు అభ్యర్థి గుణగణాలు చూడటం లేదు, పార్టీపట్ల నిజాయితీగా అంకిత భావంతో పనిచేసిన వ్యక్తేనా, కాదా! అని ఆరాతీయటమూ లేదు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే విలువ ఉంటుంది. ఆ విలువ కులం, మతం, ధనం ఆధారంగా నిర్ణయించబడుతుంది. రాజకీయ వారసులకూ, వలసవాదులకు, అవినీతిలో మునిగి తేలిన వారికి తమపార్టీ వ్యతిరేకమని సిద్ధాంతాలు చెబుతూనే ఆచరణలో బీజేపీ అలాంటివారికే పార్టీ టికెట్లు ఇచ్చిన ఉదంతాలు దేశమంతటా కనిపిస్తుంది.
వామపక్షాలదీ అదే బాట
వామపక్షాల్లో కూడా కొన్ని చోట్ల సడలింపులు ఉన్నప్పటికీ, ఇప్పటికీ కొంత మెరుగ్గా సిద్ధాంత బలంతో కార్యకర్తలు పనిచేస్తున్నారు. పాతతరం నాయకుల్లో ఈ ధోరణి ఇంచుమించు ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉండేది. కొన్నిసార్లు సిద్ధాంత విభేదాలు వస్తే బహిరంగంగా తాను ఎందుకు ఏ కారణాలతో విడిపోతున్నాడో పార్టీ అతర్గత సమావేశాల్లో గట్టిగా వాదించేవారు. ఆ తరువాత బహిరంగ పత్రికా ప్రకటన చేసి మరో పార్టీని స్వయంగా స్థాపించేవారు. అంతే కానీ పూటకోపార్టీ మారే అయారాం, గయారం సంస్కృతి ఉండేదికాదు. ఇప్పుడు వారూ, వీరూ అనే తేడా లేదు. అన్ని పార్టీలు ఈ దుష్ట సంస్కృతికి గేట్లు తెరిచాయి. అధికారం ఎక్కడ ఉంటే పోలో అంటూ అక్కడ చేరిపోతారు. కండువాలు మార్చుకోవడం ఇప్పుడు ఎంత తేలికైందో...!
జెండాలు మోసినోళ్లని గాలికొదిలేసి...
జెండాలు మోసినోళ్లకి కాకుండా వ్యక్తిగత ఎజెండాలతో కండువాలు మార్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నంతకాలం పార్టీ పిరాయింపులు జరుగుతూనే ఉంటాయి. వారిపై స్పీకర్లు చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలి. కానీ స్పీకర్లు కూడా అధికార పార్టీకి అనుకూలంగానే విధేయత ప్రకటిస్తున్నారు. ఇలాంటి ఫిరాయింపు నేతలకు ప్రజలు కూడా 'కర్రుకాల్చి వాత పెట్టినట్లు' రానున్న ఎన్నికల్లో ఓడించి ప్రజా చైతన్యసత్తా చాటాలి. ఒక సిద్ధాంతం, కట్టుబాటు లేకుండా ఇలా పార్టీ ఫిరాయించే వారికి గట్టిగా బుద్ధి చెప్పితీరాల్సిన సమయం ఆసన్నమయింది. ఒక పార్టీలో పుట్టి,పెరిగి, ఎమ్మేల్యేలుగా, ఎంఎల్‌సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ఉప ముఖ్య మంత్రులుగా అనేక అవకాశాలను పార్టీ కలిపిస్తే కూడా తృప్తి లేకపోవటం, పార్టీకి కనీసం కృతజ్ఞత చూపక పోవటం అమానుషం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడిన వారిని ఓటర్లు ఉపేక్ష చేయకూడదు.
ఈ హవా కొంతకాలమే..
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీలు పడి మరీ, వలసలను ప్రోత్సహిస్తున్నాయి. నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి అధికార దాహంతో అవకాశాలను వెతుక్కుంటూ ప్రతి ఎన్నికలకు పార్టీలు మారుస్తూ మారుతూ ఊసరవెల్లిని సిగ్గుపడేలా చేస్తున్నారు. తెప్పలుగ చెరువు నిండిన, కప్పలు పదివేలు చేరు అనే సుమతీ శతక కారుని భాష్యాన్ని నిజం చేస్తున్నారు. ఒక పార్టీలో ఉన్న నాయకుడికి మరొక పార్టీ ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, మరొకవైపు ఏ పార్టీ టికెట్ ఇస్తే నాయకులు ఆ పార్టీలోకి మారడంతో పార్టీలు డ్రామా కంపెనీలుగా, నాయకులు డ్రామా నటులుగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. అయితే, వీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపుల హవా కొంతకాలమే కొనసాగుతుంది. నాయకులు తమ వ్యక్తిత్వాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రజాస్వామ్య విలువలను... పదవులకోసం, ధనం కోసం, ఇతర వ్యాపార, ఆర్థిక ప్రయోజనాల కోసం అమ్ముకొనటానికి సిద్ధమైనప్పుడు సంతలో అంగడి సరుకవుతారే గానీ, విలువలు గల ప్రజా ప్రతినిధులు కాలేరు. వారు చరిత్ర హీనులుగా, రాజకీయ కళింకితులుగా చరిత్రలో శిలాక్షరాలతో లింఖించబడతారే గాని నిష్కకళింకితులు కాబోరు. ఈ అపవిత్రపు డాగు, మచ్చ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. అందరూ, అన్ని విషయాలను గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వారి తీర్పు భయంకరంగా ఉంటుంది. అన్ని రోజులూ మనవి కావు. మరో సారి ప్రజలు విజ్ఞత చూపి అవకాశవాద, ఫిరాయింపుదార్లను గుర్తు పెట్టుకుని మరీ ఓడిస్తే, వారికి గుణపాఠం నేర్పినట్లు అవుతుంది.
-డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496