‘‘నా మొగుడు.. కొడుకు తాగొచ్చి నన్ను కొట్టేవాళ్ళు. పైగా ఇష్టపడే వాళ్లను కొట్టే హక్కు తమకి ఉంటుందని బుకాయించేవాళ్లు...చూసి చూసి ఓ రోజు నేను కూడా నా హక్కును వాడుకున్నా'' - - ఆహా...ఈ డైలాగ్‌లో ఎంత రివల్యూషన్ ఉంది. చాచి మగాడి చెంప మీద కొట్టినట్టు లేదూ..! పనిగట్టుకుని కొంతమంది దర్శకులు పొలిటికల్ ఎజెండాతో ప్రాపగాండ సినిమాలను మనపై రుద్దుతున్న సమయంలో మహిళల హక్కులు, వాళ్ల స్వేచ్ఛ విషయంలో దేశం వేసుకున్న ముసుగును పక్కకు లాగిపడేసిన సినిమా ‘లాపతా’ లేడీస్.
వాళ్లని మనం ఎప్పుడో తప్పించేశాం కదా..!
వాళ్లు సొంతంగా ఆలోచిస్తే తట్టుకోలేం
వాళ్లకు సొంత వ్యక్తిత్వం ఉంటే భరించలేం
వాళ్ల మానాన వాళ్లు బతకడానికి కూడా
మనమే బోడి పర్మిషన్లు ఇవ్వాలి కదా..!
అసలు స్త్రీలు పుట్టిందే మగాళ్లకు సేవలు
చేసి తరించడానికి అన్నది కదా మన ఫీలింగ్
ఇలాంటి మనస్తత్వం ఉన్న మగాళ్ల గుండెల్లోకి
నేరుగా గునపం దించేశారు కిరణ్ రావు.
'లాపతా లేడీస్' (Laapataa Ladies) చిత్రాన్ని చాలా మంది కామెడీ డ్రామాగా ప్రమోట్ చేస్తున్నారు గానీ మహిళలకు సంప్రదాయాలు, ఆచారాలంటూ ముసుగేసిన సమాజాన్ని చురకత్తులాంటి సంభాషణలతో చీల్చి చెండాడిన మూవీ లాపతా లేడీస్. మొదటి సినిమా దోబీ ఘాట్ (Dhobi Ghat) తర్వాత 13 ఏళ్లు గ్యాప్ తీసుకుని మెగా ఫోన్ పట్టుకున్న కిరణ్ రావు... ఎవరికి ఎక్కడ తగిలించాలో అక్కడ తగిలించేశారు.
ఇద్దరమ్మాయిలకు పెళ్లవుతుంది. ట్రైన్‌లో వాళ్లు మారిపోతారు. ఒకరు చేరాల్సిన అత్తగారింటికి మరొకరు చేరతారు. పుట్టి పెరిగిందే అత్తారింట్లో సేవ చేయడానికని, అదే జీవిత పరమార్థమని నమ్మే అమాయక పల్లెటూరి అమ్మాయి ఓ వైపు.. ఆర్గానిక్ ఫార్మింగ్‌లో మెళుకువలు నేర్చుకుని రైతుల జీవితాలను మార్చాలనుకుంటూ స్వేచ్ఛగా ఆలోచించే ఇంకో అమ్మాయి...వీళ్లిద్దరి చుట్టూ మరికొన్ని పాత్రలు.
ఒక్కదానివే ఉంటున్నావ్.. నీకు భయంగా లేదా రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్‌పై టీ అమ్ముకునే మధ్యవయసు మహిళను అడుగుతుంది కొత్త పెళ్లికూతురు. 'ఒంటరిగా ఉంటూ ఆనందంగా జీవించడం చాలా కష్టం. కానీ అలా బతకడం నేర్చుకున్నావనుకో ఇక నిన్ను ఎవరూ బాధ పెట్టలేరం'టూ ఆమె సమాధానమిస్తుంది. మగాళ్ల కనుసన్నల్లోనే ఆడవాళ్లు బతకాలి అనుకునే వారికి ఛాయ కదమ్‌తో చెప్పించిన ఈ డైలాగ్ నిద్రపట్టనివ్వదు. ట్రైన్‌లో తప్పిపోయిన కొత్త పెళ్లి కూతురికి ఆశ్రయం ఇచ్చేది ఈమే.
మతం వేసిన ముసుగు ఎంతటి ప్రమాదకరమైందో సింగిల్ ఫ్రేమ్‌లో కాస్త హాస్యం జోడించి చూపించారు కిరణ్ రావు. తప్పిపోయిన భార్యను వెతుకుతూ ఓ కొట్టు దగ్గరకు వచ్చి ఫొటో చూపిస్తాడు పెళ్లి కొడుకు. అందులో భార్య ముసుగేసుకుని ఉంటుంది. ముసుగేస్తే ఐడెంటిటీ ఎలా తెలుస్తుంది అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు షాపతను.. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి ఆయన భార్య బురఖా వేసుకుని వస్తుంది. ఇద్దరూ ముఖాలు చూసుకుంటారు.
పనిగట్టుకుని కొంతమంది దర్శకులు పొలిటికల్ ఎజెండాతో ప్రోపగాండ సినిమాలను మనపై రుద్దుతున్న సమయంలో మహిళల హక్కులు, వాళ్ల స్వేచ్ఛ విషయంలో దేశం వేసుకున్న ముసుగును పక్కకు లాగిపడేసిన సినిమా లాపతా లేడీస్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి ఇదొక మాస్టర్ పీస్.
చిత్రం : లాపతా లేడీస్
దర్శకురాలు: కిరణ్ రావు
నిర్మాత అమీర్ ఖాన్
కథ: బిప్లవ్ గోస్వామి, దివ్యనిధి శర్మ, స్నేహ దేశాయి
నటీనటులు: నీతాంషి గోయెల్, స్పర్శ్ శ్రీవాత్సవ, సవిత మాలవీయ, రవి కిషన్, ఖుష్బూ చౌబిడ్కర్ తదితరులు
లభ్యం: నెట్ ప్లిక్స్
-ఫణికుమార్
90521 16630