ఆదివాసీలపై ఊచకోత..
సరిగ్గా1948వ సంవత్సరం అంటే డెబ్బై ఏడేళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఎవరూ ఊహించని దుర్మార్గపు ఊచకోత జరిగింది.
సరిగ్గా1948వ సంవత్సరం అంటే డెబ్బై ఏడేళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఎవరూ ఊహించని దుర్మార్గపు ఊచకోత జరిగింది. అదీ.. శాంతి యుతంగా ఉద్యమం చేస్తున్న ఆదిమ నివా సులపై. నేడు ప్రపంచం అంతటా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటుండగా భారతీయ ఆదివాసులు మాత్రం జార్ఖండ్ రాష్ట్రంలో ఖర్సావాన్‌లోని ఆదివాసీల అమరవీరులకు ఏటా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
మరో జలియన్ వాలాబాగ్
జార్ఖండ్‌లోని ఖర్సావాన్ వద్ద ఆదివాసులపై పోలీసులు జరిపిన కాల్పుల ఘటన 1919, ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ కంటే ఎన్నో రేట్లు తీవ్రమైనది. దీనిని స్వతంత్ర భారతదేశంలో జరిగిన మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా పేర్కొనవచ్చు. జలియన్ వాలాబాగ్‌లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే.. అదే ఖర్సావాన్‌లో సుమారు రెండు వేల మంది చనిపోయారు. 1948, జనవరి 1న స్వతంత్ర భారతదేశంలో ప్రజలు మొట్టమొదటి నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న సందర్భంలో బిహార్ (నేటి జార్ఖండ్)లోని ఖర్సావాన్ గోలికండ్ ప్రాంతమును ఒడిశాలో విలీనం చేయడాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు. గిరిజనులు అధికంగా ఉండే సెరైకెలా ఖర్సావాన్ జిల్లాలోని ఖర్సావాన్‌ను ఉమ్మడి బిహార్‌లోనే చేర్చాలని ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50వేల మంది గిరిజనులు ఆనాటి ప్రత్యేక జార్ఖండ్ ఉద్యమంలో పాల్గొన్నారు.
ఈ ఘటనను గుర్తుచేసుకొని..
వారి డిమాండ్‌ను ఒప్పుకొని అప్పటి ప్రభుత్వం ఆదివాసీలపై మిలిటరీ ఫోర్స్‌ను దింపింది. ఒరిస్సా ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పోలీసు కంటోన్మెంట్‌గా మార్చింది. యాభైవేల మంది ఆదివాసులు ఖర్సవాన్ సంత (హట్) వద్దకు చేరుకుని ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించారు. అలా గుమికూడిన వారిపై ఒడిశా మిలిటరీ పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సుమారు మూడు వేల మందికి పైగా గిరిజనులు మరణించారు. ఆ సంఘటనను గుర్తుచేసుకొని జనవరి 1 అంటేనే గిరిజనులు చాలా కాలం వణికిపోయారు. అందుకే గిరిజన సంఘాలు, జైస్ సంగతన్ జనవరి ఒకటవ తేదీని జార్ఖండ్ ఆదివాసీలు అమరవీరుల దినోత్సవంగా/ బ్లాక్ డేగా ప్రకటించాయి. దీనిపై సమగ్ర నివేదికను రాజ్యాంగ పరిషత్ సభ్యుడు జైపాల్ సింగ్ ముండా కానిస్టిట్యూట్ డ్రాప్టింగ్ కమి టీకి అందజేశారు. ఈ సంఘటన జరిగి 77 ఏండ్లు అయినా, 6 షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలలో పూర్తిగా గాని, 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలలో అసలే లభించని స్వయం ప్రతిపత్తి కోసం ఆదివాసీలు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు.
(నేడు జార్ఖండ్ ఆదివాసీ అమరవీరుల దినోత్సవం)
గుమ్మడి లక్ష్మీనారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక కార్యదర్శి.
94913 18409