దశాబ్ధి సంబురాలు ఒకవైపు… సమస్యలు మరోవైపు
Kcr plans big welfare activities for Telangana decade event!
సరిగ్గా ఇరవై ఏండ్ల కిందట దేశంలో ‘ఇండియా షైనింగ్’ (భారత్ వెలిగిపోతోంది) స్లోగన్ బాగా పాపులర్. వాజ్‌పాయి ప్రధానిగా ఉన్న సమయంలో 2004 పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ ఎంచుకున్న నినాదం అది. ఇప్పుడు తెలంగాణలో దశాబ్ది వేడుకల సందర్భంగా ఆ నినాదం గుర్తుకొస్తున్నది. టీఆర్ఎస్ పార్టీగా ఉన్నంతకాలం గులాబీ నేతలు ‘బంగారు తెలంగాణ’ నినాదాన్ని తలకెత్తుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ బీఆర్ఎస్‌గా మారిపోవడంతో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ఉనికిలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ‘దేశ్ కా నేత’అంటూ ఆకాశానికెత్తుతున్నారు.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ‘దశాబ్ది ఉత్సవాల’ను అధికార పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకునేలా ప్లాన్ చేసింది. అందుకే తొమ్మిదేళ్ల విజయాలను ఏకరువు పెడుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఒక్కటే బాగుపడిందనే విమర్శలు వస్తున్న టైమ్‌లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుంటూ జూన్ 2న పదో సంవత్సరంలోకి అడుగు పెట్టే ఉత్సవాలను జరుపుకోవాల్సిందెవరు.. జరుపుకుంటున్నదెవరు.. తొమ్మిదేళ్ళలో అభివృద్ధి చెందిందా.. లేక అప్పులపాలైందా.. లేక అవినీతిమయమైందా.. వీటిని ప్రజలు ఓపెన్‌గానే చర్చించుకుంటున్నారు.
తెలంగాణ పేటెంట్ బీఆర్ఎస్ అనేలా!
రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఊరూ వాడా అంబరాన్నంటే సంబురాలు జరగాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఖర్చుకూ వెనకాడడంలేదు. సంక్షేమ పథకాలు ప్రజలకు స్వీయానుభవం అంటూనే వాటిని విస్తృతంగా ప్రచారం చేసుకోవాలనుకుంటున్నది. కేసీఆర్ వల్లనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైందంటూ మంత్రులు పాట పాడుతున్నారు. కేసీఆర్‌ను హీరోగా కొలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణకు పేటెంట్ తరహాలో మార్చివేశారు. బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణకు దిక్కు లేదనే ప్రచారం చేసుకుంటున్నారు.
మొత్తం 21 రోజుల పాటు జరిగే దశాబ్ది వేడుకల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం చివరి రోజున జరిగేలా షెడ్యూల్ ఖరారైంది. మొదటి రోజున నివాళులర్పించే ఈవెంట్‌ను ఆఖరు రోజుకు నెట్టడం అమరులను అవమానించడమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఆయన పేరు పెట్టుకున్న సచివాలయ ప్రారంభోత్సవం బీఆర్ఎస్ పార్టీ అఫైర్‌గా జరిగిపోయాయి. ఇతర పార్టీలకు ఎంట్రీ లేదు. దశాబ్ది వేడుకల్లోనూ ఇదే రిపీట్ అవుతుందా? ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్ణాలు దశాబ్ది వేడుకల్లో ప్రేక్షకులేనా? కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ సాధ్యమైంది.. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ పేటెంట్.. అనే భావన నడుమ ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సమస్యల నడుమే ఉత్సవాలు!
ఒకపక్క రైతులు వడ్ల కొనుగోళ్ళ విషయంలో రోడ్డెక్కి దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. కష్టపడి పండించిన వరి పంట కళ్ళముందే అకాల వర్షాల్లో తడిచిపోతున్నది. చేతికొచ్చిన పంట వడగండ్లవానతో నేలపాలైంది. తాలు, తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్యాయం జరుగుతున్నది. మరోపక్క మహిళలు తాగునీటి కోసం బిందెలతో రాస్తారోకో చేస్తున్నారు. ఇంకోపక్క ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదని నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. రెండో టర్ములో నాలుగున్నరేళ్లుగా పడకేసిన పోడు భూముల పట్టాలు, సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సర్పంచ్‌లకు నిధుల విడుదల.. లాంటి సమస్యలు ఊపందుకున్నాయి. రుణమాఫీ, నిరుద్యోగ భృతి లాంటి పలు వాగ్ధానాల వైఫల్యం, మరోపక్క ధరణి పోర్టల్ తెచ్చిన చిక్కులతో సొంత భూమి ఉన్నవారు గందరగోళంలో పడ్డారు. సమస్యలను చెప్పుకునే దిక్కులేక ప్రజల వేదన అరణ్య రోదనగా మారింది. రాష్ట్రంలో పరిష్కారానికి నోచుకోని సమస్యల నడుమ జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలు ప్రజలకా.. పాలకులకా? అనే చర్చ మొదలైంది.
మౌలిక సౌకర్యాలపై చిన్నచూపు
రైతు వేదికలు, కల్లాలు, గోదాములు నిర్మించామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు తడవకుండా ఏర్పాటు చేయలేకపోయింది. ఇన్ని ఉన్నా ఆపదకాలంలో రైతులకు అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. పబ్లిసిటీ కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం కనీస సౌకర్యాలను కల్పించలేకపోయింది. ఆసరా పింఛన్లు ఎప్పుడొస్తాయో తెలియదు. పల్లె ప్రగతి ఇలా ఉంటే పట్టణాల్లో గంట సేపు వాన కురిస్తే బండ్లు ఓడలవుతున్నాయి. పిల్లలు నాలాల్లో కొట్టుకుపోతున్నారు. వేల కోట్ల రూపాయలు సిటీ డెవలప్‌మెంట్‌కు ఖర్చు పెట్టినా అంబులెన్స్ పోయే దిక్కు లేక ట్రాఫిక్ సమస్య వెక్కిరిస్తున్నది.
అమలుకాని హామీల ఊసెత్తని సర్కారు ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌లంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. రైతులకు రుణ మాఫీ, దళితబంధు, కల్యాణలక్ష్మి బిల్లుల పెండింగ్, ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ.. ఇలాంటి పదుల సంఖ్యలో వాగ్ధానాలు అటకెక్కాయి. ప్రశ్నించే గొంతులకు స్థానం లేకుండా పోయింది. సెక్రటేరియట్ కేవలం అధికార పార్టీకే పరిమితమైంది. నిరసనలు చేయాలంటే కోర్టుల నుంచి పర్మిషన్ తప్పనిసరి షరతుగా మారింది. జీవోలు పబ్లిక్‌లోకి రాకుండా రహస్య డాక్యుమెంట్లయ్యాయి. సమ్మె చేసే ప్రజాస్వామిక హక్కు ప్రశ్నార్థకంగా మారింది. సమస్యలను పరిష్కరించని ఎమ్మెల్యేలు, మంత్రులను అడ్డుకోవడం ప్రజలకు ఏకైక మార్గమవుతున్నది.
రాజభక్తి ప్రదర్శిస్తే చాలా!
సర్కారు ఉద్యోగులకు సకాలంలో జీతాలకే దిక్కు లేదు. ఇన్‌స్టాల్‌మెంట్ శాలరీ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. ఇచ్చినప్పుడు తీసుకునే ప్రాక్టీస్ కొనసాగుతున్నది. సమ్మె చేస్తే సర్వీసు నుంచి డిస్మిస్ అవుతున్నారు. దయతలచి ఇస్తే తీసుకోవాలనే విధానం తెరమీదకు వచ్చింది. కొత్త జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు, సచివాలయం నిర్మాణం ఆగమేఘాల మీద పూర్తయినా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మాత్రం అరచేతిలో వైకుంఠంగా మారాయి. కమిషన్లు ఇస్తే లబ్ధిదారుల జాబితాలో పేరెక్కుతుంది. ఏడేండ్లయినా ఇండ్లు మంజూరు కావడంలేదు. కట్టిన ఇండ్లు అలంకారానికి పరిమితమయ్యాయి.
ఎమ్మెల్యేలకు మూడు లక్షలు ఇస్తే దళిత బంధు కింద పది లక్షలు మంజూరవుతుంది. కడుపు కట్టుకుని, అవినీతి లేకుండా పాలన అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రే ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పైసా విదల్చనిదే పనులు కావడంలేదు. రెవెన్యూ అధికారులకు లంచం ఇవ్వకుంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా పుట్టదు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తే ఎన్ని అవినీతి ఆరోపణలొచ్చినా వారి స్థానం పదిలం. అధికారులైనా, సొంత పార్టీ నేతలైనా ఎస్ సర్.. అంటూ వినయ విధేయతలు ప్రదర్శిస్తే అంతా సబ్ కుచ్ ఠీక్ హై.
పట్టణాల్లో కనీస సౌకర్యాల కల్పనకు నిధులు వెచ్చించని పురపాలక శాఖ సుందరీకరణకు మాత్రం కోట్లు తగలేస్తున్నది. బంజారాహిల్స్ లోని సంపన్నులు తాగే మిషన్ భగీరథ నీరే మారుమూల గ్రామాల్లోని బంజారా ఆవాసాలకు కూడా అందిస్తున్నట్లు చెప్పుకుంటున్నది. కానీ ప్రభుత్వాఫీసుల్లో, అధికారుల సమావేశాల్లో ఈ నీరు మచ్చుకైనా కానరాదు. సర్కారు ఆస్పత్రుల్లో కార్పొరేట్ సేవల సంగతేమోగానీ గ్రామీణ ప్రాంతాల్లో కాన్పులకు దిక్కు లేకుండాపోయింది. మంత్రుల రికమెండేషనో, ట్విట్టర్‌లో పైరవీలు ఉంటేనే మంచి వైద్యం.
సమాధానం దొరకనివి!
తొమ్మిదేళ్ల కాలంలో వందేళ్ల అభివృద్ధి జరిగిందని అధికార పార్టీ నేతలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. తిష్ట వేసిన సమస్యల పరిష్కారంపై మౌనమే సమాధానమైంది. గ్రామాల్లో పర్యటన సందర్భంగా ప్రజలు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. అధికారిక కార్యక్రమాల సందర్భంగా ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. దశాబ్ది ఉత్సవాలు గులాబీ పార్టీకి మాత్రమే సంబంధించినవా? ఉద్యమకారులు, ఉద్యమానికి మద్దతిచ్చిన విపక్షాలూ పాలు పంచుకోవాల్సినవా? అమరవీరుల కుటుంబాలకూ ప్రాధాన్యత ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ జూన్ 22తో ముగిసే ఉత్సవాల ద్వారా సమాధానం లభిస్తుంది.
ఎన్. విశ్వనాథ్
99714 82403