కథా సంవేదన:పెట్టె విప్పడం
kathasamvedhana story by mangari rajendar jumbo
సిరిసిల్లకి మా వేములవాడ దగ్గరే. అయినా కోర్టు సిరిసిల్లలో వుండటం వల్ల నా ఆఫీసూ, ఇల్లు సిరిసిల్లలో పెట్టాను. కోర్టు దగ్గరలో ఓ ఇల్లు కిరాయకు తీసుకున్నాను. ఆ సందులో మాది మూడో ఇల్లు. అది కొత్తగా కట్టినది. మా ఇంటి పక్కన ఓ రైతు కుటుంబం వుండేది. అంతకుముందు ఓ సీనియర్ న్యాయవాది ఇల్లు వుండేది. మేముండేది ఇద్దరమే.ఓ రోజు ఉదయం భాజా భజంత్రీ శబ్దం దగ్గరగా వినిపించింది. అంటే ఆ శబ్దం మా సందులోకి వస్తున్నట్టు అన్పించి, మేమిద్దరం ఉత్సహంగా బయటకు వచ్చాం. మా పక్కింట్లో వున్న పెద్దావిడను ఎదుర్కొని తీసుకొని వస్తున్న సన్నివేశం కన్పించింది.
మాకు ఆశ్చర్యం వేసింది. ఆమెను ఆ వయస్సులో అంత గౌరవంగా ఎందుకు తీసుకొని వస్తున్నారో మాకు అర్థం కాలేదు. మా ఆవిడ వుండబట్టలేక వాళ్ళని ఇలా అడిగింది. 'ఎందుకూ భాజా భజంత్రీలతో ఆమెను తీసుకొని వస్తున్నారు.' 'ఏం లేదు అక్కా! మా నానమ్మ కాశీ నుంచి ఈ రోజే ఇంటికి వస్తోంది. అందుకని అలా తీసుకొని వస్తున్నాం. అని చెప్పింది ఆ పెద్దావిడ మనమరాలు. ఇది నలభై సంవత్సరాల క్రితం మాట. ఇంతలో వాళ్ళ అమ్మ మా దగ్గరికి వచ్చి 'ఏం లేదు అమ్మా! కాశీకి పోయి రావడం అంత సులువైన పని కాదు కదా! అందుకని ఇంత గౌరవంగా ఇంటికి తీసుకొని వస్తాం' అంది. మేమిద్దరం కొంత ఆశ్చర్యపోయాం.మేం ఆశ్చర్యపోవడం చూసి ఆమె నవ్వి వెళ్ళిపోయింది.
తెల్లవారి మా ఆవిడకి ఆమె కన్పించినప్పుడు ఇలా చెప్పింది. 'ఇంకా పెట్టె విప్పలేదు. మంచి రోజు చూసి పెట్టె విప్పిన తరువాత మాకు కాశీ ప్రసాదం తెచ్చి ఇస్తాను.' పెట్టె విప్పడం ఏమిటో మా ఆవిడకు అర్థం కాలేదు. వాళ్ళ మాటలు ఆఫీసు రూంలో కూర్చున్న నాకు స్పష్టంగా విన్పిస్తున్నాయి. నేను చెవులు రిక్కించి సంభాషణ వినడం మొదలు పెట్టాను. 'పెట్టె విప్పడం అంటే ఏమిటి?' అడిగింది మా ఆవిడ ఆమెను. 'ఏం లేదు అమ్మా! కాశీ నుంచి వచ్చిన పెట్టెను ఓ మంచిరోజు చూసి కొబ్బరికాయ కొట్టి మా అత్త విప్పుతుంది. అంతేకాదు ఆ రోజు తలస్నానం చేసి మంచి నీళ్ళు తాగకుండా పూజ చేసి పెట్టె విప్పుతుందట మా అత్త. ఇదే ఆచారం' అని చెప్పింది ఆమె మా ఆవిడతో.
మా ఆవిడ మరేం ప్రశ్నలు వేయకుండా ఆమె చెప్పింది విన్నది. కాసేపు అయిన తరువాత ఇంట్లోకి వచ్చింది. విన్నారా! అన్నట్టు నా వైపు చూసింది. చిన్నగా నవ్వాను అంతా విన్నానని అన్నట్టు. ఓ మూడు రోజులు గడిచిన తరువాత ఓ ఉదయం పూట బెల్ కొట్టిన శబ్దం వినిపిస్తే మా ఆవిడ వెళ్ళి తలుపు తీసింది. నేను అప్పుడే స్నానం చేసి రెడీ అవుతున్నాను. ఎదురుగా మా పక్కింటి పెద్దావిడ పెద్దకోడలు. ఒక చేతిలో ప్రసాదం. మరో చేతిలో అన్నపూర్ణ దేవి విగ్రహం. 'తీసుకో అమ్మా!' అంది మా ఆవిడ అవి రెండూ భక్తి శ్రద్దలతో తీసుకుంది. 'పెట్టె ఎప్పుడు విప్పారు?' అడిగింది కుతూహలంగా. 'పూజ చేసి ఇంతకుముందే మా అత్త పెట్టెను విప్పింది. పొద్దున్నే తలస్నానం చేసి కొబ్బరికాయ కొట్టి పెట్టెను విప్పి ప్రసాదాలను అక్కడ కొన్న వస్తువులను బయటకు తీసింది. ముందుగా మీకే ఇచ్చి రమ్మని చెప్పింది మా అత్త'. చెప్పింది ఆమె. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. పెట్టె విప్పడం అన్న విషయం మా ఇద్దరికి ఆశ్చర్యంగా అనిపించింది. నేను ప్రక్కనే వున్న న్యాయవాదిని కాబట్టి ముందుగా మాకు పంపించిందని అనుకున్నాం. ఇద్దరం భక్తి శ్రద్దలతో ప్రసాదాలని తీసుకున్నాం.
మా ఇంటి పక్కన వున్న వాళ్ళు రైతుకుటుంబమే అయినా కాస్తా స్థితిమంతులు. మంచి వ్యవసాయం ఉంది. ముగ్గురు కొడుకులు. అందరి పెళ్ళిళ్ళు అయినాయి. కొంత వరకే చదువుకున్నారు. అందరూ వ్యవసాయపు పనులే చేసుకుంటారు. వాళ్ళ తండ్రి చనిపోయి ఓ అయిదు సంవత్సరాలు అయింది. అప్పుడప్పుడు ఏవైనా న్యాయ సలహా కోసం వస్తుంటారు. కొత్త పంట ఏదైనా వస్తే కొంత తెచ్చి ఇస్తూ ఉంటారు. ఓ ఆరు మాసాలు గడిచిపోయాయి. ఓ రెండు మూడు మాసాలు పెట్టె విప్పడం గురించి సరదాగా మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఆ తరువాత ఆ విషయాన్ని మర్చిపోయాం.
ఓ రోజు ఉదయం ఏడుపులు విన్పిస్తే బయటకు వచ్చి చూశాను. మా పక్కింటి నుంచే ఆ ఏడుపులు విన్పిస్తున్నాయి. ఏం జరిగిందని లోపలికి వెళ్ళి చూశాను. ఆ పెద్దావిడ చనిపోయింది. రాత్రి నిద్రలో చనిపోయిందో ఎప్పుడు చనిపోయిందో తెలియదు. సుఖంగా చనిపోయింది. విషయం తెలిసి మా ఆవిడ కూడా అక్కడికి వచ్చింది. ఇద్దరం ఆ పెద్దావిడకి ఓ దండం పెట్టి మా ఇంటికి వచ్చేశాం. స్నానం వగైరా పనులు ముగించుకొని కోర్టుకి వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చిన తరువాత ప్రక్కింటి ఆవిడ గురించి అడిగాను. మధ్యాహ్నం వరకే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయని మా ఆవిడ చెప్పింది.
సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఇంటి ముందు రెండు కుర్చీలు వేసుకొని టేప్ రికార్డర్ లో ముఖేశ్ పాటలు వింటూ కూర్చున్నాం. కాసేపటి తరువాత గట్టి గట్టి మాటలు విన్పించాయి. టేప్ రికార్డర్ ఆఫ్ చేశాను. అది ఏడుపు కాదు ఏదో విషయం గురించి ఘర్షణ పడుతున్నట్టు అన్పించింది. వాళ్ళ మాటల్లో వకీల్ సాబ్ అన్న మాటలు వినిపించడం తో నేను వారి మాటల వైపు నా దృష్టిని సారించాను.
'మేం లేకుండా అమ్మ పెట్టె ఎలా విప్పుతావు' ప్రశ్నిస్తున్నాడు రెండో కొడుకు తన అన్నని. మూడవ వాడు రెండో అన్నని సమర్ధిస్తున్నాడు. 'అందులో ఏమి లేవురా! ఈ పెద్ద గొలుసు తప్ప' జవాబు చెబుతున్నాడు పెద్దవాడు. 'అందులో యాభై తులాల వరకు బంగారం వుండాలి. ఇరవై వేల దాకా డబ్బులు కూడా ఉండాలి. నువ్వు తీసి ఎక్కడో దాచిపెట్టావు' గట్టిగా నిలదీస్తున్నాడు రెండోవాడు. ఇదొక్కటే వుంది. అందులో మరేమి లేవు. మళ్ళీ అదే జవాబు పెద్దవాడి దగ్గరనుంచి. 'మాకు తెలియకుండా, మేం లేకుండా నువ్వు పెట్టె ఎలా విప్పావు.' మళ్ళి గట్టిగా ప్రశ్నించారు ఇద్దరు తమ్ముళ్ళు అన్నను. విషయం అర్థమైంది నాకు.
తలస్నానం చేసి ఆరు మాసాల క్రితం కాశీ నుంచి వచ్చిన ఆ పెద్దావిడ భక్తి శ్రద్ధలతో మంచి రోజు చూసి పూజ చేసి పెట్టె విప్పింది. ఆ శివుడి దగ్గరకు వెళ్లిన పెద్దావిడ వెళ్ళిపోయిన రోజునే ఆమె పెట్టెను విప్పాడు పెద్ద కొడుకు. అదీ ఇద్దరు తమ్ముళ్ళకి తెలియకుండా. ఎంత తేడా పెట్టెలు విప్పడంలో.
మంగారి రాజేందర్ జింబో
94404 83001
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672
Also Read..