పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా స్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు – “రాజా! కష్టపడితే పడ్డావు కానీ నీకు కష్టం తెలియకుండా ఉండటానికి ప్రేమ అన్న ఓ కథ చెబుతాను, విను'' అంటూ చెప్పసాగాడు.
వేములవాడ అనే వూరిలో భీమన్న గుడి వుంది. ఆ గుడిలో ఓ తోట వుండేది. దాని తోటమాలి పోచెట్టి. గుడిలో పూచిన పూలని తెంపి రాజరాజేశ్వర స్వామికి పంపించడం, ఆ తోటని సంరక్షించడం అతని డ్యూటి. ఆ తోటలో రెండు జామచెట్లు తప్ప మిగతావి అన్నీ పూల చెట్లే. ఇంట్లో పిల్లలని చూసినంత ప్రేమగా ఆ చెట్లని చూసుకునేవాడు. బాగా పూలు పూచినప్పుడు అతని మనస్సు పొంగిపోయేది. పోచెట్టి ఎప్పుడన్నా ఓ వారం రోజులు ఏదైనా ఊరికి పోతే ఆ పూల చెట్లు ఎంతగా వికసించాలో అంతగా వికసించేవి కాదు. ఆయన లేనప్పుడు కూడా మరో తోటమాలి చెట్లకి నీళ్లు పట్టేవాడు. కానీ ఎందుకో అలా జరిగేది.
ఆ గుడి ముందు ఓ మిడిల్ హై స్కూల్ వుండేది. ఆ స్కూల్‌లో రాజేందర్ అనే పిలగాడు చదువుతుండే వాడు. ఆ విషయం అతనూ విన్నాడు. పోచెట్టి వచ్చిన తరువాత ఆ విషయం అతనికి చెబితే నవ్వేవాడు తప్ప మరేమీ మాట్లాడకపొయ్యేవాడు. పోచెట్టి వున్నప్పుడు చెట్లు పూలు విరివిగా పూయడం సహజమని, పూర్తిగా విచ్చుకోవడం కూడా సహజమని అందరూ అనేవాళ్లు. వాళ్ల బడి లో కూడా ఆ విషయమే మాట్లాడుకునేవారు. అది ఆ పిలగానికి వింతగా అన్పించేది. పోచెట్టి వున్నప్పుడే పూలు బాగా వికసిస్తాయని అందరూ అనుకోవడం విచిత్రంగా కూడా అనిపించేది. అతని సందేహం అలాగే వుండిపోయింది. ఆ పిలగాని బడిని అక్కడి నుంచి తరలించారు. ఆ తరువాత అతను ఆ విషయం మరిచిపోయాడు.
ఓ యాభై సంవత్సరాల తరువాత ఆ పిలగాని ఇంట్లో అతని భార్య చాలా పూల చెట్లని పెంచింది. వాటిని ఆమె ఎంతో ఇష్టంగా పెంచేది. ప్రేమ పూర్వకంగా చూసుకునేది. ఆ చెట్లు కూడా ఆమె వున్నప్పుడు బాగా పూచేవి. ఆమె ఎప్పుదైనా వూరికి వెళ్లితే అంత బాగా పూచేవి కాదు. పనిపిల్ల రోజూ నీళ్లు పోసినా అదే పరిస్థితి. పువ్వులు బాగా పూచేవి కాదు. బాగా వికసించేవి కాదు. కారణం ఏమిటో అతనికి అర్థం కాకపోయేది. అతని చిన్నప్పటి భీమన్న గుడి అక్కడి తోటా, పోచెట్టి గుర్తుకు వచ్చేవారు.
అప్పుడు కూడా ఇలాగే వుండేది. దీనికి కారణం ఏమిటీ. ఈ విషయం నాకు కూడా అర్థం కాలేదు. దానికి కారణం ఏమిటి.. అతని సందేహాలకి సమాధానం చెప్పు. ఈ సందేహాలకు సమాధానాలు తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది” అన్నాడు బేతాళుడు.
దానికి విక్రమార్కుడు- “బేతాళా, పోచెట్టి నీళ్లనే కాదు ఆ పూల చెట్లకి ప్రేమని కూడా పంచుతాడు. అతని భార్య కూడా చేసిన పని అదే. అందుకనే అవి విరివిగా పూస్తాయి.. అతనికి ఈ విషయం నిజమని అన్పించక పోవచ్చు. కానీ ఇదే నిజం.
బేతాళా.! ప్రేమను వివరించలేం. కానీ వ్యక్తపరచగలం. ప్రేమ అనే అనుభూతిని అందరూ కోరుకుంటారు. అవి జంతువులు కావొచ్చు. మనుషులు కావొచ్చు. చెట్లూ, వృక్షాలు కావొచ్చు. మనకు భాష ఉంది కాబట్టి మనం మాటల ద్వారా, మన చర్యల ద్వారా ఆ ప్రేమని వ్యక్తపరుస్తున్నాం. కానీ చెట్లు అలా వ్యక్తపరచలేవు. కొంత మేరకు జంతువులు తమ ప్రేమని, బాధని వ్యక్తపరచగలవు. వాళ్ల ఇంట్లో వున్న కుక్కను చూడు అతను రాగానే ఎగిరి మీద పడి తన సంతోషాన్ని, ప్రేమని వ్యక్తపరుస్తుంది. అట్లాగే అతను దాన్ని నిమురుతూ, ఆడుతూ తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి. దాన్ని జంతువులు అర్థం చేసుకుంటాయి. వ్యక్తపరుస్తాయి. అదే విధంగా ప్రతిస్పందిస్తాయి. అనుభూతి చెందుతాయి.
మనుష్యుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మాటల ద్వారా చేతల ద్వారా వ్యక్తపరుస్తారు. మనుషులకున్న సౌలభ్యం జంతువులకి లేదు. జంతువులకి వున్న సౌలభ్యం చెట్లకి లేదు. పోచెట్టి కావొచ్చు, అతని భార్య కావొచ్చు, ప్రతి చెట్టు దగ్గరకు వెళతారు. అన్నింటినీ చూస్తారు. చేతులతో ప్రేమగా నిమురుతారు. వాళ్లు వాటికి నీటినే కాదు. తన ప్రేమని పంచుతున్నారు. అందుకే అవి వాళ్లు వున్నప్పుడు విరగబూస్తున్నాయి.
ప్రేమ అనేది ప్రశాంతతకి మూలధాతువు. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్లు ఎక్కువ ప్రశాంతంగా ఉంటారు. కోపంతో వున్న వ్యక్తి ప్రేమపూర్వకంగా మాట్లాడితే ప్రశాంతంగా మారతాడు. బాధలో వున్న వ్యక్తికి ఓ ప్రేమపూర్వకమైన కౌగిలింత ఎంతో ఊరటని కలిగిస్తుంది. ఇదీ విషయం బేతాళా! అని చెప్పాడు.
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టు ఎక్కేసాడు.
- మంగారి రాజేందర్ జింబో
94404 83001