కమలానికి పాఠం కాంగ్రెస్‌కు ఊతం
Karnataka poll results is a boost for Congress
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు అక్కడి ప్రజానీకం. రాష్ట్ర పాలనా పగ్గాలు 'చేతికి' అందించి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ మీద నమ్మకం నిలిపారు. బీజేపీ జైత్రయాత్రకు బ్రేక్ వేశారు. మొదటి నుంచి అక్కడి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రానున్నట్టు అంచనాలు ఎక్కువే ఉన్నప్పటికీ ఈ తరహా ఘనవిజయం మాత్రం ఎవరూ ఊహించలేదు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలను ప్రతి ఎన్నికలకీ మార్చి ఇవ్వడం 1985 నుండీ ఆనవాయితీ. ఈసారి ఆ ఆనవాయితీని తిరగరాసేలా అధికారంలో ఉన్న బీజేపీ ఏమీ అద్భుతాలు సృష్టించలేదు. పైగా అవినీతి ముద్ర, భావోద్వేగాల అంశాలపై అతిగా ఆధారపడే ధోరణి, బలహీనమైన రాష్ట్ర నాయకత్వం ఆ అవకాశాన్ని మరింత క్లిష్టతరం చేశాయి. కనుకనే జాతీయ నాయకత్వం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రధాని,హోమ్ శాఖ మంత్రి ప్రచారాన్ని భుజాలపై వేసుకున్నా ఫలితం లేకపోయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా, సమైక్యంగా కదిలి ఉన్న అవకాశాలను పొదివి పట్టుకుంది. రాహుల్ జోడో యాత్ర సాగిన ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం అందుకు ఉదాహరణ. జేడీఎస్ సాంప్రదాయక ఓట్లు తనవైపుకు విజయవంతంగా తిప్పుకుంది. జేడీఎస్ ఐదు శాతం ఓట్లు గతం కన్నా కోల్పోగా, అంతే శాతం ఓట్లు కాంగ్రెస్‌కి కలవడం విశేషం. బీజేపీ ఓట్ల శాతం తగ్గకపోయినా మూడో వంతు సీట్లను కోల్పోయింది. ఎన్నికల హామీలు కూడా కాంగ్రెస్ తరపున ఎక్కువగా సంక్షేమానికి సంబంధించినవే. నిరుద్యోగం, కరోనా తదుపరి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు తమ సంక్షేమం పట్ల ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. విజయాలకైనా, అపజయానికైనా పలు కారణాలుంటాయి. పలు కోణాలుంటాయి.ఎవరు ఏది ముఖ్యమనుకున్నా చివరకు అర్థం కావాల్సింది ఒకటే... రాష్ట్ర ఎన్నికల్లో అక్కడి పాలన, స్థానిక అంశాలకే ప్రాధాన్యత ఎక్కువ. జాతీయ అంశాలు, జాతీయ నాయకుల ఇమేజ్ కలిసొచ్చే అంశాలే కానీ వాటికవే నిర్ణయాత్మకం కాదు. వచ్చే సాధారణ ఎన్నికల్లో, పాల్గొనబోయే ప్రధాన పార్టీలకు ఈ ఫలితాల ద్వారా నేర్చుకోవాల్సిన వాళ్లకి నేర్చుకున్నంత.
- డా. డి.వి.జి.శంకర రావు
94408 36931