కల్కి… ఓ సాంకేతిక విప్లవం

పాన్ ఇండియా స్టార్‌గా ‘బాహుబలి’తో ప్రభాస్ కీర్తి సంపాదించుకున్నాడు. అందుకు తగిన కథలనే ఎంచుకుంటున్నాడు. ‘మహానటి’తో దర్శకుడు

Update: 2024-06-30 01:00 GMT

పాన్ ఇండియా స్టార్‌గా ‘బాహుబలి’తో ప్రభాస్ కీర్తి సంపాదించుకున్నాడు. అందుకు తగిన కథలనే ఎంచుకుంటున్నాడు. ‘మహానటి’తో దర్శకుడు నాగ్ అశ్విన్ జాతీయస్థాయిలో తనదైన ముద్రను వేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడి’ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఇది మూడు కాలాల కథ. మహాభారతం, భవిష్యత్తులను వర్తమానంలో చూపించే ఓ సాంకేతిక మాయాజాలం. ‘అవతార్’ ‘టెర్మినేటర్’ వంటి సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులకు అటువంటివి తెలుగులో తీయగలరా అనే విభ్రమ ఉండేది. నాగ్ అశ్విన్, అశ్వినీదత్ వాస్తవంగా తీసి చూపించారు. వారి ‘గట్స్’కి మెచ్చవలసిందే.

పూర్తిగా దర్శకుడి సినిమా

‘కల్కి’ పూర్తిగా దర్శకుడు సినిమా. హాలీవుడ్ ప్రపంచ స్థాయి సాంకేతికతకు మహాభారత కథను అద్ది తనదైన శైలిలో ‘కథనం’ (అక్కడక్కడ ‘డ్రాగ్ ఉన్నా’) ఆసక్తికరంగా నడిపించడం ప్రశంసనీయ ప్రయోగమే. సినిమా చూసే సగటు ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్తాడు కథానాయకుడు ‘ప్రభాస్’ తెరపైకి వచ్చేటప్పటికి కాస్త ‘సమయం’ తీసుకున్నాడు. కానీ… ఒక్కసారి వచ్చాక ‘ఎలివేషన్ సీన్స్’కు లెక్కలేదు. చిన్నపిల్లలు సహితం ముచ్చటపడే ‘కామిక్ టచ్’తో ప్రభాస్ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారు. మొదటి ఫైట్, దిశాపటానీతో చేసిన సందడి, సుమతి పాత్ర (దీపిక)తో ముడిపడిన పతాక సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి ‘కిక్కునిస్తాయి’. క్లైమాక్స్‌లో వచ్చే ‘ట్విస్ట్’ సహితం వారు ఊహించినదిగా ఉంటుంది. రెండోభాగం ఉందనే విషయంతో మొదటి భాగం ‘శుభం’.

కథ ఏమిటి?

6000 సంవత్సరాల క్రితం మహాభారతంలో అశ్వత్థామ ఉత్తర గర్భం విచ్ఛిన్నం చేసే సమయంలో ‘నారాయణుడు’ దానిని కాపాడతాడు. అశ్వత్థామను ‘మానని గాయాలతో ఇలా చావు లేకుండా పడి ఉండు’ అని శపిస్తాడు. ‘నా వచ్చే అవతారంలో తల్లి గర్భంలో ఉన్న నన్ను కాపాడి పుణ్యాన్ని మూటగట్టుకొంటావని’ శాప విమోచన సూత్రం చెబుతాడు. ఇది జరిగిన తర్వాత 2898వ సంవత్సరంలో ‘కలి’ ప్రభావంతో ప్రపంచం నిర్వీర్యం అయిపోతుంది. భూమిపై మిగిలిన ప్రాంతాలు మూడే. కాశి, శంబల, కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ తిరగబడ్డ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. సకల సౌకర్యాలు కాంప్లెక్స్ పరమవుతాయి. దీనిపై ఆధిపత్యం కోసం శంబల వాసుల పోరాటం, కాశీ వాసులు సహితం ప్రయత్నాలు చేస్తారు. వీరిలో భైరవ (ప్రభాస్) ఒకడు. అతనికి యూనిట్స్ (డబ్బు) కావాలి. కాంప్లెక్స్‌లో చోటు కావాలి. అవసరమైతే తప్పులు చేస్తాడు. కాంప్లెక్స్‌ను పాలించే రాజు ‘సుప్రీమ్ యాస్కిన్’ (కమలహాసన్) ప్రతినాయకుడు. భయంకరమైన రూపం. ఒకవైపు పరమాత్మ రాక కోసం ఎదురుచూసే అశ్వత్థామ (అమితాబ్), మరోవైపు సుమతి అనుకోని పరిస్థితిలో దాల్చిన గర్భం (దీపిక), భైరవ వీరి మధ్య ఉద్భవించిన అనేకానేక ప్రశ్నలకు రూపమే ఈ చిత్రం. పాత్రధారులు ‘ప్రముఖులు’. కొన్నిచోట్ల కథ సాగదీస్తున్నట్టు ఉంటుంది.

ఆయన నటనకు దండం పెట్టొచ్చు

దర్శకుడు కథ మొత్తం అమితాబచ్చన్, దీపికా పడుకోన్ చుట్టూనే అల్లుకున్నాడు అనిపిస్తుంది. అమితాబ్ నటన, ఇమేజ్ ఈ చిత్రాన్ని నిలబెట్టాయనవచ్చు. ఆ వయసులో ఆయన నటనకు చేతులెత్తి నమస్కరించవలసిందే.. ఇక ‘కల్కి’ పాత్రలో ‘ప్రభాస్’ తప్ప వేరొకరిని ఊహించలేం. కమల్ పాత్ర యాస్కిన్ పరిధి తక్కువే అయినా పాత్ర పరిచయం, పాత్రలోని వివిధ కోణాలను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. సినిమా మూడు గంటల నిడివి. అలా వచ్చి ఇలా మెరిసి’పోయే’ పాత్రల్లో విజయ్ దేవరకొండ (కర్ణుడు), రాంగోపాల్ వర్మ, రాజమౌళి, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం కనిపిస్తారు. వీరు కనిపించిన ఆ కాస్త సమయంలో ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు.

ట్రూ వరల్డ్ క్లాస్ సినిమా

సాంకేతిక బృందం ‘కల్కి’ ట్రూ వరల్డ్ క్లాస్ సినిమా. ఇందుకు ఛాయాగ్రాహకుడు జార్జ్ స్టాజికోవిచ్ మంచి ప్రతిభను కనబరిచారు. నారాయణ సంగీతంలో పాటలు సో.. సో.. గాని బీజేఎం మాత్రం అదుర్స్. ఆర్ట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రైటర్ కమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ రాసుకున్న కథలో ‘లేయర్స్’ ఎక్కువ. కానీ చెప్పే విధానంలో మరింత సరళత అవసరం. తెలుగు సినిమాలో ‘కల్కి’ వంటి ప్రొడక్షన్ డిజైన్ విజువల్స్ ఇంతవరకు ప్రేక్షకులు చూసి ఉండరనేది నిజం. కానీ సినిమా అంటే ఆ ఒక్కటే కాదనేది సినీ పండితుల వ్యాఖ్య. 600 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం సగటు ప్రేక్షకునికి ఏ స్థాయిలో చేరుతుందో గమనించవలసిందే.

సినిమా: కల్కి

నిర్మాత: సి. అశ్వినీదత్

కథ, దర్శకత్వం: నాగ్ అశ్విన్


భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Tags:    

Similar News