ఆయన న్యాయవ్యవస్థను క్రమబద్దీకరించగలరా?
ఆయన న్యాయవ్యవస్థను క్రమబద్దీకరించగలరా?... justice chundrachud streamline the judiciary
భారతదేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఏర్పడక ముందు 'ఫెడరల్ కోర్డు ఆఫ్ ఇండియా' అత్యున్నత న్యాయస్థానం గా ఉండేది. ఫెడరల్ కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకోవాలంటే లండన్‌లో ప్రీవీ కౌన్సిల్‌కు వెళ్లవలసి వచ్చేది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీంకోర్టును అత్యున్నత న్యాయస్థానంగా, రాష్ట్రస్థాయిలో హైకోర్టులను ఉన్నత న్యాయస్థానాలుగా ఏర్పాటు చేసుకున్నం. సుప్రీంకోర్టుకు జస్టిస్ హెచ్.జె.కానియా మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ డి.వై చంద్రచూడ్ 50వ చీఫ్ జస్టిస్‌గా నవంబర్ 9 న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. యాదృచ్ఛికంగా ఆ రోజు 'న్యాయసేవల దినోత్సవం' కావడం విశేషం.
ఆ విమర్శ తొలగించుకునేందుకు
దేశంలోని అన్ని కోర్టులలో కలిపి 46 మిలియన్‌ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. కేసుల సత్వర పరిష్కారానికి కోర్టుల పని దినాలు పెంచాలి. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సంవత్సరంలో 193 రోజులు, హైకోర్టుకు 210 రోజులు పనిదినాలు. శనివారాలు, పండుగ రోజులు కాకుండా 45 రోజులు వేసవి సెలవులు, 15 రోజులు శీతాకాలం సెలవులు, వారం రోజులు హోళీ సెలవులు ఉంటాయి. వారంలో ఐదు రోజులు. ఐదున్నర గంటలు మాత్రమే పనిచేస్తాయి. అందుకే దేశంలో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు కోర్టు ఆ విమర్శను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి సెలవులు తగ్గించేలా చర్యలు చేపట్టాలి.
పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రెండు మూడేళ్లు తాత్కాలిక ప్రాతిపదికన నియమించి వారి సేవలు వినియోగించుకోవాలి. న్యాయమూర్తులకు కూడా నిర్ణీత సమయంలో విచారణ ముగించే విధంగా నిబంధన విధించాలి. దేశంలోని ప్రతి కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుల సంఖ్యను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. న్యాయమూర్తుల వద్ద జూనియర్‌గా పనిచేసినవారి కేసులు, న్యాయవాదులుగా ఉన్న బంధువుల కేసులు విచారించకూడదనే నియమాన్ని పాటించేలా చూడాలి. ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ఆస్తుల వివరాలు, న్యాయవాదులుగా ఉన్న బంధువుల వివరాలు ప్రధాన న్యాయమూర్తికి రాత పూర్వకంగా వెల్లడి చేయాలి. కొలీజియం ప్రక్రియను తొలగించి ఇతర ఉన్నత పదవుల వలె పారదర్శకతతో న్యాయమూర్తుల నియామకాలు జరిగేలా చట్టం తేవాలి.
వినూత్న తీర్పుల మాదిరిగా
జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 10 నవంబర్ 2024 దాకా పదవిలో ఉంటారు. ఆయన బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా, అలహాబాద్ ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దాదాపు 22 సంవత్సరాల పాటు సేవలందించారు. అత్యున్నత పదవిలో రెండు సంవత్సరాలు ఉండబోయే జస్టిస్ చంద్రచూడ్ న్యాయ వ్యవస్థకు, కక్షిదారులకు సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. న్యాయమూర్తుల సంఖ్య పెంపు, కోర్టులలో మౌలిక సదుపాయాల పెంపు, కాలపరిమితితో కేసుల సత్వర పరిష్కారం, లా కమిషన్ ప్రతిపాదనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.
సాంకేతికత వినియోగంలో న్యాయవ్యవస్థ వేగం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను మాత్రమే పరిష్కరించేలా, హైకోర్టులో తీర్పులపై సివిల్, క్రిమినల్ అప్పీళ్లు విచారించడానికి దేశంలోని నాలుగు ప్రాంతాలలో అప్పిలేట్ కోర్టులు నెలకొల్పితే కక్షిదారులకు న్యాయం సత్వరమే అందడం కాకుండా సుప్రీంకోర్టు మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటికే జస్టిస్ చంద్రచూడ్ వెలువరించిన వినూత్న తీర్పుల మాదిరిగా వారి హయాంలో దిశానిర్దేశం చేసే పరిపాలనా సంస్కరణలకు ఆస్కారముంటుందని ఆశిద్దాం.
తడకమళ్ల మురళీధర్
విశ్రాంత న్యాయమూర్తి
98485 45970