మండలానికో..జూనియర్ కళాశాల అవశ్యం

Junior College required for every mandal

Update: 2024-01-27 00:45 GMT

గత డిసెంబర్ 30న రాష్ట్ర విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను పరిపుష్టం చేసే దిశగా నిర్ణయాలు చేయడం ముదావహం. గత ప్రభుత్వాలు విద్యార్థుల్లేక మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించడం పేద, మధ్య తరగతి పిల్లలు, తల్లిదండ్రులకు వరంలాంటిది. 

గత ప్రభుత్వం కొన్నేళ్లుగా విద్యా శాఖపై ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించకపోగా, నూతనంగా ఎన్నికైనా ప్రభుత్వం విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించడం సంతోషకరం. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలను పరిపుష్టం చేసే దిశగా నిర్ణయాలు చేయడం, గత ప్రభుత్వాలు విద్యార్థుల్లేక మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించడం పేద, మధ్య తరగతి పిల్లలు, తల్లిదండ్రులకు వరం లాంటిది.

విద్యా హక్కు చట్టం ప్రకారం..

విద్యా హక్కు చట్టం ప్రకారం 6 -14 సంవత్సరాల బడి ఈడు పిల్లలు 25 మంది ఉంటే ఆ ప్రాంతంలో ఒక పాఠశాలను, కిలోమీటర్ పరిధిలో కచ్చితంగా ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నత పాఠశాల, ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 615 రెవెన్యూ మండలాలు ఉండగా. కేవలం 412 మండలాల్లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండడం శోచనీయం. 203 మండలాల్లో జూ. కళాశాలలు లేవు. దీంతో పదో తరగతి పాసైన విద్యార్థులు కళాశాల విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల విద్యార్థులు పలు వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు పలువురు రోజువారీ రవాణా ఛార్జీలు తదితరాలు భరించలేక చదువును మధ్యలోనే వదిలేసి డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్నారు. పాఠశాల విద్య విషయంలో లాగే కళాశాల విద్యపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి మండలానికో ప్రభుత్వ జూ.కళాశాల, నియోజకవర్గ కేంద్రానికో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మేలు చేసిన వారవుతారు.

బోధనలో సాంకేతికత అవసరం!

మన రాష్ట్రంలోని దాదాపు చాలా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటికీ పురాతన నల్లబల్లలు, దుమ్ము తో కూడిన సుద్ధ ముక్కలతో తరగతి గది బోధన కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. నేటి 5జి,6జి సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న మనం ఇంటర్మీడియట్ విద్యలో కనీసం సాంకేతికతతో కూడిన విద్యను అందించుటకు ఎలాంటి సౌకర్యాల ఏర్పాటు చేయకపోవడంతో డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్వహణ జరగడం లేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మనబడి మన బస్తీ- మనబడి కార్యక్రమం ద్వారా 7,289 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని కొన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈరోజు 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనతో కార్పొరేట్ పాఠశాలలను మైమరిపించేలా తీర్చిదిద్దబడ్డాయి. కానీ ఇంటర్మీడియట్ విద్యలో కనీసం గ్రీన్ చాక్ బోర్డు , మార్కర్ బోర్డ్స్, దుమ్ములేని సుద్ధ ముక్కల ద్వారా బోధన చేసే సదుపాయాల కల్పన చేయకపోవడంతో 37 సంవత్సరాల క్రితం ఏర్పడిన జాతీయ విద్యా విధానం(1986)లో పేర్కొన్న పురాతన నల్లబల్ల బోధనే జరుగుతుంది.

ఈ గ్రూపులను ప్రోత్సహించాలి!

కేవలం ఎంపీసీ, బైపీసీ కోర్సులపై మక్కువతో ఎంసెట్, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలలో మంచి ర్యాంకు సాధించి జీవితంలో మంచిగా సెటిల్ కావాలనే ఆశయంతో పేరెంట్స్ మరియు విద్యార్థులు సైన్స్ కోర్సులపై మక్కువ చూపుతూ సామాజిక శాస్త్రాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. కానీ విద్యార్థులు భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ ఉద్యోగాలు సాధించాలంటే హెచ్ఈసీ, సీఈసీ తదితర సామాజిక శాస్త్రాల గ్రూపులను కళాశాలల్లో ప్రోత్సహిస్తే బాగుంటుంది. తగిన పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను కళాశాల గ్రంథాలయాలలో సమకూర్చినట్లయితే విద్యార్థులు ఎలాంటి ఖర్చు లేకుండా అభ్యసించడానికి వీలు కలుగుతుంది.

వ్యయప్రయాసలకు ఓర్చి కళాశాలలకు రాలేని బాల, బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ వసతులు ఏర్పాటు చేసి వాటితో పాటు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అనుగుణంగా సహేతుకమైన నిర్ణయాలు తీసుకుని వాటిని సక్రమంగా అమలు చేస్తే మంచిది. విద్య, వైద్య రంగాలపై వెచ్చించే ప్రతి పైసాకు ప్రతిఫలం దక్కుతుందనేది గమనించాల్సిన విషయం. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులేస్తుందని ఆశిద్దాం.

- షేక్ జాన్ పాషా

73868 47203

Tags:    

Similar News