పుస్తకాల పండుగ 2022 – సంతోషాలూ.. విచారాలూ..

పుస్తకాల పండుగ 2022 – సంతోషాలూ.. విచారాలూ.. Joys and Sorrows of hyderabad book fair 2022

Update: 2023-01-04 18:45 GMT

పుస్తకాల పండుగ 2022 గురించి రాయవలసింది చాలా ఉంది. ఈ పదకొండు రోజుల ఒక మహాద్భుతంగా భావించి కళ్లూ చెవులూ హృదయమూ విప్పార్చుకుని, ఆ లక్షల పుస్తకాలనూ వేలాది పుస్తక ప్రేమికులనూ తమలోకి తీసుకుని సంభ్రమాశ్చర్యానందాలకు గురైనవాళ్లూ ఉన్నారు. ఏవేవో ఊహించుకుని, ఆ ఊహలకూ అక్కడి వాస్తవానికీ సరిపడక, కలిసిన మనుషులతో ఆత్మీయంగా నాలుగు మాటలు చెప్పుకోనివ్వని జనసమ్మర్దపు ఒత్తిడిలో ఒకింత నిరాశపడినవాళ్లూ కొద్దిమంది ఉన్నారు.

తొలి బుక్ ఫేర్ నాటి నుంచీ ముప్పై ఐదేళ్లుగా దాదాపుగా అన్ని బుక్ ఫేర్లూ చూసినవాడిగా, 15 సంవత్సరాలుగా వీక్షణం స్టాల్‌తో బుక్ ఫేర్‌లో పాల్గొంటున్నవాడిగా నాకూ 2022 బుక్ ఫేర్‌కు సంబంధించి నా సంతోషాల్ని మొదట పంచుకుంటాను. మొట్టమొదట, పుస్తకాల పండుగ ప్రాంగణానికి మిద్దె రాములు పేరు, లోపల సభావేదికకు అలిశెట్టి ప్రభాకర్ పేరు పెట్టడం, ప్రభాకర్ కవితా పంక్తులతో ఒక పెద్ద కటౌట్ పెట్టడం ప్రభాకర్ స్నేహితుడిగా చాలా చాలా సంతోషం. ఒక తెలంగాణ బహుజన మౌఖిక కవికీ, కళాకారుడికీ, మరొక తెలంగాణ బహుజన వచన కవికీ, చిత్రకారుడికీ దక్కిన, దక్కవలసిన గౌరవం అది. రెండో సంతోషం, జనమే జనం. మహా జన సందోహం. గొప్ప ఉత్సాహం వెల్లివిరిసిన సందర్భం. వందలాది వేలాది మంది. అందులోనూ ఎక్కువమంది ఇరవైల్లో, ముప్పైల్లో ఉన్న యువతీ యువకులు. ప్రతివారి చేతిలోనూ పుస్తకాల కట్టలు, లేదా బరువుకు తెగిపోతున్న పుస్తకాల సంచులు. ప్రతి దుకాణంలోనూ లోపలికి మరొక మనిషి చొరబడడానికి వీలు లేనంత కిటకిట. మూడు వందల పుస్తకాల దుకాణాలు. అందులో కనీసం ముప్పై అయినా తప్పకుండా ఒక్కొక్కటీ కొన్ని గంటలు గడపదగినవి.

బుక్ ఫేర్‌ వేదిక మీద ఎక్కువ కార్యక్రమాలు సీరియస్‌గా జరగలేదని, చాలా మంది అక్కడ కూచున్నప్పటికీ, అందరూ ఆసక్తితో కూచున్నవాళ్లు కారని, బుక్ ఫేర్‌లో తిరిగిన అలసట తీర్చుకోవడానికి కూచున్నవాళ్లని, సభల్లో, ఉపన్యాసాల్లో ప్రభుత్వ భజన మోతాదు ఎక్కువయిందని విమర్శలు. వీటితోపాటు బుక్ ఫేర్ ఏర్పాట్లలో జరిగిన లోపాలు కూడా ప్రస్తావించుకోవాలి.

రోజుకు యాభై వేలు, డెబ్బై వేలు చొప్పున మొత్తం మీద పది లక్షల దాకా సందర్శకులు వచ్చారని ఒకవైపు సంతోషం ఉండగానే, వారికి తగిన మంచినీటి ఏర్పాట్లు గాని, టాయిలెట్ సౌకర్యాలు గాని లేవనే విచారం ఉంది. అంత పెద్ద జన జాతరలో తిరిగీ తిరిగీ అలసిపోయినవాళ్లకు కూచోవడానికి సభా వేదిక దగ్గర తప్ప మరొక చోట కుర్చీలు లేవు. అక్కడ కూచుంటే బలవంతపు శ్రోతలు కావాలి. పది లక్షల మంది సందర్శించారంటే కేవలం టికెట్ల అమ్మకం మీదనే కోటి రూపాయల ఆదాయం వచ్చి ఉండాలి. ఒక్కొక్క స్టాల్‌కు పదిహేను వేల చొప్పున మూడు వందల స్టాల్స్ కు నలబై ఐదు లక్షలు వచ్చి ఉండాలి. ప్రాంగణం లోనూ బైటా అనేక సంస్థలు ఇచ్చిన వ్యాపార ప్రకటనల హోర్డింగులున్నాయి గనుక వాటి ఆదాయమూ కొంత ఉండి ఉండాలి. మరి అవసరానికి తగ్గట్టు కాకపోయినా, కనీసంగానైనా మంచినీటి సౌకర్యమూ, టాయిలెట్ సౌకర్యమూ ఎందుకు కల్పించలేకపోయారు? ఫుడ్ పార్క్ దగ్గర అన్ని తినుబండారాల ధరలూ సాధారణ ధరల కన్న ఎక్కువగానే ఉన్నాయి.

అన్నిటికన్నా ముఖ్యంగా, ఇది పుస్తకాల ప్రచురణకర్తలకూ, రచయితలకూ, పాఠకులకూ, మొత్తంగా పుస్తకానికి, పుస్తక వ్యాపార భాగస్వాములకు మాత్రమే సంబంధించిన ప్రొఫెషనల్ బుక్ ఫేర్‌గా కాకుండా అధికారంలో ఉన్నవారి భజనకు మరొక వేదికగా మారడం విచారకరమైన అంశం. కొన్ని డజన్ల చోట్ల ముఖ్యమంత్రి, ఆయన కొడుకు నిలువెత్తు బానర్లు, కటౌట్లు, హోర్డింగులు, వేదిక మీద కొన్ని వందల సార్లు అధికారంలో ఉన్నవారి మీద మితిమీరిన ప్రశంసలు – అవి బుక్ ఫేర్‌కు అవసరమా? గ్రౌండ్ ఉచితంగా ఇవ్వడం ప్రభుత్వం తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత. అది ఎవరి మెహర్బానీ కాదు, ఎవరికీ కృతజ్ఞతలు చెప్పవలసిన విషయం కాదు. నిజానికి లోపల ప్రభుత్వ స్టాల్స్ ఉన్నాయి గనుక, వాటి పనే అది గనుక వారు ప్రశంసలూ భజనలూ చేసుకుంటారు. బుక్ ఫేర్ సొసైటీ ఆ పని చేయవలసిన అవసరం లేదు.

చివరిగా, బుక్ ఫేర్ సందర్శకులకు, పాఠకులకు, చిన్న పుస్తక విక్రేతలకు, ప్రచురణకర్తలకు, పుస్తక విక్రేతలందరికీ కొన్ని సూచనలు

1. బుక్ ఫేర్ సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కలిగించాలి. మంచి నీరు, టాయిలెట్లు, కూచునే ఏర్పాట్లు కల్పించడం, ఫుడ్ కోర్టులో మితిమీరిన రేట్లు లేకుండా నియంత్రించడం బుక్ ఫేర్ నిర్వాహకుల బాధ్యత. 2. బుక్ ఫేర్‌లో సందర్శకుల పాత్ర ఎంతటిదో చిన్న పుస్తక విక్రేతల, ప్రచురణకర్త-విక్రేతల పాత్ర అంతటిది. స్టాల్ అద్దెలు నానాటికీ పెంచుతూ పోవడం వల్ల పెట్టిన పెట్టుబడి డబ్బు కూడా తిరిగి రాని స్థితి కొన్ని స్టాళ్ళకు ఏర్పడుతున్నది. ఇటువంటి స్టాళ్లను దృష్టిలో ఉంచుకుని అద్దె నిర్ణయించి, ఆ బెనిఫిట్ కూడా పుస్తకాల కొనుగోలుదార్లకు అందేలా చూడాలి. 3. సందర్శకులలో ప్రతి ఒక్కరూ ప్రతి స్టాల్ ముందు నుంచి తప్పనిసరిగా వెళ్లేలా డిజైన్ చేయాలి. ఇప్పుడు చేస్తున్న పద్ధతి చాలా మంది సందర్శకులు కొన్ని స్టాళ్లను అసలు చూడకుండానే వెళ్లిపోయే పరిస్థితి కల్పిస్తున్నది. అందరికీ సమానమైన ఆక్సెస్ ఉండేలా ఏర్పాట్లు చేయాలి. 4. బుక్ ఫేర్‌లో పుస్తకమే, పుస్తకానికి ప్రోత్సాహమే ఏకైక ప్రమాణంగా ఉండాలి, మరే ఇతర ఆకర్షణలూ ప్రలోభాలూ లౌల్యాలూ ఇష్టాయిష్టాలూ ఉండగూడదు.

పుస్తకావిష్కరణకు రూ. 3 వేల వసూలా

హైదరాబాద్ బుక్ ఫేర్‌లో అలిసెట్టి ప్రభాకర్ వేదికపై పుస్తకావిష్కరణలు జరిగాయి. కానీ ఒక్కో పుస్తకావిష్కరణకు రూ. 3 వేలు రెంట్ వసూలు చేసారు. రచయితల పరంగా చూస్తే ఇది నిలువుదోపిడీ. ఈ భారం మోయలేమని కొందరు రచయితలు తమకు తెలిసిన బుక్ స్టాల్స్ వద్దే తమ పుస్తకాల ఆవిష్కరణ జరుపుకున్నారు. దాంతో పక్కనున్న స్టాల్స్ వారు తమ షాపుల్లోకి జనం రాకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అలిసెట్టి ప్రభాకర్ వేదిక నుంచే అలాంటి వారిని నిర్వాహకులు తీవ్రంగా హెచ్చరించారు. స్టాల్స్ ఇవ్వడం అనేది ప్రభుత్వ విధి. కానీ మా ఇష్టప్రకారం నిర్వహిస్తాం అని నిర్వాహకులు భావించడం సమంజసం కాదు. భవిష్యత్తులో జరిగే బుక్ ఫేర్‌ల సందర్భంగా ఇలాంటి అవాంఛనీయమైన పరిణామాలనుంచి వైదొలగితే మంచిది.

ఎన్. వేణుగోపాల్

వీక్షణం సంపాదకులు

9848577028

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Also Read....

సామాన్యులకు భారంగా మారుతున్న రైలు ప్రయాణం 


Tags:    

Similar News