జోడో యాత్ర ముగిసింది- ఇక జోడీ యాత్ర కావాలి

Jodo Yatra is over we need political Jodi Yatra

Update: 2023-01-31 18:30 GMT

న్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా ఐదు నెలల పాటు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒక మంచి కార్యక్రమం. విజయవంతంగా, నిరాటంకంగా దాన్ని పూర్తిచేసిన ఆయన అభినందనీయులు. ఇక జోడీ యాత్ర చేయాల్సి ఉంది అని నేనంటే అపార్థం చేసుకోవద్దు. ఆయన ఈ మధ్య ఇంటర్వ్యూ ఇస్తూ 'పెళ్లికూతురుని వెదకాల్సి ఉందని' అన్నాడాయే. ఆ ఉద్దేశ్యంతో జోడీ యాత్ర చేయమనడం లేదు. చెప్తున్నదల్లా రాజకీయ కోణంలో. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడినా జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేదు సరికదా ఆ దగ్గరకు కూడా రాలేదన్నది కఠిన వాస్తవం. ఇప్పుడు చూడాల్సింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో తన బలం పెంచుకోవడంతో పాటు, కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలను వెదుక్కోవడం. అవసరమైతే కొంచెం తగ్గి, ప్రత్యామ్నాయం బలంగా తయారయ్యేలా సర్దుబాటు ధోరణితో ముందుకు వెళ్లడం.నాయకత్వం తనకే కావాలన్న ధోరణి కాకుండా మంచి టీం ప్లేయర్‌గా వ్యవహరించగలిగేలా తమనుతాము మలచుకోవడం. ఇది ఆ పార్టీకే కాకుండా, రాజకీయ రంగానికే మంచి చెయ్యగల కార్యక్రమం.

ఈ యాత్రతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఉపయోగం ఎంతన్నది పక్కన పెడితే, రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్ట ఎంతో కొంత పెంచిందన్నది వాస్తవం. జనాల్లో ఆయన ఏమాత్రం సీరియస్‌నెస్, నిలకడ లేని నేత అన్న నెగెటివ్ అభిప్రాయాన్ని కొంత వదిలించుకున్నారు. గ్రామీణ భారతం, ప్రస్తుత సమస్యల పట్ల కొంత అవగాహన పెరిగే ఉంటుంది. ఆలోచనల్లో స్పష్టత కనబడుతోంది. సర్జికల్ స్ట్రైక్‌పై తన పార్టీలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన అనవసరపు వ్యాఖ్యలని వెనకేసుకు రాకుండా హుందాగా స్పందించడమే అందుకు ఉదాహరణ. అయితే ఈ యాత్ర ఆయనకు మొదటి అడుగు. అంతే. తన పార్టీని చక్కదిద్దడానికి, జాతీయ స్థాయిలో గుర్తింపదగ్గ ఫోర్స్‌గా తయారుచెయ్యడానికి ఇంకా మరిన్ని అడుగులు పడాలి. అది కష్టమైన మార్గం కూడా. ఆయనకు ఆల్ ది బెస్ట్.

- డా. డి.వి.జి.శంకరరావు

94408 36931

Also Read...

నేచురోపతి వైద్యులకు మొండిచెయ్యి 


Tags:    

Similar News