రాజకీయాల్లో స్నేహమైనా.. శత్రుత్వమైనా అవసరాలకు అనుగుణంగానే ఉంటాయి. ఇక్కడ ఎవరూ శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు.. కేవలం తమ తమ అవసరాలకు అవతలివారి బలహీనతలు వాడుకోవడం తెలిసినవారే ఉంటారు. ఇదంతా ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీకి ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. తెలంగాణలో బీజేపీతో పొత్తుకు సిద్ధం కావడంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అసలు దీని పర్యావసానాలు తెలిసే పవన్ ఈ రాంగ్ రూట్ ఎంచుకున్నారా లేక ఎవరైనా పావుగా వాడుకుంటున్నారా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో చంద్రబాబు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత అదే సమయంలో టీడీపీపై సానుకూలత పెరిగిందన్న మాట వాస్తవం. ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తు కంటే టీడీపీతో ఉండటమే బెటర్ అని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సరైనదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే జనసేన సొంతంగా పోటీ చేసినా.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. ఎన్ని సీట్లు వస్తాయి అని లెక్కలు వేసుకోవడం కంటే.. ఓట్లు చీలడం వల్ల అధికార వైసీపీకి కలిసివచ్చేది. కానీ, టీడీపీతో జనసేన పొత్తు వల్ల వైసీపీకి ఈసారి టఫ్ ఫైట్ తప్పదన్న సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది. ఏపీలో పవన్ తీసుకున్న నిర్ణయం వల్ల అతడు రాజకీయంగా పరిణితి చెందాడని అనుకున్నా.. తెలంగాణలో తీసుకున్న నిర్ణయం మాత్రం తీవ్ర నిరాశ పరిచిందని అతడి హార్డ్కోర్ అభిమానులే తలలు పట్టుకుంటున్నారు.
పొంగులేటిని కట్టడి చేసేందుకేనా?
ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు కాంగ్రెస్ ఖాతాలో వేస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగంగా బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. జిల్లాలో గులాబీ పార్టీకి ఉనికినే దెబ్బ కొట్టేలా ప్రణాళికలు వేస్తున్న పొంగులేటిపై సహజంగానే ఆ పార్టీ అనేక ఎత్తులు వేస్తున్నది. అయితే, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని భావించిన సీపీఎం అనూహ్యంగా ఒంటరిగా బరిలో దిగడం.. అందులోనూ ఖమ్మం జిల్లాలోనే 4 స్థానాల్లో పోటీ సిద్ధమవడం వెనుక బీఆర్ఎస్ మతలబు లేకపోలేదన్న ఊహాగానాలు వస్తున్నాయి. మరోపక్క ఏపీలో బీజేపీతో పొత్తుకు నో అన్న పవన్.. తెలంగాణలో మాత్రం సిద్ధం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి తెలంగాణలోనూ జనసేన పార్టీ ఉన్నా.. పవన్ ఫోకస్ మొత్తం ఏపీ పైనే ఉన్నది. ఆయనకు ఉన్న బలం కూడా అక్కడే. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో ఓటమి పాలైతే పార్టీకి బేస్ ఉన్న ఏపీలో ఆ ప్రభావం 100కు 200 శాతం పడడం ఖాయం.. మరి ఇంత డ్యామేజీ జరిగే ప్రమాదం ఉన్నా.. పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా సూసైడ్ అటెంప్ట్ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, బీఆర్ఎస్కు రహస్య మిత్రుడిగా ఉన్న బీజేపీ.. పొంగులేటిని కట్టడి చేసేందుకే పవన్ను పావుగా ప్రయోగించిందన్న ఊహాగానాలు లేకపోలేదు. ఎందుకంటే పవన్ ప్రకటించిన 8 స్థానాల్లో నాలుగు ఖమ్మంలోనే ఉండటం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
టీడీపీకీ ముప్పే..
తెలంగాణలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుని.. ఏపీ రాజకీయాలపై ఆ ప్రభావం పడకుండా చూసుకున్నా, ఆ పార్టీకి ఇప్పుడు జనసేన తీసుకున్న నిర్ణయం శరాఘాతమే. పొత్తు పొడిచిందని సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటున్న సమయంలో.. తెలంగాణలో పోటీ చేయడం జనసేన తీసుకున్న తప్పుడు నిర్ణయమేనని తెలుగు తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. తెలంగాణలో జనసేనకు వచ్చే ఓట్ల శాతం.. ఏపీలో అధికార పార్టీకి ప్రచార అస్త్రంగా మారుతుందని అంటున్నారు. దీనివల్ల టీడీపీపై ఆ ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదని విమర్శిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం బీజేపీలోని పెద్దల ఒత్తిడి మేరకే పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీని దెబ్బకొట్టేందుకు ఆత్మహత్యాసదృశ్య నిర్ణయాలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు. ఏది ఏమైనా జనసేనతో పాటు వపన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యాన్ని ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలే తేల్చబోతున్నాయన్నది సుస్పష్టం.
ఎస్పీ హరీశ్
sripharish@gmail.com