జమిలి ఎన్నికలతో రాష్ట్రాల ఎజెండాకు ప్రమాదం!

భారతదేశం చాలా వైవిధ్యం గల దేశం. ప్రాంతీయ ప్రత్యేకతలు, విభిన్న భాషలు, భిన్న మతాలు గల దేశం. సామాజికంగా ఆహారం దగ్గర నుండి ఆచార

Update: 2024-09-26 01:00 GMT

భారతదేశం చాలా వైవిధ్యం గల దేశం. ప్రాంతీయ ప్రత్యేకతలు, విభిన్న భాషలు, భిన్న మతాలు గల దేశం. సామాజికంగా ఆహారం దగ్గర నుండి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల పరంగా ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు పరిగణనలోకి తీసుకుని దీనికి తగిన పార్లమెంటరీ తరహా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య విధానాన్ని పెంపొందించడానికి రాజ్యాంగంలోని 1వ ఆర్టికల్ ఇండియాను రాష్ట్రాల కలయికగా పేర్కొన్నది. 

అనాడు రాజ్యాంగ నిర్మాతలు కేంద్రానికీ, రాష్ట్రాలకీ మధ్య రాజ్యాంగ బద్దంగా స్పష్టమైన విభజన రేఖలు గీశారు. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితాల రూపంలో అధికారాల విభజన చేశారు. ఎన్నికలలో ప్రజలు తీర్పు చెప్పడానికి ఇవి ప్రాతిపదికలు అవుతున్నాయి. అందుకే జాతీయ స్థాయిలో లోక్‌సభకు జరిగే ఎన్నికలలో వివిధ పార్టీలు జాతీయ ఎజెండాను రూపొందించుకొని ఎన్నికల ప్రచార సరళిలో పాల్గొంటారు.

వేర్వేరుగా తీర్పునివ్వడం కష్టతరమైన పనే!

కేంద్ర జాబితాలోని దేశ రక్షణ, పౌరసత్వం, కరెన్సీ, బ్యాంకింగ్, రైల్వేలు, విమానయానం, నౌకాయానం, విదేశాంగ విధానం, ఆధారపు పన్ను, న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఆయా పార్టీలు ప్రకటించే విధివిధానాల ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలోనైతే ప్రధానంగా ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా కొనసాగుతుంటుంది. రాష్ట్రాల్లో పోటీ చేసే ఆయా పార్టీలు రాష్ట్రీయ ఎజెండాను ప్రజల ముందు ఉంచి ఎన్నికల్లో పాల్గొంటారు. రాష్ట్ర జాబితాలోని శాంతి భద్రతలు, సంక్షేమ పథకాలు, విద్యా, వైద్యం, వ్యవసాయం, స్థానిక సుపరిపాలన వంటి అంశాల ఆధారంగా రాష్ట్రాలలో ప్రజలు ఎన్నికల తీర్పు చెబుతారు. కానీ ఈ రెండింటికి ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలు జాతీయ, ప్రాంతీయ ఎజెండాలపై వేర్వేరుగా తన అభిప్రాయాలను వెలిబుచ్చడం కష్టతరమైన పనే.

వేరువేరుగా జరపడం వలన..

ప్రజలు జాతీయ జెండాకు, ప్రాంతీయ జెండాకు వేరువేరుగా ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు నాటి నుంచి నేటి వరకు జరిగిన భారత ఎన్నికల చరిత్రే నిదర్శనం. ఇందు కు ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలే నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటు బ్యాంకు లభిస్తే, 2024 జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకీ 35% ఓట్లు లభించాయి. ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 21% అదనంగా ఓట్లు లభించాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓట్లతో 39 సీట్లు సాధిస్తే, పార్లమెంటు ఎన్నికల్లోకి వచ్చేసరికి 17% ఓట్లతో ఒక్క సీటూ కూడా గెలుపొందలేకపోయింది. ఇక్కడ ఓట్ల శాతం సీట్ల శాతాన్ని పరిశీలిస్తే జాతీయ ఎజెండాకు, ప్రాంతీయ ఎజెండాకు మధ్య ప్రజలు స్పష్ట‌మైన వ్యత్యాసాన్ని చూపారు. ఇదే విధమైన వ్యత్యాసాన్ని అటు ఢిల్లీ ఎన్నికలలోను, అనేక రాష్ట్రా ల్లోనూ ప్రజలు చూపించారు. కానీ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల జాతీయ పార్టీలకు మేలు జరిగి ప్రాంతీయ పార్టీలకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం వల్ల ప్రజలు దేనికి తగ్గ తీర్పు దానికి చెప్పడానికి వీలు కలుగుతుంది.

ఈ తతంగమంతా చూస్తే..

జమిలి ఎన్నికల వల్ల ఈ అధికార విభజన సిద్ధాంతం దెబ్బతిని సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం లేకపోలేదు. జమిలీ విధానం ద్వారా జాతీయ అంశాలే తెరమీదికి వచ్చి ప్రాంతీయతకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుంది. కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్వర్యంలో జమిలీ ఎన్నికలపై ఒక కమిటీ వేయడం ఆ కమిటీ ఈ దేశ ప్రజలందరి మనోభావాలను 190 రోజులలోనే అధ్యయనం చేయడం, 47 రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించడం, 21,500 ప్రజల అభిప్రాయాలను తీసుకొని 18,626 పేజీల నివేదిక తయారు చేయడం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించడం, వెను వెంటనే కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం, పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో బిల్లు పెట్టడానికి సిద్ధం కావడం ఈ తతంగమంతా చూస్తుంటే బీజేపీకి ఎంత అధికార దాహం ఉందో స్పష్టమవుతుంది. జమిలీ ఎన్నికల విధానం 1970లో కాలగర్భంలో కలిసిన చరిత్రను చూసినంక కూడా బీజేపీ ఎందుకు ఇంత దుందుడుకుగా వ్యవహరిస్తుందో ప్రజాస్వామికవాదులు ఆలోచించి ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన సందర్భం ఇది.

పందుల సైదులు గౌడ్

తెలంగాణ విద్యావంతుల వేదిక

94416 61192

Tags:    

Similar News