ఈ శవ రాజకీయాలెందుకు?
ఈ శవ రాజకీయాలెందుకు?... jagan comments on chandrababu naidu pollitical yatras
ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడే తిరుగు బాటు ఉంటుంది.ఆ తిరుగుబాటులో భాగంగానే చంద్రబాబు బహిరంగ సభలకు జనం పోటెత్తుతున్నారు. అందుకు తగిన విధంగా పోలీసులను నియమించి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. కందుకూరులో చంద్రబాబు బహిరంగ సభకు జనం జన సునామీలా రావడంతో తొక్కిసలాట జరిగి 8 మంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోవడం బాధాకరమే. కానీ ఆ సందర్భంగా జరిగిన మరణాలను చంద్రబాబు చేసిన హత్యలుగా చిత్రించి మాట్లాడటం వైసీపీ నికృష్ట రాజకీయాలకు నిదర్శనం. పోటో షూట్‌ల కోసం- డ్రోన్ షాట్‌ల కోసం జనం లేకపోయినా వచ్చారని చూపించడం కోసం చిన్న గొందిలోకి జనాన్ని నెట్టి ఎనిమిది మందిని చంపేశారని, పుష్కరాల సందర్భంగా 29 మందిని చంపేశారని, ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉందా అని నర్సీపట్నం సభలో జగన్ రెడ్డి మాట్లాడారు. నిజానికి కందుకూరులో అన్నీ రాజకీయ పార్టీలు పెట్టిన చోటనే సభ నిర్వహించారు చంద్రబాబు. అయినా కావాలని ఇరుకు సందులో పెట్టారని అబద్దాలకు తెగబడ్డారు ముఖ్యమంత్రి, పోలీసు అధికారులు. పోలీసులు భద్రత కల్పిస్తే ఈ దుర్ఘటన జరిగేదా? ఇంతటి ఘటన జరగడానికి పోలీసులు కూడా బాధ్యత వహించాలి. కనీసం మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపడానికి కూడా మనస్సు లేని ముఖ్యమంత్రి శవ రాజకీయం చెయ్యడానికి మాత్రం పరుగెత్తుకొచ్చారు.
మీకో న్యాయం..మాకో న్యాయమా?
కందుకూరు సభలో ఎనిమిది మందిని చంద్రబాబు చంపేశారని ఇష్టానుసారం నోరు పారేసుకొంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి కుటుంబ సభ్యుల పాదయాత్రలో, జగన్ పాదయాత్రలలో, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ ప్రమాదాల్లో చనిపోయిన వారిని జగన్ రెడ్డి చంపేశారని అంగీకరిస్తారా? ఈ మరణాలకు మీరు బాధ్యత వహిస్తారా? 2018 మార్చి 27న సూళ్లూరుపేటలో జగన్ రెడ్డి మహాసంకల్ప యాత్ర తొక్కిసలాటలో అనంతపురం జిల్లాకు చెందిన రంగారెడ్డి అనే కార్యకర్త మృతి. 2019 మార్చి 27న తూర్పు గోదావరి, మండపేటలో జగన్ రెడ్డి బహిరంగ సభలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి. 2019 మార్చి 17న విజయనగరం జిల్లా, డెంకాడలో జగన్ రెడ్డి బహిరంగ సభ తొక్కిసలాటలో ఒకరు మృతి, 2019 ఏప్రిల్ 3న ఉమ్మడి గుంటూరు జిల్లా, పిడుగురాళ్లలో జగన్ సభలో కరెంట్ షాక్‌తో ఒకరు మృతి. 2022 ఆగస్టు 22న కృష్ణాజిల్లా, పెడనలో సీఎం సభలో మహిళ మాణిక్యమ్మ మృతి. 2012 నవంబర్ 19న ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో వైఎస్. విజయమ్మ సభలో ఒకరు మృతి. 2019 ఏప్రిల్ 5న చిత్తూరు జిల్లా, కుప్పంలో జగన్ రెడ్డి బహిరంగ సభలో తొక్కిసలాటలో ఒకరి మృతి. 2017 నవంబర్ 6న కడప జిల్లా, ఇడుపులపాయలో జగన్ రెడ్డి పాదయాత్ర మొదటి రోజునే వెంకటరమణ అనే కార్యకర్త తొక్కిసలాటలో మృతి.
ఆయనపై కేసు పెట్టగలరా?
అట్లాగే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి కచ్చులూరు బోటు ప్రమాదంలో 55 మంది జలసమాధి అయ్యారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన దుర్ఘటనలో 42 మంది మృతి, జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి 27 మంది మృతి, ఎల్జి పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి లీక్ అయిన విష వాయువులు పీల్చి 13 మంది మృతి, తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేక 23 మంది మృతి, ఈ మధ్య అనంతపురంలో కరంటు వైర్లు తెగిపడి 4గురు మృతి చెందారు. ఈ విధంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక ఘటనలలో పలువురు మరణించారు. వీటికి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? ఎక్కడ ఎంతమంది చనిపోయినా ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించి ఎరుగరు. మంచి పరిపాలన అందించి ప్రజలను మెప్పించి అధికారంలోకి రావడం చేతకాక, శవ రాజకీయాలు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ రెడ్డి ముఠా... నిజంగా చంద్రబాబు వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తే ఆయనపై హత్యానేరం కేసు పెట్టగలదా? ప్రభుత్వం అధికారం చేజారబోతుందని జగన్ శిబిరంలో కలవరం మొదలైనందువల్లే ఇలాంటి శవరాజకీయాలకు వైసీపీ గుంపు పాల్పడుతోందన్నది వాస్తవం.
నీరుకొండ ప్రసాద్
హైదరాబాద్
9849625610
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinionap@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672