ఆదివాసీల గురువు జాదోనాంగ్

Update: 2022-06-09 18:30 GMT

దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో గిరిజనులు ఉన్నారు కానీ, చరిత్రలో వారు విస్మరించబడిన యోధులుగానే మిగిలిపోయారు. అలాంటి గిరిజనులలో గురుస్థానంలో నిలిచినవారిలో మణిపూర్‌కు చెందిన జాదోనాంగ్ ప్రసిద్ధులు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవం'లో భాగంగా ఆ వీరులను మననం చేసుకునే సందర్భం ఇది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సంఘ సంస్కర్తగా, ధర్మభోధకురాలిగా, ధైర్య సాహసాలు ప్రదర్శించి పద్మభూషన్ బిరుదును పొందిన 'రాణి మా గైడ్ న్యూ'ను ఉన్నతస్థాయిలో తీర్చిదిద్దిన గురువు జాదోనాంగ్. ఆయన రాంగ్‌మెయి తెగకు చెందినవారు. 1905 జూన్ 10న మణిపూర్‌లోని టమెంగ్ లాంగ్ లో జన్మించారు.

వారి సంక్షేమం కోసం

హైపో జాదోనాంగ్ గొప్ప యుద్ధ వీరుడు. మెసొపొటేమియా యుద్ధ రంగంలో బ్రిటిష్ సేనతో యుద్ధం చేసినవాడు. ఈయనకు మెస్సే కింగ్‌గా పేరుంది. తర్వాత ఆయన తన ఆలోచనలను మార్చుకొని సైనికాధికారి పదవికి రాజీనామా చేసి భారతదేశానికి వచ్చారు. నాగా ప్రజల సమైక్యత, సంక్షేమం కోసం పనిచేయడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. నాగాలలో ఉన్న విభిన్నవర్గాలను ఒకే తాటిపైకి తేవడానికి ప్రయత్నించారు. ఆయన సంఘ సంస్కర్తగా పేరుగాంచారు. దేవాలయాలు నిర్మించారు. భక్తి గీతాలు, కీర్తనలు రచించారు.

జలియాంగ్ రాంగ్ విశ్వాసాలలో సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేశారు. ఆ సంస్కరణలతో కూడిన సంప్రదాయమే 'హరాకా' ఆధ్యాత్మిక ఉద్యమం. జలియాంగ్ రాంగ్‌లు ఈశాన్య ప్రాంతంలో స్థానిక వనవాసీ సమాజంలో ఒక భాగం. వీరు మణిపూర్, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాలలో వ్యాపించి ఉన్నారు. జేమె, లియాంగ్ మెయి, రాంగ్‌మెయి ఈ మూడు వర్గాల సమష్టి నామమే జలియాంగ్ రాంగ్. ఈ మూడు భాషాపర యాసలను 'కబుయి' 'కచ్చానాగా' అని మణిపూర్ పరిసరవాసులు పిలుస్తారు. యాంగ్ రాంగ్ తెగకు చెందిన ప్రజలు ముఖ్య అధిదేవత తికావో రాంగ్‌ను కొలుస్తారు. ఆయనను సృష్టికర్తగా పరమేష్టిగా భావిస్తారు. ఆయనే ప్రపంచాన్ని, దేవతలు,మానవులను సృష్టించారని నమ్ముతారు. ఇది హిందూ జీవన విధానం అని తెలుస్తున్నది. 1914 తర్వాత క్రైస్తవం ఈ తెగలలో ప్రవేశించి మతాంతరీకరణకు దారి తీసింది.

వారి సంస్కృతిని పరిరక్షిస్తూ

క్రైస్తవ మత వ్యాప్తిని గమనించిన హైపో జాదోనాంగ్ వనవాసీలకు గురువుగా మారి వారి ధర్మానికి తిరిగి చేరువ చేయడం కోసం కృషి చేశారు. భువన్ గుహను 'రాణి మా' దర్శించినప్పుడు అక్కడ ఒక మహా వ్యక్తిని చూశారు. ఆయనే జాదోనాంగ్. ఆయనను చూడగానే ఆధ్యాత్మిక గురువు దొరికినంత ఆనందంలో పొంగిపోయింది రాణి మా. ఆయన తేజోవంత దివ్య దర్శనం ఆమెను చాలా ప్రభావితం చేసింది. దీంతో ఆయనకు నమ్మినబంటుగా మారి చేదోడు వాదోడుగా నిలిచింది. వీరిద్దరి సమిష్టి కృషి కారణంగా హరాకా ఉద్యమం బలపడింది. పరంపరాగతంగా వస్తున్న నాగా సంస్కృతి విదేశీ ప్రభావానికి లోనుకాకుండా చూడటమే ఈ ఉద్యమ లక్ష్యం. అందుకే దీనిని హరాకా (పవిత్రము) అన్నారు.

ఈ ఉద్యమం మణిపూర్ పశ్చిమ జిల్లాలో, నాగాలాండ్ దక్షిణ ప్రాంతంలో, అస్సాంలోని ఉత్తర కభార్ ప్రాంతంలో ఉధృతంగా కొనసాగింది. బ్రిటిష్ పాలకుల గుండెలలో గుబులు రేపింది. జాదోనాంగ్‌ను పట్టుకోవడానికి వారు సకల ప్రయత్నాలు చేశారు. ఆయనను సమర్థిస్తున్న గ్రామాల నుంచి సామూహిక అపరాధ రుసుము వసూలు చేసేవారు. ఎవరూ ఆయనను సమర్థిస్తున్నట్లు అనుమానం కలిగినా జైలులో పెట్టేవారు. చివరకు ఒక రోజు జాదోనాంగ్, గైడిన్యూ భువన్ గుహలోని దేవతను పూజించి, కంచిరాన్‌కి వస్తుండగా మణిపూర్ రాజ్య బ్రిటిష్ ఏజెంట్, ఆ ప్రాంత డిప్యూటీ కమిషనర్ కుట్ర పన్ని జాదోనాంగ్‌ను నిర్బంధించారు. ఆయన నిత్యం ఆరాధిస్తుండే దేవతా మందిరాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 1931, ఆగస్ట్ 29న ఆయనపై దేశద్రోహం నేరం మోపి ఉరి తీశారు.

(నేడు జాదోనాంగ్ జయంతి)

గుమ్మడి లక్ష్మీనారాయణ

సామాజిక రచయిత,

9491318409

Tags:    

Similar News